కులవృత్తులకు పూర్వ వైభవం తేవడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉమ్మడి పాలనలో నిరాదరణకు గురైన కులవృత్తులు సర్కార్ చర్యలతో స్వరాష్ట్రంలో ఓ వెలుగు వెలుగుతున్నాయి. దేశంలో ఎకడా లేని విధంగా సబ్పిడీ గొర్రెల పంపిణీ, ఉచితంగా చేపపిల్లల పంపిణీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. తాజాగా మరో కొత్త పథకంతో కులవృత్తులకు మరింత వైభవం తెచ్చే దిశగా ముందుకెళ్తున్నది. కులవృత్తే ప్రధాన జీవనాధారంగా బతుకుతున్న కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున ఆర్థికసాయం అందించి వారికి ఆర్థిక తోడ్పాటు అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో మంత్రి వర్గం ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి సబ్ కమిటీని కూడా నియమించగా.. త్వరలోనే విధివిధానాలు ఖరారు కానున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో వేల మంది వృత్తిదారులకు లబ్ధి చేకూరనున్నది. సర్కార్ నిర్ణయంపై వివిధ సంఘాల నాయకులు, వృత్తిదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.
-ఇబ్రహీంపట్నం, మే 20
సీఎం కేసీఆర్‌తోనే పేదలకు మేలు
సీఎం కేసీఆర్‌తో పేదలకు ఎంతో మేలు కలుగుతున్నది. పేదల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారు. ఇప్పుడు కుల వృత్తులను నమ్ముకుని బతుకుతున్న వారికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేయాలన్న నిర్ణయంతో ఎన్నో కుటుంబాల్లో వెలుగులు నిండను న్నాయి. కుల వృత్తుల వారు ఆర్థికంగా బలపడుతారు.
-కుమ్మరి వెంకటేశ్, బొంరాస్‌పేట
ఉమ్మడి ప్రభుత్వాల పాలనలో నిరాదరణకు గురైన కుల వృత్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోస్తున్నది. కుల వృత్తులనే నమ్ముకుని జీవిస్తున్న వారు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు రూ. లక్ష సాయం అందించి అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు బీసీ సంక్షేమశాఖ మంత్రి గం గుల కమలాకర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. త్వరలోనే ఆ కమిటీ విధివిధానాలను ఖరారు చేసి ఈ పథకాన్ని ప్రారంభించనున్నది. సర్కారు నిర్ణయంతో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉన్న విశ్వబ్రాహ్మణ, నాయీబ్రాహ్మణ, రజక, కుమ్మరి, కమ్మరి, కంసాలి, మేదరి వంటి వేలాది కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కుల వృత్తుల వారికి ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తున్నది. సర్కారు నిర్ణయంపై కుల వృత్తుల వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకులు పట్టించుకోకపోవడంతో కుల వృత్తులకు ఆదరణ కరువై వృత్తిపై ఆధారపడిన వారు ఉపాధి లేక అనేక అవస్థలు పడ్డారు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ సీఎం అయిన తర్వాత.. ఆయన కుల వృత్తులకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. వారు ఆర్థికంగా ఎదిగేందుకు పలు పథకాలను అమలు చేస్తున్నారు. గొల్ల కురుమలకు గొర్రె పిల్లలను రాయితీపై పంపిణీ చేస్తూ వారికి జీవనోపాధితోపాటు ఆర్థిక తోడ్పాటును బీఆర్ఎస్ సర్కారు కల్పిస్తున్నది. నాయీబ్రాహ్మణులు నడుపుతున్న హెయిర్ సెలూన్లకు, రజకుల లాండ్రీ దుకాణాలకు నెలకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నది. మత్స్యకారులకు చేప పిల్లలతోపాటు వలలు, మోటరు సైకిళ్లు, ట్రాలీఆటోలను సబ్సిడీపై పంపిణీ చేస్తున్నది. గీత కార్మికులకు రైతుబీమా తరహాలో బీమా పథకాన్ని అమలు చేయడంతోపాటు చెట్లకు పన్ను వసూలు చేసే విధానాన్ని రద్దు చేసింది. గీత కార్మికులు ప్రమాదవశాత్తు చెట్టు పై నుంచి క్రింద పడి చనిపోతే వారి కుటుంబానికి రూ.5 లక్షల బీమాను అందిస్తున్నది. అంతేకాకుండా శాశ్వత అంగవైకల్యం కలిగితే గతంలో ఇచ్చే రూ.50 వేల పరిహారాన్ని తెలంగాణ ప్రభుత్వం రూ.5లక్షలకు పెంచింది. మద్యం దుకాణాల కేటాయింపుల్లోనూ గౌడ కులస్తులకు 15 శాతం రిజర్వేషన్‌ను కల్పించింది. అదేవిధంగా చేనేత కార్మికులకు పవర్ లూమ్స్‌కు 50 శాతం విద్యుత్ రాయితీ, నూలుపై రాయితీ అందించడంతోపాటు ఉచిత బీమా కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్నది. ప్రభుత్వ నిర్ణయంతో తాము ఆర్థికంగా బలోపేతం అవుతామని, తమ కుల వృత్తులను మరింత మెరుగుగా నడుపు కొంటామని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
కుల వృత్తులు బలోపేతం అవుతాయి
వృత్తిదారులు ఆర్థికంగా చితికిపోయి వృత్తులు కనుమరుగవుతున్న వేళ అండగా నిలిచి పునరుజ్జీవం పోసింది ముఖ్యమంత్రి కేసీఆరే. గతంలో కుల వృత్తులకు సరైన ఆదరణ లేక, పనుల్లేక జీవనం కష్టమైంది. మాలాంటి వారి బాధలను గుర్తించిన సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అండగా నిలిచారు. ఇప్పుడు వృత్తిదారులకు రూ. లక్ష సా యం అందజేస్తామని ప్రకటించడం సంతోషంగా ఉంది. ఇప్పటికే హెయిర్ సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటు ఇస్తున్నారు. సీఎం కేసీఆర్ సార్‌కు ధన్యవాదాలు.
