గురువారం 21 జనవరి 2021
Peddapalli - Nov 27, 2020 , 00:29:46

విద్వేషాలు సృష్టించేలా మాట్లాడద్దు

విద్వేషాలు సృష్టించేలా మాట్లాడద్దు

  • ఓటు బ్యాంకు రాజకీయాలు వద్దు
  • ‘నమస్తే’తో సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ/ముత్తారం: ‘నా నలభై ఏళ్ల హైదరాబాద్‌ జీవితంలో ఎన్నో రకాల మతకల్లోలాలు, ఘర్షణలు, కర్ఫ్యూలు చూసిన. కనీ, ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ సర్కారు పాలనలో శాంతి, సామరస్యాలను, ప్రశాంత జీవనాన్ని చూస్తున్న. హైదరాబాద్‌ నగరం ఒక మినీ ఇండియా. ఇక్కడ దేశంలోని అన్ని రాష్ర్టాలకు చెందిన ప్రజలు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జీవనం సాగిస్తున్నరు. అన్ని ప్రాంతాల ప్రజల సమాహారమే మన హైదరాబాద్‌. అలాంటి నగరంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు మత కలహాలు చెలరేగేలా ప్రసంగాలు చేయడం సరికాదు. ఎన్నికల్లో గెలిస్తే ఏం చేస్తారో. ఏ విధమైన అభివృద్ధిని చేస్తారో చెప్పాలి. కనీ, ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడడం సరైన విధానం కాదు. ఓటు బ్యాంకు రాజకీయాలు సరికాదు’ అని సినీ నటుడు, దర్శక, నిర్మాత ఆర్‌ నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. ఒక సినిమా నిర్మాణానికి సంబంధించిన కథ, పాటల విషయంలో గురువారం పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ గ్రామానికి చెందిన సినీ గాయకుడు, కవి గోస్కుల కొమురయ్య నివాసానికి వచ్చిన సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు. 

ఆయన మాటల్లోనే..కేసీఆర్‌ను మించిన సెక్యులరిస్టు లేరు..

హైదరాబాద్‌ నగరం ఒక మినీ భారత దేశం. దేశంలోని అన్ని కులాలు, మతాలు, జాతుల వాళ్లంతా నివాసం ఉంటున్నారు. హైదరాబాద్‌ నగరంలో అనేక మత కల్లోలాలు, ఘర్షణలు, కర్ఫ్యూలు, హింసాయుత వాతావరణాన్ని గత నలభై ఏళ్లుగా కాంగ్రెస్‌, టీడీపీ పాలనలో చూశా. కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఏడేళ్లల్లో ఎలాంటి అలజడి లేకుండా ప్రజలు ప్రశాంతంగా, శాంతియుత వాతావరణంలో జీవనాన్ని సాగిస్తున్నారు. అలాంటి నగరానికి ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగాలి. కానీ, ప్రశాంతతను చెడగొట్టేలా పార్టీల నేతలు ప్రచారాలు చేయడం సరికాదు. ఓటు బ్యాంక్‌ పాలిటిక్స్‌తో మత విద్వేషాలు రెచ్చగొట్టడం కాదు.. మీరు గెలిస్తే ఏం చేస్తారో చెప్పాలి తప్ప మతాలు, వర్గాల ప్రజల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడడం ధర్మం కాదు. కేసీఆర్‌ను మించిన సెక్యులరిస్టు ఈ దేశంలోనే ఎవరూ లేరు. ఆయన ఒక హిందువుగా యజ్ఞాలు, హోమాలు చేస్తారు. ముస్లిం, క్రిస్టియన్‌, సిక్కు, బౌద్ద, పార్షీ మతాలను గౌరవిస్తూ వారి మనోభావాలు దెబ్బతినకుండా అన్ని వర్గాల ప్రజలు సుఖంగా, సంతోషంగా జీవించేలా పాలనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ఫలాలను ప్రజలందరికీ అందేలా పాలన సాగిస్తున్నారు.  ఆయన తలపెట్టిన ఫెడరల్‌ ఫ్రంట్‌తో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షిస్తున్నా. 

హక్కులను కేంద్రం కాలరాస్తున్నది..

కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ ప్రజలు, కార్మికులు, కర్షకులు, రైతులు, పబ్లిక్‌ సెక్టార్‌ను కార్పొరేట్‌ కంపెనీలు, పెట్టుబడి దారుల ముందు మోకరిల్లేలా చేస్తున్నదని, ఈ కారణంగానే రాజ్యాంగ దినోత్సవమైన నవంబర్‌ 26న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు దిగారు. దేశంలోని విమానయానాన్ని, నౌకాయానాన్ని, రైల్వేలను, ఆర్టీసీ, జాతీయ బ్యాంకులను, సింగరేణి, ఎన్టీపీసీ, ఇలా ఒక్కటేమిటి విద్యను, వైద్యాన్ని, వ్యవసాయాన్ని సర్వనాశనం చేసే నిర్ణయాలను కేంద్రం చేసింది. ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ చేస్తూ రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్‌, హక్కులను బడుగు, బలహీన వర్గాలకు దక్కకుండా అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నది. జాతీయ నూతన విద్యా విధానాన్ని ప్రకటించి భారతదేశం మన మానవ వనరుల శక్తిని కేవలం పనిముట్లుగా తయారు చేస్తున్నది. విదేశీ యూనివర్సిటీలకు అనుమతి ఇస్తున్నది. జాతీయ సంపదను ప్రైవేటు  గుత్తాధిపతుల పరం చేస్తున్నది. 

సినిమాతల్లి బిడ్డలను ఒడికి చేర్చుకున్న కేసీఆర్‌ 

కరోనా బీభత్సం వల్ల వీధిన పడే లక్షలాది మంది సినిమాతల్లి పేద సినీ కళాకారులు, కార్మిక బిడ్డలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల జల్లు కురిపించి ఒడి కి చేర్చుకున్నారు. అందుకు ఆయనకు ఒక కళాకారుడిగా కృతజ్ఞతలు తెలియజ్తేస్తున్నా. ప్రత్యక్షంగా.. పరోక్షంగా సినిమాపై ఆధారపడి జీవిస్తున్న అనేక మందికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎంతో ఊరటను కలిగించింది. సినిమా ప్రపంచాన్ని కాపాడడం కోసం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలు భేష్‌. 9శాతం జీఎస్టీని సైతం తిరిగి సినీ పరిశ్రమకే అప్పగించడం వల్ల లక్షలాది మంది సినీ కుటుంబాలకు మేలు జరుగుతుంది. దీంతోపాటు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న కార్మికులకు హెల్త్‌కార్డులు, రేషన్‌కార్డులు ఇస్తూ ఆదుకోవడం చాలా గొప్ప విషయం. గతంలో కాంగ్రెస్‌, ఇతర పార్టీలు జీఎస్టీ, సెస్‌ పన్నులు జానెడుగా విధిస్తే ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం బారెడుగా వసూలు చేస్తున్నది. రాష్ర్టాలకు రావాల్సిన వాటాలను కేంద్రం ఇవ్వకుండా కష్టజీవుల చెమట చుక్కలను కొల్లగొడుతున్నది. ఫెడరల్‌ లక్షణాలను సర్వనాశనం చేస్తూ ఫెడరల్‌ స్ఫూర్తికే విఘాతాన్ని కలిగిస్తున్నది. 

గోరటికి ఎమ్మెల్సీ.. కళామతల్లికి గౌరవం

ఆ రోజుల్లో మనకున్న ప్రజా వాగ్గేయకారుల్లో అన్నమయ్య, త్యాగయ్య, రామదాసుల్లాగా ఇప్పుడు ఒక గద్దర్‌, వంగపండు, గోరటి వెంకన్న ఉన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణలో తన సాహిత్యంతో ప్రజల మనసులను చూరగొన్న వెంకన్నను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవించడం కళామతల్లిని గౌరవించినట్టయ్యింది. ఆయనకు నేను సెల్యూట్‌ చేస్తున్నా. ఇది ‘గోరటి’కే కాదు యావత్‌ తెలంగాణ సాహితీ, సినిమా, కవులు, కళాకారులు, గాయకులకు ఇచ్చినట్లయ్యింది. పల్లె కన్నీరు పాటకు ఇచ్చినట్టు.. తెలంగాణ రాష్ట్ర పక్షి పాలపిట్టకు ఇచ్చినట్టు ఈ పదవి. ఈ పదవితో యావత్‌ సినిమా లోకం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నది.logo