న్యూఢిల్లీ: కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జెన్-జీ చేసిన ఆందోళన విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర రాజీనామాతో తాత్కాలికంగా సద్దుమణిగినప్పటికీ ఆ ఉద్యమ స్ఫూర్తి, పోరాట పటిమ పలు రంగాల వారిలో చైతన్య జ్వాలను రగిలించింది. ‘పోరాడితే పోయేదేమి లేదు.. సమస్యల పరిష్కారం తప్ప’ అన్న నినాదంతో సమస్యలపై నిరసన గళమే శరణ్యమన్న దృఢ నిశ్చయానికి వచ్చి వారు తమ కార్యాచరణను ప్రారంభిస్తున్నారు. ఈ క్రమంలో జెన్ ఆల్ఫా తరం జరుపుతున్న ఆందోళన ఇప్పుడిప్పుడే అన్ని ప్రాంతాలకు వ్యాపిస్తున్నది. 2010-2024 మధ్య పుట్టిన వారిని జెన్-అల్ఫాగా పేర్కొంటున్నారు. అంటే వీరంతా 14 ఏండ్ల లోపు వారే. అయితే వీరు సైతం తమ సమస్యలపై బైఠాయింపులు, ధర్నాలు జరుపుతుండటం దేశంలో కొత్త పరిణామం.
ముఖ్యంగా పాఠశాలల విద్యార్థులు తమ హక్కులు, నాణ్యవంతమైన విద్య, సౌకర్యాల కోసం గళం విప్పి యంత్రాంగాన్ని నిలదీస్తున్నారు. దేశంలోని యూపీ, రాజస్థాన్, రాజస్థాన్, మహారాష్ట్ర, బీహార్ తదితర రాష్ర్టాల్లో పాఠశాలల విద్యార్థులు నిర్భయంగా ప్రదర్శనలు నిర్వహించి నిరసనలు వ్యక్తం చేశారు. ఇవన్నీ కూడా బీజేపీ పాలిత రాష్ర్టాలే కావడం గమనార్హం. ముఖ్యంగా బెంచీలు, మరుగుదొడ్లు, తరగతి గదులు కూడా లేకపోవడం, టీచర్ల కొరతపై అధికారులను విద్యార్థులు నిర్భయంగా నిలదీయడం అన్ని వర్గాలను ఆశ్చర్య పరుస్తున్నది.
సరిపడా ఉపాధ్యాయులు లేరంటూ రాజస్థాన్‌లోని జాలూరు జిల్లా మెంగల్వా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాఠశాల బయట గంటల కొద్దీ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీనితో దిగివచ్చిన అధికారులు నలుగురు ఉపాధ్యాయులను నియమిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయడమే కాక, మిగిలిన మూడు ఖాళీలను 10 రోజుల్లో భర్తీ చేస్తామని హామీనిచ్చారు. బీహార్‌లోని గయా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులైతే సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్య వైఖరికి ఆగ్రహంతో విధ్వంసం సృష్టించారు. పాఠశాలలోని ఫ్యాన్లు, హ్యాండ్ పంపులు, బెంచీలు ధ్వంసం చేసిన అనంతరం భారీ ధర్నాకు దిగారు. దీనిపై స్పందించిన అధికారులు ఒక జూనియర్ అధికారిని అక్కడికి పంపగా, అతడితో చర్చలు జరుపడానికి విద్యార్థులు నిరాకరించి తమ నిరసన కొనసాగించారు. జిల్లా మెజిస్ట్రేట్ వచ్చి సమస్యలు పరిష్కరించాల్సిందేనంటూ డిమాండ్ చేశారు.
దీంతో డీఎం ఆ పాఠశాలకు రాక తప్పలేదు. పాఠశాలలోని మౌలిక సదుపాయాల లేమి, అమానుష పరిస్థితులకు నిరసనగా మహారాష్ట్రలోని దహనులో విద్యార్థులు భారీ స్థాయిలో ఆందోళన చేపట్టారు. అపరిశుభ్ర వాష్‌రూమ్‌లు, అసురక్షితమైన పరిసరాలు, కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేని దుస్థితిపై వారు నినాదాలు చేశారు. అలాగే యూపీలోని ఫతేపూర్‌లో సర్వోదయ ఇంటర్ కాలేజీలో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థ్ధులు ఆందోళన నిర్వహించగా, యాజమాన్యం దిగి వచ్చి వాటిని త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామీపత్రం రాసి ఇచ్చింది.
ఈ నిరసనలు దేశంలో ఇప్పటికే తీవ్రంగా ఉన్న ఒక అసమానతను తిరిగి వెలుగులోకి తెచ్చాయి. విద్యకు కనీస ప్రమాణంగా ఉండాల్సిన సౌకర్యాలు డిమాండ్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఎందుకు వీధుల్లోకి రావాల్సిన దుస్థితి ఏర్పడుతున్నదని వారు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ జెన్-ఆల్ఫాల ఆందోళన త్వరలోనే దేశమంతా విస్తరిస్తుందని విద్యావేత్తలు అంటున్నారు.