శనివారం 04 జూలై 2020
Peddapalli - Mar 20, 2020 , 03:18:26

నో కరోనా నో హైరానా

నో కరోనా నో హైరానా

 • కరీం‘నగరం’లో వైరస్‌ కట్టడికి కదిలిన యంత్రాంగం 
 • బాసటగా నిలిచిన రాష్ట్ర ప్రభుత్వం 
 • నివారణకు పటిష్ట చర్యలు 
 • ఉదయం నుంచే రంగంలోకి వంద వైద్య బృందాలు
 • తొలి రోజు కలెక్టరేట్‌ చుట్టూ కిలోమీటర్‌ మేర ఇంటింటికీ పరీక్షలు
 • ఏ ఒక్కరికీ కనిపించని లక్షణాలు
 • దగ్గరుండి పర్యవేక్షించిన మంత్రి గంగుల 
 • సంపూర్ణంగా సహకరిస్తున్న ప్రజలు 
 • స్వచ్ఛందంగా మూతపడ్డ షాపులు
 • బోసిపోయిన దారులు
 • ‘గాంధీ’కి మరికొందరు అనుమానితులు  
 • మరింత లోతుగా వివరాలు సేకరిస్తున్న పోలీసులు 
 • ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు 

కరీం‘నగరం’లో కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం కలిసికట్టుగా కదిలింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పకడ్బందీ చర్యలు చేపట్టింది. వంద వైద్య బృందాలను ఏర్పాటు చేసి.. గురువారం ఉదయమే రంగంలోకి దింపింది. ఇండోనేషియా వాసులు తిరిగినట్లు గుర్తించిన కిలోమీటర్‌ పరిధిలో ఇంటింటికీ వెళ్లి పరీక్షలు చేసింది. 6,126 గృహాల్లో 25 వేల మందికి స్క్రీనింగ్‌ టెస్టులు చేసి, ఏ ఒక్కరికీ వైరస్‌ లక్షణాలు లేవని నిర్ధారించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వైద్య బృందాలకు దిశానిర్దేశం చేసిన మంత్రి గంగుల కమలాకర్‌.. స్వయంగా కలెక్టరేట్‌ ఎదురుగా ఉన్న వీధుల్లో కాలినడకన తిరిగారు. మరోవైపు అన్ని డివిజన్లలో పెద్ద ఎత్తున శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. సర్కారు చేపట్టిన చర్యలకు ప్రజలు సంపూర్ణంగా సహకరిస్తున్నారు. మరోవైపు విదేశాల నుంచి వచ్చిన వారి పూర్తి వివరాలు సేకరించి, స్వీయ నిర్బంధం ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.


నివారణ చర్యల్లో ముఖ్యాంశాలు

 1. ఇండోనేషియా వాసులు తిరిగిన కిలోమీటర్‌ పరిధిలో వంద వైద్య బృందాలు పరీక్షలు చేశాయి. 6,126 ఇండ్లలో 25 వేల మందికి స్క్రీనింగ్‌ టెస్టులు చేశాయి. ఏ ఒక్కరికీ వైరస్‌ లక్షణాలు లేవని గుర్తించారు. విదేశాల నుంచి వచ్చిన వారికి ఎలాంటి లక్షణాలు లేకపోవడంతో ఇంటికే పరిమితం చేశారు. ఈ నెల 31 వరకు నగరంలో ఉన్న 90 వేల గృహాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తారు. 
 2. rఇండోనేషియా వాసులను కలిసిన వారిలో కొంతమందిని గాంధీ దవాఖానకు పంపించగా, వారికి వైరస్‌ నిర్ధారణ కాలేదు. అయినా మరోసారి పరీక్ష కోసం చల్మెడ దవాఖానకు పంపించారు.  
 3. rఅన్ని డివిజన్లలో 700 మంది పారిశుధ్య కార్మికులతో శానిటేషన్‌ కార్యక్రమాలు చేపట్టారు. 65 సిలిండర్లతో హైపో క్లోరైడ్‌ స్ప్రే చేయిస్తున్నారు. నగరం మొత్తం బ్లీచింగ్‌ చల్లించారు. తర్వాత పినాయిల్‌తో స్ప్రే చేయిస్తున్నారు. మరోవైపు కరపత్రాలు కూడా పంపిణీ చేస్తున్నారు.  
 4. rనగరపాలక సంస్థ ద్వారా 2 వేలకు పైగా మాస్కులు తెప్పించారు. అవసరం మేరకు మరిన్ని అందుబాటులో ఉంచుతున్నారు. ప్రతి కార్మికుడికీ మాస్కులు, గ్లౌజులు, షూలు అందించారు. 
 5. ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. మెజార్టీ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేదు. వ్యాపారులంతా షాపులను స్వచ్ఛందంగా మూసివేశారు.