-మంగలి శంకర్, బొంరాస్‌పేట
ఉమ్మడి ప్రభుత్వాలు పట్టించుకోలేదు
కులవృత్తుల సంక్షేమాన్ని గత ఉమ్మడి ప్రభుత్వాల పాలకులు పట్టించుకోలేదు. కానీ, ప్రత్యేక రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. కుమ్మర వృత్తిని నమ్ము కుని జీవిస్తున్న మాకు సరైన గిట్టుబాటు లేక ఇబ్బంది పడుతున్నాం. సీఎం కేసీఆర్ కులవృత్తిదారు లకు రూ.లక్ష చొప్పున సాయాన్ని చెల్లిస్తామని ప్రకటించడం చాలా సంతోషకరం.
-కాసుల పాండు, కుమ్మరసంఘం నాయకుడు, ఇబ్రహీంపట్నం
ముఖ్యమంత్రి నిర్ణయంపై హర్షం
రజకులు ఇస్త్రీ షాపులను కొనసాగించేందుకు ఇప్పటికే 250 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు రూ.లక్ష అందించి వారి సంక్షేమాన్ని కాపాడేందుకు కృషిచేయటం ఎంతో సంతోషకరం. గతంలో ఎవరు కూడా కులవృత్తిదారులను ఆదుకోలేదు. వృత్తిదారులకు అండగా నిలిచిన సీఎంకు జీవితాంతం రుణపడి ఉంటాం.
-నర్సింహ, రజక వృత్తిదారుడు, ఇబ్రహీంపట్నం
అన్నివర్గాల అభ్యున్నతికి పెద్దపీట
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కుల వృత్తులకు తగిన గుర్తింపు ఇస్తూ గౌరవాన్ని పెంచుతున్నారు. రూ. లక్ష ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించడం హర్షణీయం. ముఖ్యమంత్రి తీసుకుంటున్న చర్యలతో చాలామంది యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా తమ వృత్తులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ప్రభుత్వం ఇస్తామన్న రూ. లక్ష ఆర్థిక సహాయం కులవృత్తి చేపట్టిన యువకులకు ఎంతో బాసటగా ఉంటుంది. ఇప్పటికే సెలూన్లకు ఉచిత కరెంట్ ఇస్తూ.. ప్రస్తుతం లక్ష రూపాయల రుణం అందిస్తామన్న కేసీఆర్ సార్‌కు వృత్తిదారులంతా రుణపడి ఉంటారు.
-సుధాకర్‌గౌడ్, గీతకార్మికుడు, ఇబ్రహీంపట్నం
వెలుగులు నిండుతాయి
కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న వృత్తిదారులకు సీఎం కేసీఆర్ రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం చేయాలని నిర్ణయించడం చాలా సంతోషకరం. సీఎం అన్ని వర్గా ల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతున్నది. రూ. లక్ష ఆర్థిక సాయంతో వృత్తిదారుల కుటుంబాల్లో వెలుగులు నిండుతాయి. సబ్సిడీ రుణాలు, పింఛన్లు, బీమా, ఇతర ప్రోత్సాహకాలను అందిస్తూ కులవృత్తులకు జవసత్వాలు కల్పిస్తున్నారు. నేత కార్మికులు, గొల్ల కురుమలు, మత్స్యకారులు, గీతకార్మికులు, రజక, నాయీబ్రాహ్మణులు ఇలా అన్ని వర్గాలకూ సాయం అందిస్తూ ఆదుకుంటున్నారు.
-మల్లేశం, దోమ వైస్ ఎంపీపీ
కుల వృత్తులకు పూర్వవైభవం
సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో తెలంగాణలో కుల వృత్తులకు పూర్వవైభవం వస్తున్నది. ఉమ్మడి రాష్ట్రంలో కుల వృత్తుల వారు దుర్భ ర జీవితాన్ని గడిపారు. జీవనోపాధి కష్టమై వలస వెళ్లారు. కనుమరుగైన కుల వృత్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం జీవం పోస్తూ వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నది. కుల వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలకు రూ. లక్ష ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం హర్షణీయం. ఇది వృత్తిదారులకు ఎంతో లబ్ధి కలిగిస్తుంది.
-వడ్ల మోనాచారి, తుంకిమెట్ల, బొంరాస్‌పేట
అన్ని కులాలకు సమన్యాయం ..
సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సమన్యాయం దక్కుతున్నది. పేద, మధ్యతరగతి కులాల వారికి అవసరమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ఆర్థికంగా ఆదుకుంటున్నారు. కులవృత్తుల వారికి రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించడం సంతోషకరం.
-అశ్వల వెంకటేశ్,నాయీబ్రాహ్మణుడు, ఇబ్రహీంపట్నం