సిటీబ్యూరో, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): నగరంలో పోలీసు కమిషనరేట్ల పునర్విభజన గందరగోళంగా మారింది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లకు సంబంధించి సరిహద్దుల నిర్ణయంలో ఇప్పటికీ స్పష్టత లేకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ మూడు కమిషనరేట్లలోని కొన్ని ప్రాంతాలను వేర్వేరు కమిషనరేట్లలో చేర్చి కొత్తగా ప్యూచర్‌సిటీ కమిషనరేట్ ఏర్పాటు చేస్తూ డిసెంబర్ చివరివారంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఫ్యూచర్‌సిటీలో చేర్చాల్సిన ఠాణాలతో పాటు మల్కాజిగిరి, హైదరాబాద్‌ల మధ్య కొన్ని పీఎస్‌ల హద్దుల పంచాయితీ తారాస్థాయికి చేరింది. కొన్నిచోట్ల స్థానికుల ఆందోళనలతో పీఎస్‌ల ఏర్పాటులో గందరగోళం నెలకొంది. నెలన్నర దాటినా ఇప్పటివరకు కొన్ని స్టేషన్ల మధ్య పరిధి, సిబ్బంది కేటాయింపు సహా చాలా విషయాల్లో స్పష్టత కరువైంది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాలాగూడ పీఎస్ ఉండగా తుకారాంగేట్ పీఎస్ మల్కాజిగిరి పరిధిలో చేరింది. తుకారాంగేట్ పరిధిలోని అడ్డగుట్ట చుట్టుపక్కల ప్రాంతాలను లాలాగూడ పోలీస్‌స్టేషన్‌లో కలపడం పూర్తిగా అనాలోచిత నిర్ణయమని, తద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని స్థానికులు గత వారం స్థానికంగా ఆందోళన చేశారు. లాలాగూడ పోలీస్‌స్టేషన్‌కు రవాణ సౌకర్యం లేదని, ఫిర్యాదు చేయడానికి వెళ్లాలంటే ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉందని వారు పేర్కొన్నారు.
హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల పునర్విభజన సందర్భంగా చేరిన బాలాపూర్, ఆదిభట్ల పోలీస్స్టేషన్లు ఫ్యూచర్‌సిటీ కమిషనరేట్‌కు దగ్గరగా ఉంటాయి. ఈ పీఎస్‌లకు కేవలం ఐదు నుంచి పదికిలోమీటర్ల లోపు పరిధిలో ప్యూచర్‌సిటీ కమిషనరేట్ ఉండగా, హైదరాబాద్ కమిషనరేట్ 20కిమీలపైనే ఉంది. అంతేకాకుండా ఈ ప్రాంతప్రజలు కమిషనరేట్‌కు వెళ్లాలంటే ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంటుందని వాపోతున్నారు. తమకు దగ్గరలో ఉన్న కమిషనరేట్‌ను వదిలేసి దూరంగా ఎక్కడో ఉన్న హైదరాబాద్‌లో చేర్చడమేంటంటూ ఈ ప్రాంత వాసులు, అన్ని పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యూచర్‌సిటీలో తమను కలపాలంటూ నిరసన కార్యక్రమాలు చేయడానికి కార్యాచరణను రూపొందిస్తున్నారు.
బేగంపేట ఎయిర్‌పోర్టు గతంలో బేగంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉండేది. తాజా పునర్విభజనతో ఈ ఎయిర్‌పోర్టు పరిధి మొత్తం పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో చేరింది. మరోవైపు బేగంపేట పీఎస్‌ను మల్కాజిగిరి కమిషనరేట్‌లో కలిపారు. బేగంపేట ఎయిర్‌పోర్టు పరిసరప్రాంతాల ప్రజలు తమ దగ్గర నుంచి ఫిర్యాదులు చేయాలంటే కేవలం ఒకట్రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగంపేట పీఎస్‌కు వెళ్లేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వారు పంజాగుట్టకు రావాలంటే చాలా ఇబ్బందవుతున్నదని, దీనిపై పునరాలోచించాలంటూ స్థానికులు కోరుతున్నారు.
సరిహద్దులలో స్పష్టత కరువు..!
ఫ్యూచర్‌సిటీని ఆనుకుని ఉన్న శంషాబాద్, ఆదిభట్ల, మహేశ్వరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో కలిపారు. ఈ పునర్విభజనకు ప్రాతిపదికగా స్థానిక పీఎస్ నుంచి కమిషనరేట్‌కు ఉండే దూరాన్ని తీసుకున్నారా.. లేక ఇంకేదైనా శాస్త్రీయ కారణాలు ఉన్నాయా అనేది పోలీసు అధికారులకే అంతుచిక్కడం లేదు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలానగర్, మాదాపూర్ జోన్లను తీసేసి కొత్తగా శేరిలింగంపల్లి, కూకట్పల్లి జోన్లు ఏర్పాటు చేశారు. కూకట్పల్లి జోన్లో మాదాపూర్, రాయదుర్గం పీఎస్‌లను కలపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రెండు ఐటీ కారిడార్ పరిధిలోని ముఖ్య పోలీస్స్టేషన్లు కలపడం మీద పోలీసుసిబ్బంది సైతం పెదవి విరుస్తున్నారు.
