విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేసేది పదో తరగతి వార్షిక పరీక్షలు. సంవత్సరమంతా కష్టపడి చదివి పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనకు గురవుతూ ఉంటారు. ఒత్తిడిని ఆదిగమించి, ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు. ప్రశాంత వాతావరణంలో చదువుకోవడంతో పాటు రోజు తీసుకునే ఆహారపు అలవాట్లలోనూ కొద్దిపాటి మార్పులు చేసుకుంటే సరి. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపేందుకు తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతో కీలకం. నచ్చిన ప్రదేశాలు, ఇష్టమైన వ్యక్తుల సమక్షంలో ఏకాగ్రతతో చదువుకోవడం ఎంతో మేలు. పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం కొన్ని సలహాలు, సూచనలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– షాబాద్, మార్చి 16
పదో తరగతి పరీక్షలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు పరీక్షలు బాగా రాయాలంటే తల్లిదండ్రుల పాత్ర కీలకం. పిల్లలకు చదువురాదని, మార్కులు తక్కువగా వస్తాయని, ఫెయిల్ అవుతారని, వారి స్నేహితుల కన్నా వెనుకపడ్డావంటూ నెగెటివ్ ధోరణితో కించపర్చొద్దు. ఈ ఒత్తిడి విద్యార్థి మనుసుపై దాడి చేస్తుంది. ప్రతి విద్యార్థి ఒత్తిడిని ఎదుర్కోవడానికి ప్రయత్నించి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయానికి చేరువ కావచ్చు.
పరీక్షల సమయంలో ఏదైనా సందేహం వస్తే అది నివృత్తి కాకపోతే దానిమీదకే ఆలోచనలు పోయి సమయం వృథా అవుతుంది. ఉపాధ్యాయులు అప్పటికప్పుడే నివృత్తి చేసి వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి. ప్రశ్నాపత్రం విషయంలో ఉన్న సందేహాలను నివృత్తి చేస్తూ పరీక్ష సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సూచనలివ్వాలి.
ముందుగా ప్రతి విద్యార్థి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇదివరకే కొన్ని పరీక్షలు రాసి ఉంటారు.. ఆ పరీక్షల్లో తమ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో బేరీజు వేసుకోవాలి. ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నామనే విషయాన్ని ఎవరికి వారు గ్రహించుకోవాలి. ఏ పాఠ్యాంశాలలో పొరపాట్లు చేస్తున్నది పాయింట్ల వారిగా నోట్ చేసుకుని అవసరమైనంత మేరకు అభ్యసించాలి.
పదో తరగతి పరీక్షలకు సిద్దమవుతున్న విద్యార్థుల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉండేలా చూడాలి. పిల్లల్లో మరింత ఒత్తిడిని పెంచే వ్యాఖ్యలు చేయకూడదు. అంతేకాక పిల్లలు ఎక్కువ సమయం చదువుకే కేటాయిస్తారు. కాబట్టి వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవాలి. సమయానుకూలంగా తగిన ఆహారం అందిస్తూ ఉండాలి. అవసరమైనంత నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది.
విద్యార్థిలో ఉన్న ఒత్తిడి అతడి మిత్రుడికి కచ్చితంగా తెలుస్తుంది. ఒత్తిడిని అధిగమించేలా ఆత్మవిశ్వాసం నింపేది స్నేహితులే. అధ్యాపకులు, తల్లిదండ్రుల మాటల కంటే మిత్రుల మాటలే విద్యార్థిపై అధిక ప్రభావం చూపిస్తాయి. మంచి మిత్రుడెపుడూ ఒత్తిడికి గురయ్యే ప్రతిక్షణాన్ని పసిగడుతూ ఉంటాడు. ఒత్తిడి చీకటిలా పరుచుకుంటున్న సమయంలో చిరుదివ్వెలా మనుసులో వెలుగు నింపే మార్గదర్శి అతడే. చిరునవ్వుతో ఒత్తిడిని అధిగమిస్తూ పరీక్షలు రాస్తే మంచి ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉన్నదని నిపుణులు సూచిస్తున్నారు.
బాగా తినాలి.. బాగా చదవాలి.. బాగా పరీక్షలు రాయాలి. ఈ మూడు అంశాలను విద్యార్థులు దృష్టిలో పెట్టుకోవాలి. పరీక్షల్లో బాగా రాయాలనే ఆత్రుతతో సమయపాలన లేకుండా చదవడం మంచిది కాదు. నిద్రలేమితో మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. పరీక్షా కేంద్రాల్లో కండ్లు మూతపడుతుంటాయి. కునుకు తీయాల్సి వస్తుంది. ఏకాగ్రత కోల్పోతుంది. చదివినవి గుర్తుకురావు. సమాధానాలు సరిగా రాయలేరు. అందుకే పరిపూర్ణంగా నిద్ర పోవాలి. విద్యార్థులు రోజుకు ఆరు గంటలకు తగ్గకుండా నిద్రపోవడం తప్పనిసరి.
ఏడాది పొడవునా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థుల్లో కొందరు వార్షిక పరీక్షల సమయంలో అనారోగ్యానికి గురై ఫలితాల సాధనలో వెనుకబడిన సందర్భాలు అనేకం. పిల్లలు తమ ఆర్యోగాన్ని కాపాడుకోవడంతోపాటు ఒత్తిడిని దూరం చేసుకునేందుకు రోజువారీగా తీసుకునే ఆహారంలో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవాలి.
పరీక్షల సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండడం మేలు. సాత్విక ఆహారంతో శరీరానికి కావాల్సిన పోషకాలు లభించడంతోపాటు ఉత్సాహం చేకూరుతుంది. పండు,్ల కూరగాయలు తీసుకుంటే మెదడు చురుగ్గా పని చేస్తుంది. పరీక్షకు వెళ్లే సమయానికి మూడు గంటల ముందే తేలికపాటి అల్పాహారం తీసుకోవాలి. మధ్యాహ్నం, రాత్రి బలవర్ధకమైన ఆహారం తక్కువ మోతాదులో తీసుకుంటే మంచిది.