కరీంనగర్‌ ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరీంనగర్‌లో ‘కరోనా’ కలకలం రేగింది. నగరవాసులకు ఎవరికీ వైరస్‌ రాకున్నా ఇండోనేషియా నుంచి జిల్లాకేంద్రానికి వచ్చిన పది మందిలోఎనిమిది మందికి పాజిటివ్‌ రావడంతో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం, వెంటనే చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ బుధవారం కలెక్టర్‌, ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించారు. కరోనా కట్టడి కోసం చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో రాత్రంతా చర్చించారు. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసి, గురువారం ఉదయం నుంచే అమల్లోకి తీసుకొచ్చారు. ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది మత ప్రచారకులు కలెక్టరేట్‌కు ఆనుకొని ఉన్న మసీదులో ఎక్కువ సమయం గడిపినట్లు గుర్తించిన అధికారులు.. కలెక్టరేట్‌ చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ఇంటింటా వైద్య పరీక్షలు చేసేందుకు వంద బృందాలను రంగంలోకి దింపారు. బృందాల సభ్యులు నిర్ధారిత ప్రాంతంలో ఇంటింటికీ వెళ్లారు. కరోనా లక్షణాలు, నివారణ చర్యలను వివరిస్తున్నారు. ప్రధానంగా ఇంట్లో ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నారా?, అలాగే సదరు ఇంటికి ఇటీవలి కాలంలో ఎవరైనా విదేశాల నుంచి వచ్చారా?, ఇతర అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా?, ముఖ్యంగా కరోనా లక్షణాలు ఏమైనా కనిపించాయా? అనే వివరాలు సేకరిస్తున్నారు. ఒక్క రోజే కిలోమీటర్‌ పరిధిలోని 6,126 గృహాల్లో 25 వేల మందికి స్క్రీనింగ్‌ టెస్టులు చేసి, ఎవరికీ వైరస్‌ లేదని గుర్తించారు. మరోవైపు ప్రభుత్వ దవాఖానలో కరోనా వ్యాధిగ్రస్తుల కోసం పడకలను 20 నుంచి 100కుపెంచారు. అలాగే ప్రతిమ, చల్మెడ దవాఖానల్లో 50 చొప్పున బెడ్స్‌ సౌకర్యం కల్పించారు. అవసరమైతే మరిన్ని బెడ్స్‌ సౌకర్యం కల్పిస్తామని చల్మెడ వైద్యశాల ప్రతినిధులు చెబుతున్నారు. అలాగే.. శానిటేషన్‌ కార్యక్రమాలను అధికారులు విస్తృతం చేశారు. 60 డివిజన్లలో ఒకేసారి పారిశుధ్య పనులు చేపట్టారు. కలెక్టరేట్‌ చుట్టూ మూడు కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేకాధికారుల పర్యవేక్షణలో కార్పొరేషన్‌ ద్వారా పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

గల్లీల్లో తిరుగుతూ మంత్రి గంగుల భరోసా..

