‘మాటలు కోటలు దాటుతాయి.. చేతలు గడప దాటవు’ అనే సామెత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు అద్దం పడుతున్నది. గత ఎన్నికల ముందు ఆ పార్టీ అగ్రనేతలు యువతను ఆకట్టుకునేందుకు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ పేరుతో డైలాగులు కొట్టారు. ఇప్పుడేమో ఉద్యోగాలు అడిగితే పోలీసులతో లాఠీచార్జి చేయిస్తున్నారు.
2023 మే 8న హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వ హించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ‘ఈ హామీలు అమలు చేయకపోతే ఐదేండ్ల తర్వాత మమ్మల్ని గద్దె దించండి’ అని ఆమె ప్రకటించారు. అప్పటి పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కూడా యువతకు ఉద్యోగాలు, ఉపాధిపై వరుస హామీలు గుప్పించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయినా ఇప్పటివరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు.
యూత్ డిక్లరేషన్‌లో కాంగ్రెస్ చేసిన ప్రధాన వాగ్దానాలు ఇవి: అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల. ఉద్యోగం వచ్చే వరకు ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.4 వేలు నిరుద్యోగ భృతి. టీఎస్పీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రక్షాళన. ప్రైవేట్ రంగంలో యువతకు 75% రిజర్వేషన్. ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు, ఉద్యోగ మార్పిడి కేంద్రాలు ఏర్పాటు. యువతకు వడ్డీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు. తెలంగాణ ఉద్యమ అమరవీరుల కుటుంబాలకు ఉద్యోగాలు, పెన్షన్.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేండ్లు దాటినా, యూత్ డిక్లరేషన్‌లో ప్రకటించిన హామీలు అమలుకు నోచుకోవడం లేదు. దీంతో నిరుద్యోగులు మానసికంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. దీనికి ముమ్మాటికీ పాలక ప్రభుత్వమే కారణం. ఉద్యోగాల భర్తీపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఆ పార్టీ నాయకులు ఎవరికి తోచినట్టుగా వారు ప్రచారాలు చేసుకుంటున్నారు. లక్ష ఉద్యోగాలు ఇచ్చామని ఒకరు.. 50 వేలు ఇచ్చామని మరొకరు చెప్పుకుంటున్నారు. కానీ ప్రభుత్వం ఏర్పడ్డాక పట్టుమని 10 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. కేసీఆర్నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకే నియామకపత్రాలు ఇచ్చి.. తామే ఇచ్చినట్టుగా కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇటీవల పోలీసు ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 20 వేల పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు నెల రోజులకు పైగా రోడ్డెక్కి నిరసనలు తెలిపారు. వారి పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది. పోలీసులతో లాఠీచార్జి చేయించింది. ప్రభుత్వం మాత్రం 7 వేల పోస్టులే భర్తీ చేస్తామని స్పష్టం చేసింది.
ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్న ఉద్యోగాల ఖాళీల లెక్కలు కూడా బయటపెట్టడం లేదు. రాష్ట్రంలో 30 లక్షలకు పైగా నిరుద్యోగులు ఉన్నారని అధికారంలోకి రాకముందు రేవంత్‌రెడ్డి పదే పదే చెప్పారు. ఇప్పుడు అందులో లక్ష ఉద్యోగాలు కాదు కదా..కనీసం 50 వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు. కొద్దినెలల క్రితం జరిగిన గ్రూప్-1, గ్రూప్-2 నియామకాలకు ఒక్కో నోటిఫికేషన్‌కు ఐదు లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అంటే పరిస్థితి ఎలా ఉన్నదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు.. ఉద్యోగాల కోసం ఆందోళనలు చేస్తున్న నిరుద్యోగ యువతను ఉద్దేశించి సీఎం పలు సందర్భాల్లో చేసిన ‘ముదురు బెండకాయలు’, ‘అడ్డా కూలీలు’ వంటి వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ వివాదానికి దారితీశాయి. ఈ వ్యాఖ్యలు తమను అవమానించేలా ఉన్నాయని నిరుద్యోగులు మండిపడ్డారు. దీంతో నోటిఫికేషన్లు వద్దంటూ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారంటూ స్వయంగా సీఎం అనేక వేదికలపై అబద్ధాలు చెప్పారు.
రాష్ట్రంలో ఉద్యోగ కల్పన కూడా క్రమేణా తగ్గిపోతున్నది. నానాటికీ నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. 2025 సంవత్సరానికి గాను దేశంలోనే అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలువడం సిగ్గుతో తలవంచుకోవాల్సిన అంశం. 8.9 శాతం నిరుద్యోగిత రేటుతో యూపీ, బిహార్ కంటే అధ్వానస్థితికి మన రాష్ట్రం పడిపోవడం రేవంత్‌రెడ్డి పనితనానికి నిదర్శనం.
ఇప్పుడు యువత అడుగుతున్న ప్రశ్న ఒక్కటే..2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? రూ.4 వేల నిరుద్యోగ భృతి ఏమైంది? జాబ్ క్యాలెండర్ ఎందుకు లేదు? హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటి అమలుపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేసి, ఏ హామీ ఎంతవరకు అమలైందో చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. ఎన్నికల ముందు డిక్లరేషన్ల పేరుతో యువతను, ప్రజలను బురిడీ కొట్టించిన ప్రియాంకగాంధీ, రాహుల్ గాంధీ ఇపుడు తెలంగాణ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఒకట్రెండుసార్లు వచ్చినా.. వారి పని వారు చూసుకొని వెళ్లిపోయారు. అంటే ఓట్ల కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్తాం.. ఓట్లు డబ్బాలో పడ్డాక ముఖం చాటేస్తామని వారే స్వయంగా ఒప్పుకున్నట్టు అయింది. అబదాలత్ధో నిరుద్యోగులను రెచ్చగొట్టి గద్దెనెక్కిన కాంగ్రెస్‌పై యువత యావత్తు ఆగ్రహంతో రగిలిపోతున్నది. నమ్మించి నట్టేట ముంచిన ఢిల్లీ అండ్ కో పార్టీకి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమైంది.
(వ్యాసకర్త: రెడ్కో మాజీ చైర్మన్)
-వై.సతీశ్‌రెడ్డి
96414 66666