మాడ్గుల, జూన్ 1 : మండల పరిధిలోని నల్లచెరువు గ్రామంలో పూరి గుడిసెలున్న నిరుపేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు రాకపోవడం చాలా దురదృష్టకరమని ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయని మండల ప్రజలు మండిపడుతున్నారు. భూమి కలిగినవారికి ఇందిరమ్మ ఇల్లు ఎలా ఇస్తారని మండలవాసులు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
ఇండ్లు లేక పూరి గుడిసెల్లో, మట్టి మిద్దెల్లో, రేకుల ఇళ్లల్లో జీవనం సాగిస్తున్నామని వారి కన్నీరుమున్నీరవుతున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలని ఆవేదనకు గురవుతున్నారు. కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇవ్వాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి స్పందించి పేదవారికి ఇండ్లు వచ్చేలా దయ తలచాలని వారు కోరుతున్నారు.
నాకు రెండు కళ్లు లేవు. నల్లచెరువు గ్రామంలో నాకు ఇల్లు లేదు. భూమి అర ఎకరం మాత్రమే ఉన్నది. నాకు ఇద్దరు కొడుకులు. హైదరాబాద్లో అద్దెకుంటున్నాం. నాలాంటి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలి.
– రామచంద్రయ్య, అంధుడు, నల్లచెరువు
నాకు పూరి గుడిసె ఉంది. 8 సంవత్సరాల నుంచి ఇద్దరు పిల్లలతో జీవనం సాగిస్తున్నాం. రాత్రయితే చాలు పాములు, తేళ్లు వస్తున్నాయి. భయంతో బిక్కుబిక్కుమని బతుకుతున్నాం. నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. సర్కారు స్పందించి ఇల్లు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్న.
– పద్మ, నల్లచెరువు, మాడ్గుల మండలం
నాకు మట్టి మిద్దె ఇల్లు కలదు. నాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు. పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఆశిస్తున్నా. ప్రస్తుతం మేము వృద్ధులం. ఉన్న ఇల్లు వర్షాలు వస్తే కూలిపోయే దశలో ఉన్నది. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.
– పళ్ళ రాములు, మాడ్గుల మండలం