అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు పథకం విజయవంతమైంది. జనవరి 18న ప్రారంభమైన ఈ కార్యక్రమం వందరోజులపాటు సాగింది. వికారాబాద్ జిల్లావ్యాప్తంగా 59 బృందాలు కంటి పరీక్షలు నిర్వహించగా.. ఎంతోమంది పేదల కండ్లల్లో వెలుగులు నిండాయి. జిల్లాలోని వికారాబాద్, తాండూర్, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీలతోపాటు 580 గ్రామ పంచాయతీల్లో వైద్యారోగ్య సిబ్బంది కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 4,83,794 మందికి కంటి పరీక్షలు చేయగా.. 1,24,364 మందికి కంటి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. అవసరమైనవారికి ఉచితంగా కండ్లద్దాలను పంపిణీ చేశారు. జిల్లాలో 64,798 మందికి రీడింగ్ గ్లాసెస్, మరో 59,566 మందికి ప్రిస్క్రిప్షన్ కంటి అద్దాలను అందజేశారు. పైసా ఖర్చు లేకుండా కంటి పరీక్షలు చేయడంతోపాటు అద్దాలు పంపిణీ చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వికారాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ ఆలోచనతో చేపట్టిన రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం వికారాబాద్ జిల్లాలో విజయవంతమైంది. ఆర్థిక సమస్యలు, నిర్లక్ష్యంతో ఉన్న జిల్లాలోని ఎంతోమంది పేదల కండ్లల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమంతో వెలుగులు నిండాయి. జనవరి 18న రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభంకాగా.. జిల్లాలో వంద రోజులపాటు కంటి వెలుగు కార్యక్రమం కొనసాగింది. కలెక్టర్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించడం, జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి దిశానిర్దేశంతో జిల్లాలో కంటి వెలుగు 2.0 గ్రాండ్ సక్సెస్ అయ్యింది. 2018 ఆగస్టు 18 నుంచి 2019 మార్చి వరకు మొదటి విడుత కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించిన ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 3.48 లక్షల మందికి కంటి పరీక్షలు నిర్వహించడంతోపాటు అద్దాలు, అవసరమైన వారికి సర్జరీలను కూడా చేయించింది. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం జనవరి 18న సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించగా, జిల్లాలో జనవరి 19న ప్రారంభంకాగా జూన్ 12తో ముగిసింది.
4,83,794 మందికి కంటి పరీక్షలు
రాష్ట్రంలోని ఏ ఒక్కరూ కూడా కంటి సమస్యతో బాధపడకూడదని, అంధత్వరహిత తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. జిల్లాలోని 20 మండలాల్లోని 580 గ్రామపంచాయతీలు, వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లోని 97 వార్డుల్లో వంద రోజులపాటు కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మెడికల్ అధికారితోపాటు అప్తాలమిస్ట్, కంటి వైద్యులు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు ఆశావర్కర్లతో కూడిన 59 వైద్య బృందాలు కంటి పరీక్షలు నిర్వహించాయి. కంటి వెలుగులో భాగంగా రోజుకు గ్రామీణ ప్రాంతంలో 300 మందికి, మున్సిపాలిటీల్లో 350 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు.
అద్దాలకు బార్ కోడ్
కంటి వెలుగు కేంద్రాల వద్దకు ప్రజలు ఒకేసారి రాకుండా ఆశావర్కర్లు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఏ రోజున కంటి పరీక్షలకు రావాలో ముందే తెలియజేశారు. కంటి పరీక్షలను నిర్వహించిన వెంటనే అవసరమైన వారికి వెంటనే అద్దాలను కూడా పంపిణీ చేశారు. రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమంలో భాగంగా పంపిణీ చేసిన అద్దాలకు ప్రత్యేకంగా బార్ కోడ్ ఏర్పాటు చేశారు. జిల్లాలో 4,83,794 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 1,24,364 మందికి కంటి సమస్య ఉన్నట్లు గుర్తించి వారికి కంటి అద్దాలను ఉచితంగా పంపిణీ చేశారు. మరో 3,59,430 మందికి ఎలాంటి కంటి సమస్య లేనట్లు వైద్యాబృందాలు గుర్తించారు. కంటి సమస్య ఉన్న 1,24,364 మందిలో 64,798 మందికి రీడింగ్ అద్దాలను, మరో 59,566 మందికి ప్రిస్క్రిప్షన్ కంటి అద్దాలను ప్రభుత్వం నేరుగా ఇంటి వద్ద అందజేసింది.
ప్రజల నుంచి సూపర్ స్పందన
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమానికి జిల్లాలో అన్ని వర్గాల ప్రజల నుంచి సూపర్ స్పందన వచ్చింది. జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన కంటి వెలుగు కార్యక్రమానికి సబ్బండ వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకున్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో కంటి పరీక్షలతోపాటు ఇతరత్రాలకు వేలల్లో ఖర్చవుతున్న దృష్ట్యా కంటి చూపు సమస్య ఉన్నవారు కంటి పరీక్షలు చేయించుకోవడంతోపాటు ఉచిత అద్దాలను తీసుకున్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు భాగస్వాములు కావడంతో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైంది.
