శేరిలింగంపల్లి, జూలై 30: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంచ గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీ ఫేజ్ 1లో నిర్మాణ పనుల సమయంలో పిల్లర్ల కోసం తవ్విన సెల్లార్ మట్టి కూలి ముగ్గురు నిర్మాణ కార్మికులు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. గురువారం ఉదయం కంచగచ్చిబౌలి, టీఎన్జీవో కాలనీ ఫేజ్ 1లోని ప్లాట్ నంబర్ 612 వద్ద పిల్లర్ల కోసం తవ్విన సెల్లార్ మట్టికూలినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే వారు సంఘటనా స్థలానికి వెళ్లి చూడగా ముగ్గురు కార్మికులు మట్టి కింద చిక్కుకున్నట్లు గుర్తించారు. తోటి కార్మికుల సహాయంతో వారిని బయటకు తీసి సమీపంలోని ఓ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు.
గాయపడిన వారిలో రామ్ కరణ్, అజేష్ చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. సురేష్ దవాఖానలోనే చికిత్స పొందుతుండగా, అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా ఈ ప్లాట్ చుక్కపల్లి కృష్ణ కార్తీక్కు చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. తవ్వకాల సమయంలో పాటించాల్సిన భద్రతా ప్రమాణాలను నిర్లక్ష్యం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ఘటనపై మేస్త్రీ, సైట్ సూపర్ వైజర్, ప్లాట్ యజమానిపై కేసు నమోదు చేస్తున్నట్లు వెల్లడించారు.