వికారాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. రాష్ట్రంలో ఏ జిల్లాలో లేని విధంగా జిల్లాలో ఉపాధి హామీ పనులకు ఏకంగా లక్ష మందికిపైగా కూలీలు హాజరవుతున్నారు. గత వారం రోజులుగా జిల్లాలో ప్రతి రోజూ లక్ష మందికిపైగా కూలీలు హాజరవుతుండడంతో కొత్త రికార్డు నమోదైంది. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో రైతులతోపాటు రోజువారీ కూలీలు కూడా అధిక సంఖ్యలో ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. భూగర్భజలాలు అడుగంటి పోవడంతో కొంతమేర సాగైన వరి కోతలు కూడా ప్రారంభమైన దృష్ట్యా జిల్లాలోని రైతులు, కూలీలంతా ఉపాధి పనులవైపు మళ్లారు.
మరో రెండు నెలలపాటు వ్యవసాయ పనులేమీ ఉండవు కాబట్టి ఊరూరా ఇంటిల్లిపాది ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. దీంతో జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నారు. కరోనా సమయంలో అత్యధికంగా 1.06 లక్షల మంది కూలీలు హాజరుకాగా, ఆ రికార్డును మించి ఉపాధి హామీ పనులకు కూలీలు హాజరయ్యేలా జిల్లా ఉన్నతాధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటూ ప్రతి నిత్యం ఉపాధి హామీ పనులపై సమీక్ష చేస్తున్నారు. గురువారం వికారాబాద్ జిల్లాలో ఉపాధి హామీ పనులకుగాను అత్యధిక సంఖ్యలో కూలీలు హాజరయ్యారు. గత నెలతో పోలిస్తే ఈనెలలో ఉపాధి పనులకు హాజరయ్యేవారు భారీగా పెరగడం గమనార్హం.
జిల్లావ్యాప్తంగా గత నెలలో జిల్లాలో రోజుకు 40 వేల వరకు కూలీలు ఈ పనులకు హాజరుకాగా, ప్రస్తుతం హాజరయ్యే కూలీల సంఖ్య రోజుకు 1,04,806 మందికి పెరిగింది. ఈనెలాఖరులోగా పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య 1.30 లక్షలు దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 59.85 లక్షల పనిదినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించారు, గతేడాదితో పోలిస్తే పనిదినాల సంఖ్యను 3 లక్షల వరకు తగ్గించడం గమనార్హం. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.300 కూలీ డబ్బులను అందజేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం మొదలైన పదిహేను రోజుల్లో కూలీలకు రూ.14.49 లక్షల కూలీ డబ్బులను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ చేశారు. జిల్లావ్యాప్తంగా 1,83,309 జాబ్‌కార్డులుండగా 3,77,087 మంది కూలీలు ఉన్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. గత నెలతో పోలిస్తే ఈ నెలలో 60 వేలకుపైగా కూలీలు పెరిగారు. జిల్లాలో 566 గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు కొనసాగుతున్నాయి. ఎక్కువగా పెద్దేముల్ మండలంతోపాటు మర్పల్లి, ధారూరు, కులకచర్ల, కోట్‌పల్లి మండలాల్లో పనులకు అధికంగా హాజరవుతున్నారు. మరోవైపు జిల్లాలో హరితహారంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటిఊట గుంతల నిర్మాణం, మట్టి రోడ్ల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. పొలాలకు రోడ్లు వేయడం, ముళ్ల పొదలు తొలగించడం, అసైన్డ్ భూముల్లోని రాళ్లను తీసివేయడం, భూమిని చదునుచేయడం,
బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు అసైన్డ్ భూముల్లో చేపట్టనున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, భూ ఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువలో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను చేస్తున్నారు.
జిల్లాలో ఉపాధి హామీ పనులకు రికార్డు స్థాయిలో కూలీలు హాజరవుతున్నారు. ఈనెలాఖరులోగా 1.30 లక్షల మంది కూలీలు హాజరయ్యేలా చర్యలు చేపట్టాం. ఉపాధి హామీ పనుల్లో చేసిన పనులకు సంబంధించి ఎప్పటికప్పుడు ఎఫ్‌టీవో జనరేట్ చేయాలని ఆదేశించాం. ఎండ తీవ్రత దృష్ట్యా మధ్యాహ్నం 12 గంటల్లోపు ఉపాధి హామీ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించాం.
– వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి