విశ్వనగరంగా భాసిల్లుతున్న పరిపాలనా ప్రాంగణంలో చట్టబద్ధ పాలన ప్రాముఖ్యతను, రాజ్యాంగ పరిమితుల సర్వోన్నత శిఖరాలను ఆవిష్కరిస్తూ హైకోర్టు వెలువరించిన ఆదేశాలు రాష్ట్ర పరిపాలనా రంగంలో నూతన దిశానిర్దేశాన్ని చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపుదిద్దిన ‘హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ’ (హైడ్రా) క్రియాశీలతపై హైకోర్టు చేసిన తీవ్ర వ్యాఖ్యలు, జారీ చేసిన ఆదేశాలు సమాజంలో సుదీర్ఘమైన మథనానికి తెరలేపాయి. ప్రజాప్రయోజనం అనే ఆశయం ఎంతటి మహోన్నతమైనదైనా, రాజ్యాంగ నియమ నిబంధనలు, సహజ న్యాయ సూత్రాలను దాటి చట్టపరిధిని ధిక్కరించడానికి వీల్లేదనే సత్యానికి ఈ తీర్పు అద్దం పట్టింది.
కోర్టు జారీ చేసిన ఉత్తర్వుల అమల్లో నిర్లక్ష్యం వహించడం, నిర్దేశిత గడువు లోపల అఫిడవిట్ దాఖలు చేయడంలో వైఫల్యం చెందడాన్ని తీవ్రంగా పరిగణిస్తూ, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణమే ఆ విధుల నుంచి తప్పించి మరొక సమర్థుడైన అధికారికి బాధ్యతలు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించడం అత్యంత కీలక పరిణామం. ఈ ఘట్టం కేవలం ఒక ఉన్నతాధికారి బదిలీ ఆదేశానికో లేదా అధికార మార్పిడికో పరిమితమైంది కాదు; శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థల నడుమ ఉండాల్సిన పరస్పర గౌరవం, రాజ్యాంగబద్ధ సమతుల్యత, ప్రజాధికారుల జవాబుదారీతనాన్ని పునర్నిర్వచించిన చారిత్రక సందేశం.
ఈ సంచలన పరిణామాలకు ప్రధాన పునాది సికింద్రాబాద్ పరిధిలోని లోతుకుంట ప్రాంతంలో నెలకొన్న ఒక స్థల వివాదం. ఉమ్మడి భూహక్కులు, ఆక్రమణల అంశాలపై పౌరులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గతంలోనే సదరు స్థలంపై స్పష్టమైన స్టే ఉత్తర్వులు జారీ చేసింది. అయినప్పటికీ, స్థానిక యంత్రాంగం, హైడ్రా బలగాలు సదరు ఆదేశాలను తగిన విధంగా పరిగణనలోకి తీసుకోకుండా క్షేత్రస్థాయిలో తొలగింపు చర్యలకు ఉపక్రమించారని పిటిషనర్లు కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై గతం విచారణ సందర్భంగా కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కమిషనర్ రంగనాథ్ స్వయంగా హాజరై లేదా నిబంధనల ప్రకారం క్షమాపణతో కూడిన ప్రమాణ పత్రాన్ని (అఫిడవిట్) కోర్టు ముందు ఉంచాలని కఠిన గడువు విధించింది.
అడ్వకేట్ జనరల్ (ఏజీ) ప్రత్యేక అభ్యర్థన మేరకు న్యాయస్థానం కారుణ్యంతో అదనపు సమయాన్ని కూడా మంజూరు చేసింది. అయితే, నిర్దేశించిన తుది సమయానికి కూడా సదరు అఫిడవిట్ దాఖలు కాకపోవడంతో, న్యాయస్థానం.. తన సహనానికి ఆమోదయోగ్యమైన హద్దులు ఉంటాయని స్పష్టం చేసింది. రాజ్యాంగబద్ధమైన తీర్పులను పునఃసమీక్షించకుండా ఉల్లంఘించడం చట్టబద్ధ పాలనకే ప్రతిబంధకమని భావిస్తూ, ఆ బాధ్యతల నుంచి ఆ అధికారిని తక్షణమే తప్పించి మరో అధికారిని నియమించాలని ఘాటుగా ఆదేశించింది.
