వికారాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : రెండేండ్ల కిత్రం నా భర్త చనిపోయిండు. దీంతో మాకు ఉన్న ఎకరా పొలంతో ఎలా బతకాలో తెల్వక, అప్పులు తీర్చే మార్గం లేక.. కూతురు పెండ్లి ఎట్ల చేయాలో తెలియని ఒకానొక సమయంలో చావే శరణ్యం అనుకున్నాం. ఆ తరుణంలో ఆపదలో బంధువుగా రైతుబీమా అండగా నిలిచింది. రైతుబీమా కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం అందడంతో మా బతుకుకు ఓ దారి కనిపించింది. రైతుబీమా సొమ్ముతో అప్పులు తీర్చడంతో పాటు మా చిన్న కూతురు స్వాతి పెండ్లి చేసిన. అప్పుడు సకాలంలో బీమా డబ్బులు వచ్చినయి కాబట్టి సరిపోయింది.. లేకపోతే మా బతుకేమయ్యేదో.. నా లాంటి ఎంతోమందికి కష్టకాలంలో ఆర్థిక తోడుగా నిలుస్తున్నది రైతుబీమా. అన్నదాతలకు ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పించిన సీఎం కేసీఆర్ సార్ పది కాలాల పాటు సల్లగుండాలె.. ఆయనకు మా లాంటి కుటుంబాలు జీవితాంతం రుణపడి ఉంటాయి.
– సిద్దుల లక్ష్మి, నర్సాపూర్ గ్రామం, ధారూరు మండలం
రైతు సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తున్నది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకున్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ తొమ్మిదేండ్ల పాలనలో రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వస్తున్నది. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి 9 గంటల విద్యుత్తును సరఫరా చేసిన రాష్ట్ర ప్రభుత్వం,.. రెండేండ్లలోనే విద్యుత్తు రంగంలో నవశకం మొదలైందనేలా వ్యవసాయానికి ఉచిత 24 గంటల విద్యుత్తు సరఫరాను అమల్లోకి తీసుకొచ్చింది. రూ.లక్ష రుణమాఫీని పూర్తి చేసిన ప్రభుత్వం,.. మరోసారి రూ.లక్ష రుణమాఫీలో భాగంగా రూ.25 వేల రుణాలను ఇప్పటికే మాఫీ చేయగా, మిగతా రుణాలను మాఫీ చేసేందుకు కసరత్తు చేస్తున్నది.
మరోవైపు రైతులు అప్పుల ఉబిలో చిక్కుకోకుండా పంటలను సాగు చేసేందుకు పెట్టుబడి సాయమందించేందుకు రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తున్నది. రైతు ఆత్మహత్యలను నివారించేందుకుగాను రైతు మరణిస్తే ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకుగాను రూ.5 లక్షల బీమాను ప్రభుత్వం అందజేస్తున్నది. రైతు బీమా పథకాన్ని అమలు చేస్తూ మృతి చెందిన రైతు కుటుంబాలకు ఆసరై అండగా నిలుస్తున్నది. వికారాబాద్ జిల్లాలో 2018 నుంచి ఇప్పటి వరకు 4,266 మంది రైతులు మృతి చెందగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.213.30 కోట్లను అందజేసింది.
మృతిచెందిన రైతు కుటుంబ సభ్యులకు తొలుత రూ.5 లక్షల బీమా డబ్బును బాండ్ల రూపంలో అందజేసిన ప్రభుత్వం తదనంతరం నేరుగా సంబంధిత రైతు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నది. 2018-19 ఆర్థిక సంవత్సరంలో 786 మంది రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.39.30 కోట్లు, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 812 మంది అర్హులుగా గుర్తించి రూ.40.60 కోట్ల సొమ్మును సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో 1201 కుటుంబాలకు రూ.60.05 కోట్లు, 2021-22 ఆర్థిక సంవత్సరంలో 1022 కుటుంబాలకు రూ.51.10 కోట్లు, 2022-23 ఆర్థిక సంవత్సరం 445 మంది రైతులు మృతి చెందగా సంబంధిత రైతు కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రూ.22.25 కోట్ల బీమా సాయాన్ని నేరుగా సంబంధిత రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర సర్కార్ జమ చేసింది.