హైదరాబాద్‌ నుంచి బుధవారం రాత్రి కరీంనగర్‌ చేరుకున్న మంత్రి గంగుల.. ఓవైపు వ్యాధి తీవ్రతను చెబుతూనే.. తీసుకోవాల్సిన జాగ్రత్తలను స్వయంగా వివరిస్తున్నారు. అంతేకాదు, ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న భరోసా కల్పిస్తున్నారు. గురువారం ఉదయమే ఆయన వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయానికి వచ్చి, వైద్యాధికారితోపాటు సంబంధిత వైద్యులతో మాట్లాడారు. ఏర్పాటు చేసిన వంద వైద్య బృందాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదే సమయంలో పరీక్షల కోసం వెళ్లే వైద్య బృందాలకు మాస్కులు, ఇతర పరికరాలు అందించారు. ఇళ్లకు వెళ్లినప్పుడు ప్రజలతో వ్యవహరించాల్సిన తీరు, సేకరించిన వివరాలపై బృందం సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని వివరించడంతోపాటు కరోనా కట్టడికి ఎలా అండగా ఉన్నామన్న విషయాలను ఇంటింటికీ తెలిపి భరోసా కల్పించాలని సూచించారు. అక్కడితో ఆగకుండా.. వైద్య బృందాలతో కలిసి ముకరంపురలోని పలు కాలనీల్లో పర్యటించారు. అలాగే ఇండోనేషియా నుంచి వచ్చిన మత ప్రచారకులు బసచేసిన మసీద్‌వద్ద పర్యటించి.. ప్రాంతంలోని గృహవాసులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని, ఎవరూ అధైర్య పడవద్దని సూచించారు. ఏమాత్రం అనుమానాలున్నా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు.

200 పడకల బెడ్స్‌తో సేవలు 

కరీంనగర్‌ రూరల్‌: కరోనా వైరస్‌ నేపథ్యంలో సామాజిక బాధ్యతగా సేవలందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చల్మెడ ఆనందరావు వైద్య విజ్ఞాన పరిషత్‌ చైర్మన్‌ చల్మెడ లక్ష్మీనరసింహారావు తెలిపారు. కరీంనగర్‌ మండలంలోని చల్మెడ ఆనందరావు వైద్యశాలలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలి పరిస్థితులను చూస్తే వైరస్‌ విస్తరించేలా కనిపిస్తున్నదని, ఈ తరుణంలో మనకు మనమే స్వీయ నిర్బంధం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వందేళ్ల కింద 1918లో లోఫ్యానిష్‌-2 అనే వ్యాధి వచ్చినప్పుడు భారత దేశంలో కోటీ 40 లక్షల మంది చనిపోయారని, ప్రపంచ వ్యాప్తంగా 5 కోట్ల నుంచి 10 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. అది కూడా ఇలాగే వ్యాపించిందన్నారు. మనం వ్యక్తిగత భద్రత, బాధ్యతతో కొవిడ్‌-19 వైరస్‌ను తరిమేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. చల్మెడ ఆనందరావు వైద్యవిజ్ఞాన కేంద్రంలో 50 ఐసోలేషన్‌ బెడ్స్‌తోపాటు 10 ఐసీయూ పడకలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం కోరిందని, అయితే వీటితో పాటు సామాజిక బాధ్యతగా తమ సంస్థ నుంచి మరో 200 పడకలతో ఐసోలేషన్‌ వార్డు  ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. గతంలో డెంగీ విపత్తుకు ప్రభుత్వానికి సహకారం అందించామని, ఇప్పడు ఈ వైరస్‌పై ఒక్క పైసా ఆశించకుండా వైద్య సేవలందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా వైద్యశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అసీమ్‌ మాట్లాడుతూ, కరోనా వ్యాధికి ప్రత్యేక జాగ్రతలు తీసుకోవాలని, చేతులు శుభ్రం చేసుకోవాలని, మాస్కులు వాడాలని, కరచాలనం చేయవద్దని, ఇతరులకు దూరంగా ఉండాలని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చల్మెడ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విదేశాల నుంచి వచ్చిన వారిపై ఆరా..  

