శనివారం 28 నవంబర్ 2020
Peddapalli - Oct 02, 2020 , 02:29:47

మంత్రపురిలో కర్షక సంబురం

మంత్రపురిలో కర్షక సంబురం

హలంపట్టి పొలం దున్నే కర్షకలోకం సంబురాల్లో మునిగితేలుతున్నది. ఏండ్లనాటి బాధలను తుడిచేందుకు తెచ్చిన కొత్త చట్టానికి జై కొడుతూ, ప్రియతమ నేత సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నది. ఊరూరా ధూంధాం నృత్యాలు.. ప్రదర్శనలతో పటాకలు కాలుస్తూ అభిమానాన్ని చాటుకుంటున్నది. గురువారం మంథని నియోజకవర్గంలో 2300 ట్రాక్టర్లతో ర్యాలీ తీసి, హోరెత్తించింది. పెద్దపల్లి, భూపాలపల్లి జడ్పీ అధ్యక్షులు పుట్ట మధూకర్‌, జక్కు శ్రీహర్షిణి పాల్గొనగా, నాలుగు మండలాల నుంచి వేలాదిగా తరలివచ్చిన కర్షకులతో నియోజకవర్గ కేంద్రం గులాబీమయమైంది.

పెద్దపల్లి, నమస్తే తెలంగాణ:ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెచ్చిన కొత్త చట్టానికి మద్దతుగా మంథని నియోజకవర్గం నుంచి వేలాది మంది రైతులు కదిలారు. కమాన్‌పూర్‌, ముత్తారం, రామగిరి, మంథని మండలాల నుంచి 2,300 ట్రాక్టర్లతో భారీ ర్యాలీ తీశారు. ముందుగా ఆయా మండలాల నుంచి మంథని పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చేరుకోగా, జయశంకర్‌ భూపాలపల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి, పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌తో కలిసి పెద్దపల్లి జడ్పీచైర్మన్‌ పుట్ట మధూకర్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం మధూకర్‌ కాసేపు ట్రాక్టర్‌ నడిపారు. శివారు ప్రాంతమైన శ్రీరాంనగర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని బస్‌ డిపో ఏరియా దాకా దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర సాగింది. పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారి పూర్తిగా ట్రాక్టర్లతో నిండిపోయింది. దారిపొడవునా డీజే సౌండ్స్‌, డప్పుచప్పుళ్ల నడుమ రైతులు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేస్తూ పటాకలు కాల్చారు. ట్రాక్టర్లకు కట్టిన సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌, కొప్పుల ఈశ్వర్‌, ఈటల రాజేందర్‌, ఎంపీ బోర్లకుంట వెంకటేశ్‌, జడ్పీ చైర్మన్‌ పుట్ట ఫ్లెక్సీలు, కటౌట్లు ఎంతగానో ఆకర్షించాయి. అనంతరం మంథని మున్సిపాలిటీ పరిధిలోని కూచిరాజ్‌పల్లిలోని పత్తి చేనులో సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి, ‘జై కేసీఆర్‌' అంటూ నినాదాలతో హోరెత్తించారు. చివరగా చైతన్యపురి కాలనీలో జరిగిన సమావేశంలో జడ్పీ చైర్‌ పర్సన్లు మాట్లాడారు.  

దశాబ్దాల బాధలకు చరమగీతం 

దశాబ్దాలుగా కొనసాగుతున్న అవినీతికి, అక్రమాలకు చరమగీతం పాడేందుకే  సీఎం కేసీఆర్‌ కొత్త చట్టాన్ని తెచ్చారు. కాంగ్రెస్‌ 70ఏళ్ల పాలనలో రాష్ట్రంలో, స్థానికంగా మంథనిలో చేసింది శూన్యం. పూర్తిగా అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ప్రజలను పీల్చిపిప్పిచేశారు. నేలను నమ్ముకున్న రైతులకు మేలు చేసేందుకు ఎన్నడూ ప్రయత్నం చేయలేదు. ప్రజలు ఎప్పడూ సమస్యలతో ఉండాలి.. పరిష్కారానికి తమ వద్దకు వస్తూనే ఉండాలనే ఆలోచించారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాష్ర్టాన్ని సాధించి, సీఎం అయిన కేసీఆర్‌.. రైతు కండ్లలో ఆనందం చూసేందుకు అనేక కార్యక్రమాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిండు. రైతు బంధు కింద పెట్టుబడి, రైతు బీమా ఇలా అన్నింటా అండగా నిలుస్తుంటే అడ్డుకునేందుకు కొందరు ప్రింట్‌, సోషల్‌ మీడియాను వాడుకుంటూ నానా రాద్దాంతం చేస్తున్నరు. పేదలు పడుతున్న బాధ, ఆవేదన వారికి తెలియదు. కొత్త రెవెన్యూ చట్టం అనేక సమస్యలకు పరిష్కారం చూపుతుంది. గట్టు, గెట్టు పంచాయితీలు పూర్తిగా తగ్గుతాయి. ఒక్క క్లిక్‌తో రైతు భూమిపై హక్కు పత్రం పొందవచ్చు.

పుట్ట మధూకర్‌,  జడ్పీ చైర్మన్‌ (పెద్దపల్లి )

రైతుల బాధలు దూరం..

కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు ఎంతో మేలు జరుగుతుంది. ఇది రైతులకు వజ్రాయుధం లాంటిది. భూ వివాదాలన్నింటికీ చెక్‌ పెడుతుంది. అందుకే పల్లెపల్లెనా చట్టాన్ని స్వాగతిస్తూ సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ర్యాలీలు తీస్తున్నారు. భూ వివాదాలకు శాశ్వతంగా పరిష్కారం చూపేందుకే సీఎం కేసీఆర్‌ కొత్త చట్టం తెచ్చారు. ఇక నుంచి రిజిస్ట్రేషన్‌ రోజే మ్యుటేషన్‌, పాస్‌ బుక్కులూ జారీ అవుతాయి. రైతుల బాధలు దూరం అవుతాయి.  

- జక్కు శ్రీహర్షిణి, జడ్పీ చైర్‌పర్సన్‌ (జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా)