శుక్రవారం 04 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Oct 25, 2020 , 04:38:30

ఆరోగ్యానికి మాంసాహారం

ఆరోగ్యానికి మాంసాహారం

కరోనా నేపథ్యంలో పెరిగిన వినియోగం  

వైరస్‌ను తట్టుకునేందుకు దోహదం

కరోనా నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. వైరస్‌ నుంచి కాపాడుకునేందుకు రోగనిరోధక శక్తిని పెంచుకోవడం తప్పనిసరైంది. ఈ క్రమంలో ప్రొటీన్లు అధికంగా ఉండే చికెన్‌, గుడ్లు, మటన్‌ వినియోగం ఎక్కువైంది. గతంలో వారాంతానికే పరిమితమైన వాటి కొనుగోళ్లు ప్రస్తుతం నిత్యం జోరుగా సాగుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.          

-సిరిసిల్ల 

అధిక ప్రొటీన్లు గల మాంసం, గుడ్లు, చికెన్‌ తింటే కరోనా నుంచి త్వరగా కోలుకోవచ్చని వైద్యులు చెబుతుండడంతో జిల్లాలో విక్రయాలు పెరిగాయి. జిల్లా వ్యాప్తంగా సాధారణంగా ప్రతి నెలా లక్షా 30వేల వరకు గుడ్ల విక్రయాలు జరుగుతుండగా, ప్రస్తుతం రెండు లక్షల 20 వేల వరకు పెరిగినట్లు మార్కెట్‌ను బట్టి తెలుస్తున్నది. ముఖ్యంగా గుడ్డులోని తెల్లటి సొనలో శక్తి అధికంగా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగడంతో వాటి వినియోగం దాదాపు రెట్టింపైంది.

ప్రారంభంలో పడిపోయిన వినియోగం

కరోనా ప్రారంభం వేళ ప్రజలు మాంసాహారాన్ని మానేశారు. చికెన్‌ తింటే కరోనా వస్తుందని ప్రచారం జరుగడంతో ధర అమాంతంగా పడిపోయింది. అప్పటి వరకు జోరుగా కొనసాగిన విక్రయాలు ఒక్కసారిగా 70-80శాతం తగ్గాయి. దీంతో పౌల్ట్రీపరిశ్రమ పూర్తిగా నష్టాల పాలైంది. ఈ సంక్షోభ సమయంతో పలు మండలాల్లో ఒక్కో కోడిని 50 రూపాయలకు విక్రయించిన సందర్భాలున్నాయి. చికెన్‌ తింటే కరోనా రాదని  ప్రొటీన్లు అందుతాయని మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌,  వైద్యులు సూచించడంతో మటన్‌, చికెన్‌ వినియోగం రెట్టింపైంది. 

మాంసం ధరలకు రెక్కలు

పోషకాల కోసం ప్రజలు అమితంగా ఇష్టపడే మాంసాన్ని తినాలని ప్రచారం జరుగడంతో మాంసం ధరలకు రెక్కలు వచ్చాయి.  ఏప్రిల్‌, మే మాసాల్లో  కోడిని రూ.50 విక్రయించిన వ్యాపారులే ప్రస్తుతం కిలో చికెన్‌ 250 రూపాయలకు అమ్ముతున్నారు. కోడిగుడ్డు రిటైల్‌గా ఒక్కొక్కటి 6 రూపాయలకు విక్రయిస్తున్నారు. అలాగే పొట్టెలు మాంసంలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయని, కొవిడ్‌ బాధితులు త్వరగా కోలుకునేందుకు ఇవి దోహదపడుతాయనే ప్రచారం జరుగడంతో ధర కొండెక్కింది. దీని ధర రూ.600 ఉండగా, రూ.650 నుంచి రూ.800 వరకూ విక్రయిస్తున్నారు. నాటు కోడి రూ.300 ఉండగా రూ.500లకు పెరిగింది. ప్రతి ఇంట్లో గుడ్డు నిత్యం ఆహారంలో భాగమైంది. చికెన్‌, మాంసం, గుడ్ల ధరలు అమాంతంగా పెరిగినప్పటికీ వినియోగం తగ్గకపోవడం గమనార్హం. 


 మాంసాహారంలో పోషకాలు

మటన్‌ (ప్రతి 100గ్రాముల్లో)

కొవ్వుపదార్థాలు: 21 గ్రాములు

కొలెస్ట్రాల్‌: 97మిల్లిగ్రాములు

సోడియం:        72మిల్లీ గ్రాములు

పోటాషియం: 310 మిల్లీ గ్రాములు

మాంసకృత్తులు: 25గ్రాములు

కాల్షీయం: 17మిల్లీ గ్రాములు

మెగ్నీషియం: 23 మిల్లీ  గ్రాములు

ఐరన్‌: 1.9 మిల్లీ గ్రాములు

లభించే విటమిన్‌లు : ఏ, డీ, బీ6,బీ12

కోడిగుడ్డులో (ఒకటి)

కొవ్వుపదార్థాలు: 11 గ్రాములు

కొలెస్ట్రాల్‌: 373 మిల్లీ గ్రాములు

కాల్షీయం: 25 మిల్లీ గ్రాములు

సోడియం: 124 మిల్లీ గ్రాములు

పిండి పదార్థాలు: 1.1గ్రాములు

మాంసకృత్తులు: 13 గ్రాములు

ఐరన్‌: 1.2 మిల్లీ గ్రాములు

మెగ్నీషియం: 10 మిల్లీ గ్రాములు

లభించే విటమిన్‌లు: ఏ, బీ6, బీ12

చికెన్‌లో (ప్రతి వంద గ్రాముల్లో)

కొవ్వు పదార్థాలు: 14 గ్రాములు

కొలెస్ట్రాల్‌: 88 మిల్లీ గ్రాములు

సోడియం: 82  మిల్లీ గ్రాములు

మంసకృత్తులు: 27 గ్రాములు

కాల్షీయం: 15 మిల్లీ గ్రాములు

ఐరన్‌: 1.3 మిల్లీ గ్రాములు

మెగ్నీషియం: 23 మిల్లీ గ్రాములు

లభించే విటమిన్‌లు: ఏ, డీ, బీ6,బీ12