వికారాబాద్, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ మున్సిపాలిటీల్లో రాజకీయ సందడి మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ఖరారు చేసిన బీఆర్ఎస్ నాలుగు మున్సిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురవేసేందుకు దూకుడు పెంచగా, అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం డీలాపడింది. రాష్ట్ర ఎన్నికల సంఘం రిజర్వేషన్లు ప్రకటించి రెండు వారాలు గడిచినా ఇప్పటివరకు నాలుగు మున్సిపాలిటీల్లో ఒక్క వార్డుకు కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడం గమనార్హం. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలోనే కాంగ్రెస్ పార్టీ డీలాపడటంతో ఓటమి భయమేనంటూ ఆయా మున్సిపాలిటీల్లో ప్రచారం జరుగుతున్నది.
మరోవైపు నామినేషన్లను దాఖలు చేసేందుకు రేపు ఆఖరు తేది కావడంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీల్లో నామినేషన్లను దాఖలు చేసే ప్రక్రియ పూర్తి చేస్తుంటే.. కాంగ్రెస్ పార్టీ నేడు లేదా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అభ్యర్థుల కోసం మూడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు వెతుకులాట మొదలుపెట్టారు. అభ్యర్థులు లేకపోవడంతో తలలు పట్టుకుంటున్నారు. అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి ఎవర్నో ఒకర్ని బరిలోకి దింపేలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండేళ్లలో మున్సిపాలిటీల్లో నయా పైసా అభివృద్ధి కూడా జరగకపోవడంతో ఆ పార్టీ నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదని గుర్తించిన ఆశావహులు బీఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా మున్సిపాలిటీల్లో కొందరు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లోనూ బీఆర్ఎస్ పార్టీ దూకుడు పెంచింది. నాలుగు మున్సిపాలిటీల్లోని వంద వార్డుల్లో అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ దాదాపు ఖరారు చేశారు. ఆయా వార్డులకు బీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులు దాదాపు ఖరారు కావడంతో ఆయా వార్డుల పరిధిలో సంక్రాంతి పండుగ నుంచే ప్రచారం మొదలుపెట్టి దూసుకుపోతున్నారు. నామినేషన్ల దాఖలులోనూ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ముందున్నారు.
తొలిరోజే ఆయా మున్సిపాలిటీల పరిధిలో అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో జిల్లాలో అధికార పార్టీకి దీటుగా గ్రామ పంచాయతీల్లో విజయకేతనం ఎగురవేసిన బీఆర్ఎస్.. మున్సిపల్ ఎన్నికల్లోనూ నాలుగు మున్సిపాలిటీలపై గులాబీ జెండా ఎగురవేసేలా పక్కా వ్యూహంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకెళ్తున్నది. ఆయా మున్సిపాలిటీలకు ప్రత్యేకంగా ఇన్చార్జీలను కూడా నియమించడంతో ఆయా నియోజకవర్గాల మాజీ ఎమ్మెల్యేలు, ఇన్చార్జీలతో కలిసి నాలుగు మున్సిపాలిటీల్లోనూ పక్కాగా గెలుపొందేందుకు కార్యాచరణ షురూ చేశారు.
ప్రధానంగా దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలుచేయడంతోపాటు నాలుగు మున్సిపాలిటీల్లోనూ చేసిన అభివృద్ధిని గడపగడపకు వెళ్లి వివరిస్తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లు, రైతు బీమా, రైతు బంధు తదితర సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్దఎత్తున నిధులు మంజూరు చేసి, రోడ్ల అభివృద్ధితోపాటు అండర్ డ్రైనేజీలు, వీధి దీపాల ఏర్పాటు, మురుగు కాల్వలు, పార్కుల నిర్మాణం తదితర అభివృద్ధి పనులను పూర్తి చేసి అభివృద్ధిపథంలోకి తీసుకెళ్లారు.