రంగారెడ్డి జిల్లాలో..479 కుటుంబాలకు బీమా..
రంగారెడ్డి, మే 24 (నమస్తే తెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు 479 మంది రైతులు మృతి చెందారు. ఇంటి పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులను రైతు బీమాతో రూ.5 లక్షల సాయమందించి రాష్ట్ర సర్కార్ ఆదుకున్నది. జిల్లాలో మృతి చెందిన 385 మంది రైతుల కుటుంబాల ఖాతాల్లో డబ్బులు జమ కాగా, మిగిలిన 94 మంది రైతు కుటుంబాల ఖాతాల్లో త్వరలో డబ్బులు జమ కానున్నాయి. సీఎం కేసీఆర్ సార్ ఇంటికి పెద్దన్నలా ఆదుకున్నాడని మృతి చెందిన రైతు కుటుంబాల సభ్యులు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. రైతుబీమా లేకపోతే కష్టాలపాలయ్యే వాళ్లమని పేర్కొంటున్నారు. వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని, సాగు మొదలు ధాన్యం కొనుగోలు వరకు అండగా నిలుస్తున్నదని రైతు కుటుంబాలు చేతులెత్తి మొక్కుతున్నాయి. తమ జీవితాలు రోడ్డునపడకుండా రైతు బీమా పొందిన లబ్ధిదారుల మనోగతం వారి మాటల్లోనే..
కేసీఆర్ సారే పెద్ద దిక్కైండు…
నా భర్త మృతి చెందడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొన్నది. సీఎం కేసీఆర్ రైతు బీమా కింద రూ.5 లక్షలు సాయమందించి పెద్ద దిక్కైండు. అప్పులు కట్టుకోగా, కూతురి పెండ్లి కోసం బ్యాంకులో దాచుకున్నం. సీఎం కేసీఆర్ సార్ సల్లంగా ఉండాలె.
– జంతుక మైసమ్మ, జంతుక చిన్న నర్సింహ భార్య, ఆమనగల్లు
బీమాతోనే బతుకుకు భరోసా వచ్చింది..
ఇంటి పెద్ద దిక్కు కాలం చేసిండు. తెలంగాణ సర్కారు రూ. 5 లక్షల బీమా డబ్బులు ఇచ్చింది. ఎట్టా బతుకాలో అనుకున్న మాకు భరోసా వచ్చింది. నా కొడుకు కారు కొనుక్కొని కిరాయిలకు నడిపిస్తున్నడు. సీఎం కేసీఆర్ సార్ వల్ల బతుకు గడుస్తున్నది. సీఎం సార్కు రుణపడి ఉంటాం.
– ఊటు సైదమ్మ, భర్త జంగయ్య,
నల్ల చెరువు ఐదు లక్షలొచ్చినయ్..
నా భర్త లక్ష్మయ్య మృతి చెందితే రైతుబీమా డబ్బులు రూ.5 లక్షలు వచ్చినయ్. ఎట్లా బతుకాలో అని దిగులు చెందినా. బీమా డబ్బులు వచ్చాక కూతురు కోసం బ్యాంకులో వేసుకున్నా. ఇంటి పెద్ద దిక్కులా సీఎం కేసీఆర్ ఆదుకున్నడు. మా జీవితాంతం సీఎం కేసీఆర్ సార్కు రుణపడి ఉంటాం.
– కట్ట అనిత, నల్ల చెరువు, మాడ్గుల
సీఎం సారే దిక్కైండు..
ఇంటి దిక్కైన నా కొడుకు మల్లయ్య ఈ మధ్యనే కాలం చేసిండు. కొడుకు లేకపోయేసరికి నా కుటుంబం చెక్కలు ముక్కలైనట్టు అనిపించింది. తెలంగాణ సర్కారు రైతు బీమా కింద రూ.5 లక్షలను అందించింది. హైదరాబాద్ల చికెన్ దుకాణం పెట్టుకొని జీవిస్తున్నం. సీఎం సారు పెద్ద దిక్కై సాయపడిండు. కేసీఆర్ సారు సల్లగుండాలె.
– కె.నరసమ్మ, నల్ల చెరువు, మాడ్గుల