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలోని వందలాది ఎకరాల విలువైన ప్రభుత్వ, చెరువు భూములను స్వాధీనం చేసుకుంటూ, రూ.వేల కోట్ల విలువైన అక్రమ కట్టడాలను నేలమట్టం చేసి హైడ్రా సరికొత్త సంచలనానికి కేంద్రబిందువైంది. అయితే, పర్యావరణ పరిరక్షణ, వరదల నివారణ దృష్ట్యా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు క్షేత్రస్థాయిలో అమలు చేసిన పద్ధతులపై చట్టపరమైన అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దశాబ్దాలుగా నివాసముంటున్న ప్రజలు, భవన యజమానులకు తగిన సమయం ఇవ్వకపోవడం, కనీస చట్టబద్ధ నోటీసులు జారీ చేయకపోవడం, సరిహద్దు నిర్ణాయక సర్వే డాక్యుమెంట్లను బహిర్గతం చేయకపోవడం ద్వారా సహజ న్యాయసూత్రాలకు తిలోదకాలు ఇచ్చారనే ఆవేదన బాధితుల నుంచి వ్యక్తమై కోర్టుల తలుపు తట్టింది. ఈ ముఖ్యమైన కేసుల విచారణలో హైకోర్టు ఎత్తిచూపిన పరమార్థం అక్రమ నిర్మాణాలు, ఆక్రమణలను తొలగించ డం కాదని; ఆ ప్రక్రియను అమల్లోకి తెచ్చేందు కు పాటించాల్సిన చట్టబద్ధ నిబంధనలేనని స్పష్టమవుతున్నది. రాజ్యాంగ పరిధిలోని పద్ధతులను పక్కన పెట్టి ఏకపక్షంగా అమలు వల్ల వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసం సన్నగిల్లుతుంది.
హైదరాబాద్‌లోని సూరారం, బతుకమ్మకుంట, ఖానామెట్, చందానగర్, లోతుకుంట వంటి ప్రాంతాల్లో జారీ అయిన విభిన్న ఉత్తర్వుల్లో హైడ్రా యంత్రాంగం ధోరణిపై కోర్టు పలుమార్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. కోర్టు స్టే ఉత్తర్వులు అమల్లో ఉన్నప్పటికీ లేదా వివాదాలు విచారణలో ఉన్నప్పటికీ యంత్రాంగం క్షేత్రస్థాయికి వెళ్లి ఆస్తుల ధ్వంసానికి తెగబడడం చట్ట నిబంధనలకు విరుద్ధమని న్యాయమూర్తులు స్పష్టం చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా అంగీకరించిన ప్రాథమిక న్యాయ సూత్రం ’ఆడి అల్టరమ్ పార్టమ్’ (ఎదుటి వ్యక్తి వాదనను తప్పక వినాలి) అనే విధానంపైనే పౌరహక్కులు ఆధారపడి ఉంటాయి. ప్రజాప్రయోజనం ఎంత ఉన్నతమైనదైనా, రాజ్యాంగంలోని అధికరణం 300-ఏ ప్రకారం చట్టబద్ధమైన సమగ్ర ప్రక్రియను పాటించకుండా ఏ పౌరుడినీ తన ఆస్తి హక్కు నుంచి వేరుచేయడానికి వీల్లేదు. విచారణకు తగిన వ్యవధినివ్వడం, నోటీసులో స్పష్టమైన కారణాలను పేర్కొనడం, వివరణలను సమీక్షించడం, క్షేత్రస్థాయి రెవెన్యూ నిపుణులు, సర్వే నివేదికలతో సరిహద్దుల సమగ్ర నిర్ధారణ చేపట్టడం పౌర రక్షణకు కనీస రాజ్యాంగ హామీలు. ఈ ప్రాథమిక ప్రక్రియలను విస్మరించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల పరిపాలనాపరమైన చిక్కులు ఎదురై, న్యాయస్థానాలు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తున్నది.
అధికారం ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ అది చట్ట పరిధికి లోబడి మాత్రమే పనిచేయాలని, కార్యనిర్వాహక యంత్రాంగం వేగం కంటే చట్టబద్ధమైన రాజ్యాంగ ప్రక్రియలకే అగ్రతాంబూలం ఇవ్వాలనే నిశ్చిత సందేశాన్ని ఈ పరిణామం అందించింది. విపత్తు నిర్వహణ, ఆస్తుల సంరక్షణ నానుడితో సాగే ప్రతి అడుగూ చట్టానికి, రాజ్యాంగానికి లోబడి ఉన్నప్పుడే ప్రజాస్వామ్య వ్యవస్థ వర్ధిల్లుతుందని హైకోర్టు తీర్పు పునరుద్ఘాటించింది.
– (వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
రామకిష్టయ్య సంగనభట్ల 9440595494