‘ఫార్ములా-ఈ’ రేసులో భాగంగా కేటీఆర్‌పై కేసు నమోదైందన్న వార్త నాకు నవ్వు తెప్పించడమే కాదు, ఆశ్చర్యంగానూ అనిపించింది. ‘ఫార్ములా-ఈ’ రేస్‌కు ముందునుంచి జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో అప్పుడు తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) చైర్మన్ హోదాలో నేను కూడా పాల్గొన్నాను. వారం రోజుల పాటు జరిగిన ఈవెంట్లన్నింటినీ దగ్గరుండి చూశాను. హైదరాబాద్‌ను ఈవీ హబ్‌గా మార్చేందుకు, ఈ రంగంలో పెట్టుబడులు రాబట్టి, తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేసిన చాలా కార్యక్రమాల్లో టీఎస్ రెడ్కో ఆనాడు భాగస్వామిగా ఉన్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడులు తిరోగమన దిశలో ఉన్నాయి. ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గింది. ఆదాయం తగ్గడంతో ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేక రేవంత్ సర్కారు ఆపసోపాలు పడుతున్నది. ప్రతి దానికి గత సర్కారు మీద నెపం నెట్టేస్తున్నది. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రం పరువు తీస్తున్నది. రాష్ట్రంపై ప్రేమ ఉన్నవారికీ, కాసులపై ప్రేమ ఉన్నవారికీ మధ్య తేడా ఇదే. ఈవీల వినియోగంపై సెమినార్లు, కొత్త కంపెనీల వాహనాల లాంచింగ్‌లు, ఇప్పటికే మార్కెట్లో ఉన్న కంపెనీలు కొత్తగా తీసుకొచ్చిన ఎలక్ట్రిక్ కార్లను పరిచయం చేయడం.. ఇలా అనేక కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహించింది. ఈ-మొబిలిటీ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ఈ వేదికల మీదనే పరిశ్రమలశాఖ మంత్రిగా కేటీఆర్ ప్రకటించారు.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కంపెనీలకు మౌలిక వసతులు కల్పిస్తామని, వినియోగదారులకు ట్యాక్స్ మినహాయిస్తామని తెలిపారు. దీంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడుల పెట్టేందుకు మన రాష్ట్రంవైపు చూశాయి. ఆ వారంలో అమర్ రాజా రూ.9,500 కోట్లతో లిథియం అయాన్ గిగా ఫ్యాక్టరీ, హ్యుందయ్ రూ.1400 కోట్లు, బిలిటీ ఎలక్ట్రిక్ రూ.1100 కోట్లతో త్రీ వీల్ ఎలక్ట్రిక్ వాహన తయారీ కంపెనీ, అలాక్స్ రూ.750 కోట్లు, అటెరో రూ.600 కోట్లతో బ్యాటరీ రీసైక్లింగ్ కంపెనీ, గ్రాఫ్టన్ రూ.150 కోట్లు, అపోలో టైర్స్, బోష్ 3,000 ఉద్యోగాల కల్పన లాంటి చాలా ఎలక్ట్రిక్ వెహికల్ తయారీ కంపెనీలు, బ్యాటరీ తయారీ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ‘ఫార్ములా- ఈ’ రేస్ వల్ల రూ.700 కోట్ల వరకు రాష్ట్ర ఖజానాకు లాభం జరిగిందని అనేక అంతర్జాతీయ కంపెనీలు వెల్లడించాయి. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమంటే… రేస్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.35 కోట్లు మాత్రమే.
హైదరాబాద్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలని కేటీఆర్ నిర్ణయించుకున్నారు. అందుకే సిటీ నడిబొడ్డున, సెక్రటేరియట్ పక్కన ఎన్టీఆర్ గార్డెన్స్ చుట్టూ ఉన్న రోడ్డునే ట్రాక్‌గా నిర్మించారు. హైదరాబాద్ అందాలను ప్రపంచదేశాలు లైవ్‌లో చూసి నివ్వెరపోయాయి. ఆ రోజు రేస్‌కు నేను కూడా హాజరయ్యాను. కొన్ని వందల మంది విదేశీయులు, దేశ నలుమూలల నుంచి ప్రముఖులు రేస్ చూడటం కోసమే వచ్చారు. సిటీని చూసి ముగ్ధులయ్యారు. అంత గొప్ప ఈవెంట్ నిర్వహించిన కేటీఆర్‌పై కేసు పెట్టడమంటే ఎంత పిచ్చితనం!