ఐటీకారిడార్ పరిధిలోని ప్రాంతాలను ఒకే పోలీస్జోన్లో ఉంచకుండా కూకట్‌పల్లిలో కలపారని వ్యాఖ్యానిస్తున్నారు. హైదరాబాద్, మల్కాజిగిరి కమిషనరేట్ల మధ్య నార్త్‌జోన్ విభజన వింతగా ఉందని అధికారులే అంటున్నారు గోపాలపురం, మార్కెట్ పీఎస్‌లను మల్కాజిగిరిలో కలిపారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ గతంలో గోపాలపురం పరిధిలో ఉండగా ప్రస్తుతం మూడుకిలోమీటర్ల దూరంలోని చిలకలగూడ పీఎస్‌లో కలిపారు. గాంధీ ఆసుపత్రి తమ పరిధిలో ఉందని కొత్తగా సికింద్రాబాద్ స్టేషన్ చేర్చడం సవాలుగా మారుతున్నదని కొందరు అంటున్నారు.
ప్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలోని ప్రాంతాల పరిధిపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మహేశ్వరం, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్, రాజేంద్రనగర్ జోన్‌లోని కొన్ని ప్రాంతాలను ప్యూచర్‌సిటీ కమిషనరేట్ పరిధిలోకి తీసుకొచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ ప్రస్తుతం మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలోఉండగా దాన్ని ఫ్యూచర్ సిటీకి ఇవ్వాలంటూ అధికారులు ప్రతిపాదించారు. ఇంకోవైపు యాదాద్రి జిల్లా అధికారులు కూడా ఈ పీఎస్ కావాలని అడిగినట్లు తెలుస్తోంది.
సైబరాబాద్ కమిషనరేట్‌లో పోలీస్స్టేషన్లు తగ్గిపోవడంతో తమకు కొన్ని ఇవ్వాలని అక్కడి అధికారులు అడిగినట్లు సమాచారం. లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో కలిసిన అడ్డగుట్ట డివిజన్ పరిధిలోని ప్రాంతాలన్నింటినీ తిరిగి గతంలో మాదిరిగానే తుకారాంగేట్ పీఎస్‌లోకి కలిపేందుకు నోటీఫికేషన్ జారీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నామని స్థానిక పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. కమిషనరేట్ల పునర్విభజన , తాజా మార్పులపై ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మహేశ్వరం నియోజకవర్గంలోని పలు ప్రాంతాలను హైదరాబాద్ కమిషనరేట్‌లో కలపడం, రాజేంద్రనగర్ ప్రాంతాన్నీ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి తీసుకురావడంపై స్థానిక ప్రజాప్రతినిధులు అభ్యంతరం చెప్పారు.
సిబ్బంది కేటాయిపులోనూ..!
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, ఫ్యూచర్సిటీలుగా కమిషనరేట్ల ఏర్పాటు చేసినా సిబ్బంది కేటాయింపు విషయంలో ఇంకా తర్జనభర్జన కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు రాచకొండ, సైబరాబాద్ పరిధి భారీగా ఉండేది. దానికి అనుగుణంగా ట్రాఫిక్ విభాగంలో ఇద్దరు చొప్పున డీసీపీలు ఉండేవారు. పునర్విభజన తర్వాత మల్కాజిగిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధి, పోలీస్స్టేషన్ల సంఖ్య భారీగా తగ్గింది. గతంలో సైబరాబాద్‌లో 44 పీఎస్‌లు ఉండగా ఇప్పుడు 22 పీఎస్లకే పరిమితం చేశారు. హైదరాబాద్ తర్వాత అంతేస్థాయిలో సైబరాబాద్‌ను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దాలనుకున్న పోలీసు ఉన్నతాధికారులకు ఈ విషయం పెద్ద షాక్ ఇచ్చింది.
సైబరాబాద్ ట్రాఫిక్ విభాగానికి జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి బాధ్యుడుగా ఉండేది. తాజా మార్పుతో ఆ పోస్టును సరెండర్ చేసి డీసీపీలతో ఈ విభాగాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రెండు కమిషనరేట్లలో చెరో ఆరువేలకు పైగా సిబ్బంది ఉండేవారు. కానీ పరిధి తగ్గడంతో సిబ్బందిని తగ్గించి ఇతర కమిషనరేట్లలో సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. సిబ్బంది కేటాయింపుకు సంబంధించి అదనపు డీజీ చైర్మన్‌గా 8మందితో ఓ కమిటీ ఏర్పాటు చేశారు. నాలుగు కమిషనరేట్లకు అవసరమైన మానవవనరుల ప్రతిపాదనలను సమన్వయం చేసుకునే బాధ్యతలను మహేశ్వరం డీసీపీకి అప్పగించారు.