ఇండోనేషియా నుంచి వచ్చిన పది మంది మత ప్రచారకులు.. ఈ నెల 14 నుంచి 16 వరకు ఎక్కడెక్కడ తిరిగారో పోలీసులు పూర్తిగా వివరాలు సేకరించారు. రామగుండం రైల్వేస్టేషన్‌లో దిగి.. అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో కరీంనగర్‌కు వచ్చి,  ఆ తదుపరి వారు నాలుగు మసీదుల వద్ద తిరిగినట్లు గుర్తించారు. అంతేకాదు కొంతమందిని ప్రత్యేకంగా కలిసినట్లు సీసీ ఫుటేజీల ద్వారా తెలుసుకున్నారు. ఆ సీసీ పుటేజీలు ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వాటి ఆధారంగా మత ప్రచారకులు నివాసం ఉన్న, వారితో కలిసిన వ్యక్తులను గుర్తించి వైద్య పరీక్షల కోసం వైద్య, ఆరోగ్యశాఖతో కలిసి హైదరాబాద్‌ పంపిస్తున్నారు. బుధవారం కొంత మందిని తరలించగా.. గురువారం మరికొందరిని గాంధీ దవాఖానకు తీసుకెళ్లారు. రిపోర్టులు వస్తే.. వారికి వైరస్‌ సోకిందా? లేదా? అన్న వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు విదేశాల నుంచి ఈ మధ్యకాలంలో వచ్చిన వారి వివరాలను శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుంచి తెప్పిస్తున్నారు. ఆ మేరకు సదరు వ్యక్తుల ఇళ్లకు వెళ్లి.. వివరాలు ఆరా తీస్తున్నారు. వివిధ గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చిన వ్యక్తులను గుర్తించి.. స్వీయ నిర్బంధం ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధిత మండల తాసిల్దార్‌కు, పోలీసులకు వివరాలు అందిస్తున్నారు. ఇప్పటివరకు విదేశాలనుంచి వచ్చిన వారికే పాజిటివ్‌ నిర్ధారణ కాగా, ఆ కోణంలో అధికారులు స్పెషల్‌ ఫోకస్‌ పెట్టారు.

కలెక్టరేట్‌ మెయిన్‌ గేటుకు తాళం

కార్పొరేషన్‌, నమస్తే తెలంగాణ : కలెక్టరేట్‌ మెయిన్‌ గేటుకు అధికారులు తాళం వేశారు. విజిటర్స్‌ ఎవరినీ లోనికి అనుమతించడం లేదు. అలాగే తెలంగాణ జైళ్లశాఖ డైరెక్టర్‌ జనరల్‌ ఆదేశాల ప్రకారం ఖైదీలతో ములాఖత్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ మేరకు జిల్లా కారాగారం ముందు బారికేడ్లు ఏర్పాటు చేసి సందర్శకులను ఎవరినీ అనుమతించడం లేదు.

కలెక్టర్‌, సీపీని అభినందించిన సీఎం

కరోనా వైరస్‌ను అరికట్టేందుకు కలెక్టర్‌ శశాంక, సీపీ కమలాసన్‌రెడ్డి పకడ్బందీ చర్యలు తీసుకుంటుండడంతో వారిని సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా అభినందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కరీంనగర్‌లో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలను ప్రస్తావించారు. వ్యాధి లక్షణాలను గుర్తించడం, సమాచారం సేకరించడం, సత్వరం స్పందిస్తున్న తీరును ప్రశంసిస్తూ, వీరిని ఇతర జిల్లాల అధికారులు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. 

జిల్లా కోర్టు సముదాయాలు మూసివేత

కరీంనగర్‌ లీగల్‌ : రాష్ట్ర హైకోర్టు ఆదేశాలతో జిల్లా కోర్టు సముదాయాలను మూసివేస్తున్నట్లు జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి తెలిపారు. పై నుంచి వచ్చిన ఆదేశాలతో గురువారం మధ్యాహ్నం తర్వాత కోర్టు ఆవరణ నుంచి ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు ఖాళీ చేయాలని ఆదేశించారు. ఆదివారం రాత్రి వరకు మూసేస్తున్నామని, ఉద్యోగులు, న్యాయవాదులు, కక్షిదారులు, న్యాయమూర్తులు కోర్టులకు హాజరుకావద్దని, న్యాయమూర్తులు ఇంటి వద్దనే విధుల్లో ఉంటారని తెలిపారు. జిల్లా కేంద్రం మినహా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోర్టుల్లో ఇదివరకటి లా అత్యవసర సేవలు మాత్రమే ఉంటాయని, తదుపరి ప్రకటన వచ్చే వరకు జిల్లా కోర్టులు మూసి ఉంటాయని తెలిపారు. కాగా, హైకోర్టు ఆదేశాలు అందగానే జిల్లా జడ్జి కోర్టు ఆవరణలోని మధ్యవర్తిత్వ భవనంలో కోర్టు సిబ్బంది, న్యాయమూర్తులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, హైకోర్టు ఆదేశాలను వివరించారు.


logo