మంగళవారం 24 నవంబర్ 2020
Peddapalli - Jul 07, 2020 , 02:19:31

సరికొత్తగా ‘సాగు’తూ..

సరికొత్తగా ‘సాగు’తూ..

  • n సమయానికి అందిన  పెట్టుబడి సాయం
  • n నియంత్రిత విధానంలో ముందుకు
  • n 46 శాతం మంది పత్తికే మొగ్గు

ఓదెల: సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చిన నియంత్రిత విధానంలోనే రైతాంగం ముందుకు ‘సాగు’తున్నది. సమయానికి రైతు బంధు సాయం అం దడంతో వ్యవసాయ పనుల్లో వేగం పుంజుకున్నది. గుంటుక కొట్టే.. గడ్డి ఏరే పనులు ఊపందుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం సాగు పనుల పెట్టుబడికి రైతు బంధు పథకం ద్వారా ఎకరాకు రూ. ఐదువేల చొప్పున డబ్బులు జమ చేయడంతో అన్నదాతలు ఆనందంలో ఉన్నారు. ఆర్థికంగా ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. రోహిణి కార్తెలోనే ఆశించిన వానలు కురవడంతో రైతులు పత్తి పెట్టారు. అవి ఇప్పుడు మొలకెత్తాయి. చేన్లలోని కలుపు గడ్డిని తొలగించేందుకు పలుగు వేసి గుంటుక కొడుతున్నారు. మహిళా కూలీలతో గడ్డి ఏరే పనులు చేయిస్తున్నారు. ఇటీవల అందిన పెట్టుబడి సాయంతో ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. వరి సాగు కోసం భూములను ట్రాక్టర్లతో దున్నిస్తున్నారు. ఓదెల మండలంలో 31,785 ఎకరాల సాగు భూమి ఉండగా, అందులో 46 శాతం 14,707 ఎకరా ల్లో రైతులు ఈ ఏడాది పత్తిను సాగు చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఆలోచనలకు అనుగుణంగా రైతాం గం పత్తి, సన్నరకం వరి సాగుకు మొగ్గు చూపారు. ఓదెల మండలంలోని 11,999 మంది రైతులకు రైతు బంధు పథకం కింద రూ. 12,98,31,292 బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. దీంతో వానకాలం పంటల సాగును రైతులు ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు.

కరెక్ట్‌ టైంలో పైసలు ..

నాది మడక. నాకు నాలుగు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో రెండు ఎకరాల్లో పత్తి, ఎకరంలో దొడ్డు, ఎకరంలో సన్నరకం వరి వేసిన. సీఎం కేసీఆర్‌ సార్‌ చెప్పిన విధంగా పత్తి, సన్నరకం వరి సాగు ఈ ఏడాది చేస్తున్న. కరెక్ట్‌ టైంలో ప్రభుత్వం పెట్టుబడి కోసం పైసలు వేయడం సంతోషంగా ఉంది. నాకు రైతు బంధు కింద రూ.20వేలు వచ్చినయ్‌. వీటితో విత్తనాలు, ఎరువులు తీసుకున్న, కైకిళ్లకు ఉపయోగపడుతున్నయ్‌.  

- చల్లా చక్రవర్తి, రైతు, మడక