పరిగి, ఫిబ్రవరి 22 : పరిగిలో శిక్షణ పొందిన క్రీడాకారులు ఒలింపిక్స్ స్థాయిలో ఆడాలని చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ రంజిత్‌రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పరిగిలోని మినీ స్టేడియంలో ఖేలో ఇండియా స్టేట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఖోఖోను మంగళవారం పరిగిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ.. ఖోఖో శిక్షణకు రాష్ట్రంలో పరిగిని ఎంపిక చేయడం హర్షణీయమని తెలిపారు. ఖోఖో శిక్షణకు సంబంధించి అవసరమైన మ్యాట్ ఇప్పిస్తానని ఎంపీ హామీ ఇచ్చారు.
పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. భారతదేశం జనాభాలో రెండో స్థానంలో ఉండగా క్రీడల్లో వెనుకబడిందన్నారు. క్రీడారంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. పరిగి ప్రాంతంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడిన క్రీడాకారులు ఉండడం తమ ప్రాంతానికి గర్వకారణమని చెప్పారు. పరిగిలో త్వరలోనే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలు నిర్వహించేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పరిగిలోని మినీ స్టేడియంలో రూ.40లక్షలు వెచ్చించి అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు.
జిల్లా యువజన సర్వీసుల శాఖ అధికారి హన్మంత్‌రావు మాట్లాడుతూ.. పరిగికి మంజూరైన ఖోఖో శిక్షణ కేంద్రానికి నాలుగు సంవత్సరాలపాటు ప్రతి సంవత్సరం రూ.5లక్షలు గ్రాంటుగా అందుతాయని, మొదటి సంవత్సరం సదుపాయాల కల్పనకు రూ.5లక్షలు అదనంగా గ్రాంటు వస్తుందన్నారు. 30 మందికి పైగా క్రీడాకారులకు ఖోఖోలో జాతీయ స్థాయిలో ఆడేలా తర్ఫీదు ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, ఎంపీపీ అరవిందరావు, పరిగి, పూడూరు జడ్పీటీసీలు హరిప్రియ, మేఘమాల, మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్, పీఏసీఎస్ చైర్మన్ శ్యాంసుందర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆంజనేయులు ఉన్నారు.