రెండో విడుత కంటి వెలుగు విజయవంతం
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమం విజయవంతమైంది. జిల్లాలో జనవరి 19న కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభంకాగా జూన్ 12తో ముగిసింది. 100 రోజులపాటు జిల్లావ్యాప్తంగా 59 బృందాలు కంటి పరీక్షలు నిర్వహించారు. జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల్లోని అన్ని వర్గాల ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. కంటి చూపు సమస్య ఉన్న వారందరికీ ప్రభుత్వం ఉచితంగా కంటి అద్దాలను పంపిణీ చేసింది.
– డీఎంహెచ్‌వో పల్వన్‌కుమార్
కంటి వెలుగు మంచి కార్యక్రమం
కంటి వెలుగు మంచి కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్ పేదోళ్ల పెద్దకొడుకు లెక్క అన్ని తీర్లా ఆసరా అవుతుండు. ఎవరు అడుగకపోయినా జనాల కష్టాలు తెలుసుకుని వారి మనస్సులో ఉన్నదేందో తెలుసుకుని పథకాలు అమలు చేస్తుండు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆలోచన చేసి కండ్లు బాగుండాలని అన్ని ఊర్లల్లో పరీక్షలు చేయించిండు. పేదోళ్లు ఎక్కడికో వెళ్లి కంటి పరీక్షలు చేయించుకోకుండా ఊర్లోకే డాక్టర్లను పంపించి కంటి పరీక్షలు చేసి అద్దాలు, మందులు అందించారు. కంటి పరీక్షలు చేయించుకున్న ప్రతిఒక్కరూ కేసీఆర్ సారుకు రుణపడి ఉంటారు.
– సిద్దిరాములు, మర్పల్లి
కేసీఆర్ అద్దాలు ఇచ్చి మంచి పని చేసిండు
కేసీఆర్ సార్ అద్దాలు ఇచ్చి మంచి పని చేసిండు. మాలాంటోళ్లకు కండ్లు కనబడక మసకబడ్డాయి. డాక్టర్లు పరీక్ష చేసి అద్దాలిచ్చిండ్రు. ఇప్పుడు మంచిగా కనిపిస్తున్నయి. ఇలాంటి పని చేయడం ఎంతో మంచి పని. మా ఊళ్లో చాలామందికి ఉపయోగమైంది.
– పార్వతమ్మ, బొపునారం, బంట్వారం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
కంటి వెలుగు పథకం ద్వారా కండ్లద్దాలు అందించడం అభినందనీయం. కంటి పరీక్షలు చేయించుకోవడానికి దూరప్రాంతాలకు వెళ్లేందుకు ఆర్థిక స్థోమత లేని నాలాంటి వారికి కంటి వెలుగు ఎంతో ఉపయోగపడింది. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
– బాలయ్య, కులకచర్ల
పేదలకు ఆసరాగా నిలిచిన కంటి వెలుగు
సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పేదలకు ఆసరాగా నిలిచింది. గ్రామాల్లో ప్రజలకు కంటి సమస్యలు వస్తే ఎంతో ఖర్చు వస్తుందో అనే భయంతో చికిత్స చేయించుకునేవారు కాదు. పేదోళ్ల కష్టాలు తెలిసిన కేసీఆర్ కంటి వెలుగుతో మారుముల గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించి ఉచితంగా అద్దాలు, మందులు పంపిణీ చేశారు. ఇప్పుడు చూపు మంచిగా కనిపిస్తున్నది.
– మెట్టు రాములు, ఎన్కతల, మోమిన్‌పేట
నిరుపేదల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు
కంటి వెలుగు లాంటి పథకాలు తెలంగాణ రాష్ట్రంలో తప్ప వేరే రాష్ర్టాల్లో ఎక్కడ కూడా లేదు. కంటి వెలుగు శిబిరంలో నేను కంటి పరీక్షలు చేయించుకున్నాను. ఉచితంగా అద్దాలు, మందులను అందజేశారు. ఒకవేళ కంటి పరీక్షలు ప్రైవేట్‌లో చేసుకుంటే సుమారు రూ.1000 నుంచి రూ.2000 కావాలి. నాతోపాటు మా గ్రామస్తులు చాలా మంది కంటి పరీక్షలను ఉచితంగా చేయించుకున్నారు. సీఎం కేసీఆర్‌కు మాలాంటి నిరుపేద ప్రజలం జీవితాంతం రుణపడి ఉంటాం.
– హసీనాబేగం, గాజీపూర్, పెద్దేముల్
దూరం పోవుడు తప్పింది
కండ్లు బాగుంటేనే అన్ని విధాలుగా ఏ పనైనా చేసుకోవచ్చని సీఎం కేసీఆర్ గుర్తించి గ్రామీణ ప్రాంతాల్లో కంటి పరీక్షలు చేయించారు. వృద్ధులు, నడువలేనివారికి పట్టణాలకు వెళ్లి కంటి పరీక్షలు చేయించుకునే బాధ తప్పింది. నాకు కండ్ల సమస్య ఉండేది. మా గ్రామంలోనే ఉచితంగా కండ్ల పరీక్షలు చేస్తున్నారని తెలుసుకొని పరీక్ష కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకున్న.
– చాకలి జయమ్మ, పట్లూర్, మర్పల్లి