ఢిల్లీ: భారత హాకీ జట్టు ఆటగాళ్లు ధరించే జెర్సీ రంగు మారింది. సంప్రదాయక నీలం రంగును కాదని వచ్చే నెలలో నెదర్లాండ్స్, బెల్జియంలో జరుగబోయే హాకీ ప్రపంచకప్ కోసం హాకీ ఇండియా (హెచ్ఐ) విడుదల చేసిన జెర్సీ కాషాయం రంగులోకి మారడం కొత్త వివాదానికి తెరలేపింది. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆటను ఎంతగానో ప్రేమించే ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘భారత హాకీ జట్టు జెర్సీని కాషాయంలోకి మార్చారని తెలియగానే నేనెంతగానో ఆవేదన చెందాను. నీలం రంగు జెర్సీ అనేది ఒక కలర్ మాత్రమే కాదు. అది దేశ ప్రతిష్టకు ప్రతీక.
దేశ క్రీడా వారసత్వంతో ముడిపడిన ఒక భావోద్వేగం. దశాబ్దాలుగా ఈ రంగు మన ఆశలో, విజయాల్లో, అపజయాల్లో, క్రీడా నైపుణ్యాన్ని సాధించే క్రమంలో మనందరినీ ఏకం చేసింది. బ్లూ కలర్ జెర్సీతో మన జట్లు ఒలింపిక్ వంటి విశ్వక్రీడా యవనికపై మువ్వన్నెల జెండాను రెపరెపలాడించాయి. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏకైక పని ఇదే’ అని ఆయన విమర్శలు గుప్పించారు. భారత హాకీ మాజీ సారథి వీరెన్ రస్కిన్హా సైతం ఈ చర్యపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. రంగు మార్పుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ హెచ్ఐ మాత్రం తమ చర్యను సమర్థించుకోవడం గమనార్హం.