పరిగి, సెప్టెంబర్ 27 : పరిగి మండల పరిషత్ కార్యాలయ సమావేశం హాలులో శుక్రవారం నిర్వహించిన అధికారుల సమీక్షా సమావేశం.. కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లా మారింది. సమావేశానికి అధికారులు తక్కువ, కాంగ్రెస్ శ్రేణులు అధికంగా హాజరుకావడం విడ్డూరం. వివరాల్లోకి వెళితే.. పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి మండల స్థాయిలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలపై నిర్వహించే సమీక్షకు అధికారులు హాజరుకావాలని ఎంపీడీవో ఎంఎ కరీం నివేదికను అందించారు. దీంతో వివిధ శాఖల మండల, కొన్ని శాఖల డివిజన్ స్థాయి అధికారులు, గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు సమావేశానికి హాజరయ్యారు. ఇక్కడివరకు అంతా బాగున్నా… సమావేశపు హాలులో వివిధ శాఖల అధికారుల కంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే కూర్చోవడంతో పలువురు అధికారులకు కూర్చోవడానికి సీట్లు లేక హాలు బయట, ఇతర గదుల్లో గంటల తరబడి నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు వేదికపై ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి, ఎంపీడీవో కరీం, తహసీల్దార్ ఆనంద్‌రావు, ఎంఈవో గోపాల్‌లు కూర్చోగా, అంతకంటే రెట్టింపు సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కూర్చోవడం విమర్శలకు తావిచ్చింది. మరోవైపు డివిజన్ స్థాయి అధికారులు సైతం స్టేజీ ఎదురుగా ఉన్న కుర్చీలలో కూర్చున్నప్పటికీ సమీక్షా సమావేశానికి ఆహ్వానించిన ఎంపీడీవో వారిని స్టేజీపైకి పిలువకుండా కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన స్టేజీ పంచుకోవడం విడ్డూరం. ఈ సమీక్షలో సంబంధిత శాఖల అధికారులు ఉండాల్సిందిపోయి కాంగ్రెస్ నాయకులతో హాలు నిండిపోవడంపై ఎంపీడీవో తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సమావేశానికి హాజరైనట్లు రిజిస్టర్లో సంతకాలు చేయడం గమనార్హం.
తమను పిలువడం ఎందుకు, గంటల తరబడి బయట నిలబెట్టడం ఎందుకని పలువురు అధికారులు బాహాటంగానే విమర్శించడం కనిపించింది. ప్రొటోకాల్‌కు విరుద్ధంగా సమావేశం నిర్వహించిన ఎంపీడీవోపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు పరిగిలో సమావేశం ఉన్నది.. రుణమాఫీ కానివారు అక్కడికి రావాల్సిందిగా కాంగ్రెస్ నాయకులు సూచించడంతో పలువురు రైతులు సమావేశం హాలు దగ్గరకు వచ్చి తమకు రుణమాఫీ కాలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వ్యవసాయాధికారులు, బ్యాంకర్లతో మాట్లాడిన ఎమ్మెల్యే అందరికీ రుణమాఫీ జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్పిన పని చేయండి అంటూ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పంచాయతీ కార్యదర్శులకు హుకూం జారీ చేయడం కొసమెరుపు.
పరిగి మండలంలో రూ.55 కోట్లు రుణమాఫీ అయ్యిందని ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికీ తిరిగి రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరించారని, త్వరలో వారికి మాఫీ అవుతుందన్నారు. బ్యాంకు అధికారుల తప్పుల వల్ల కొందరికీ రుణమాఫీ కాలేదన్నారు. త్వరలోనే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేస్తామన్నారు. రెవెన్యూ సంబంధిత సమస్యలు తక్షణం పరిష్కరించాలని తహసీల్దార్‌కు సూచించారు. ధరణి స్థానంలో త్వరలో భూమాత పోర్టల్ తీసుకొస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గ్యాస్ సబ్సిడీకి సంబంధించిన ప్రొసీడింగ్‌లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.