కేసీఆర్, కేటీఆర్.. తెలంగాణకు పెట్టుబడులు మోసుకొచ్చారు. తెలంగాణ బాగుకోసం పనిచేశారు. మౌలిక వసతులు కల్పించారు. నరకానికి నకళ్లుగా ఉన్న హైదరాబాద్ రోడ్లను అద్దంలా మార్చారు. ట్రాఫిక్ నరకం నుంచి ప్రజలను తప్పించేందుకు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు నిర్మించారు. ప్రము సినీ నటులు రజినీకాంత్, లయ లాంటి వాళ్లు ‘తాము ఇండియాలో ఉన్నామా? అమెరికాలో ఉన్నామా?’ అని ఆశ్చర్యపోయారు. ఈ స్థాయిలో వసతుల కల్పన జరిగింది కాబట్టే ప్రపంచంలోనే దిగ్గజ కంపెనీలు హైదరాబాద్‌కు క్యూ కట్టాయి. అందుకే ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే హైదరాబాద్ అగ్రస్థానానికి దూసుకువెళ్లింది. 2014లో రూ.57,258 కోట్లున్న ఐటీ ఎగుమతుల విలువ 2023-24కు వచ్చేసరికి రూ. 2,70,000 కోట్లకు దూసుకువెళ్లింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఐటీ రంగంలో ఉపాధి కల్పన కూడా గణనీయంగా పెరిగింది. 2014 వరకు రాష్ట్రంలో 3,23,396 ఉన్న ఐటీ ఉద్యోగుల సంఖ్య 2023-24 వరకు 9.5 లక్షలకు పెరిగింది. ఇందులో ఒక్క 2023లోనే 1,30,000 మంది కొత్తగా ఐటీ సెక్టార్లో ఉద్యోగాలు పొందారు. ప్రస్తుతం ఐటీ ఎగుమతుల్లో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉన్నది.
అనుమతులు సరళతరం చేయడం ఐటీ రంగంలో పెట్టుబడులకు ఊతమిచ్చింది. అమెజాన్, గూగుల్ సంస్థలు తమ రెండో ప్రధాన కార్యాలయాలను హైదరాబాద్‌లో నెలకొల్పాయి. మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి సంస్థలు తమ శాశ్వత కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. అమెజాన్ వెబ్ సర్వీసెస్ రూ.36,600 కోట్ల పెట్టుబడులకు సిద్ధమైంది. దాదాపు 7.3 ఎకరాల్లో గూగుల్ అతిపెద్ద క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నది. ఫాక్స్‌కాన్ కూడా అతిపెద్ద క్యాంపస్‌ను నిర్మించింది. టీ హబ్, టీ వర్క్స్‌తో ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఓ వేదిక ఏర్పాటైంది. ఫలితంగా టీ హబ్ ఇప్పుడు ఆవిష్కరణలకు ప్రధాన వేదికైంది. ఉప గ్రహాలను తయారుచేసే స్థాయికి ఎదిగింది.
కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఏం చేయాలో, ఎలా ముందుకెళ్లాలో, రాష్ర్టాన్ని ఎలా నిలబెట్టుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఈ స్థాయి పెట్టుబడులు సాధ్యమయ్యాయి. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పెట్టుబడులు తిరోగమన దిశలో ఉన్నాయి. ఉద్యోగాల కల్పన గణనీయంగా తగ్గింది. ఆదాయం తగ్గడంతో ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు చేయలేక రేవంత్ సర్కారు ఆపసోపాలు పడుతున్నది. ప్రతి దానికి గత సర్కారు మీద నెపం నెట్టేస్తున్నది. అంతర్జాతీయ వేదికలపై రాష్ట్రం పరువు తీస్తున్నది. రాష్ట్రంపై ప్రేమ ఉన్నవారికీ, కాసులపై ప్రేమ ఉన్నవారికీ మధ్య తేడా ఇదే. ‘రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్’ను ‘రూట్ టు ఇన్‌కం’గా మార్చుకున్న వ్యక్తి వచ్చి వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చిన వ్యక్తిపై విమర్శలు చేస్తుంటే, కేసు పెట్టడాన్ని చూస్తుంటే నిజంగానే నవ్వు వస్తున్నది. ఒక్కటి మాత్రం నిజం. అధర్మం కొద్దికాలం పాటు విజయం సాధించవచ్చు, కానీ కాస్త ఆలస్యమైనా ధర్మమే విజయం సాధిస్తుంది.
(వ్యాసకర్త: మాజీ చైర్మన్, టీఎస్ రెడ్కో)
-వై.సతీష్‌రెడ్డి
96414 66666