ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడే ప్రాంతీయ అస్తిత్వ పతాకలు ఎగురుతాయి. మన కలలు సాకారమవుతాయి. మన గళం ఢిల్లీకి వినబడుతుంది. రాష్ర్టాల హక్కులు రక్షింపబడుతాయి. సమాఖ్యవాదం కలకాలం వర్ధిల్లుతుంది. ఈ విషయాన్ని ఎప్పుడో గుర్తించిన కేసీఆర్… ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం దేశమంతా కలియతిరిగారు. స్టాలిన్, మమతా బెనర్జీ, హేమంత్ సోరేన్, అరవింద్ కేజ్రీవాల్,అఖిలేష్ యాదవ్ తదితర నేతలను కలిశారు. ప్రాంతీయ పార్టీల ఐక్యత కోసం కృషిచేశారు. అందులో భాగంగానే టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు. మన ఐక్యత దెబ్బతిన్న నాడు మన కల చెదిరిపోతుందని కేసీఆర్ చెప్పినట్టుగానే.. నేడు తెలంగాణ అస్తిత్వ పతాక బీఆర్ఎస్ అధికారంలో లేని సమయంలో బీజేపీ డీ లిమిటేషన్ పేరిట తెలంగాణపై కత్తిగట్టింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్-82, ఆర్టికల్-170 ప్రకారం ప్రతి పదేండ్లకోసారి జనగణన జరగాలి. ఆ జనాభా లెక్కల ఆధారంగా డీ లిమిటేషన్ ప్రక్రియ చేపట్టాలి. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1952 నుంచి 1973 వరకు ఈ ప్రక్రియ సజావుగా సాగింది. ఆ తర్వాతే అసలు సమస్య ఉత్పన్నమైంది. అప్పటి వరకు దేశంలోని అన్ని ప్రాంతాల్లో జనాభా పెరుగుదల ఇంచుమించు ఒకే విధంగా ఉన్నది. దేశానికి సమస్యగా మారుతున్న జనాభా పెరుగుదలను అరికట్టాలని నిశ్చయించుకున్న అప్పటి కేంద్ర ప్రభుత్వం… 42వ రాజ్యాంగ సవరణ చేసి 2001 వరకు డీ లిమిటేషన్ ప్రక్రియ చేపట్టకూడదని నిర్ణయించింది. జాతీయ శ్రేయస్సు దృష్ట్యా దక్షిణాది రాష్ర్టాలు జనాభా నియంత్రణను విజయవంతంగా పాటించగా… ఉత్తరాది రాష్ర్టాలు ఈ అంశాన్ని పట్టించుకోలేదు.
ఈ కారణంగానే దక్షిణాది రాష్ర్టాలకు అన్యా యం జరుగకూడదనే ఉద్దేశంతో 2002లో 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2026 వర కు డీలిమిటేషన్ ప్రక్రియ నిలుపుదల చేస్తూ నిర్ణయించారు. కానీ, ఇప్పటికీ జనాభా పెరుగుదలలో అసమతుల్యత సమస్య వెంటాడుతూనే ఉన్నది. ప్రస్తుతం తెలంగాణ సహా మిగ తా దక్షిణాది రాష్ర్టాల సంతానోత్పత్తి రేటు ఇంచుమించు 1.7 కాగా.. యూపీ 2.7, బీహార్ 3గా ఉన్నది. 1951 జనాభా లెక్కల ప్రకారం… దేశ జనాభాలో దక్షిణాది రాష్ర్టాల వాటా 26.2 శాతం కాగా.. నేడు 18 శాతానికి పడిపోయింది. పార్లమెంట్లో 20 శాతం ప్రాతినిధ్యం ఉన్న దక్షిణాది రాష్ర్టాలు దేశ జీడీపీలో సుమారుగా 35 శాతం వరకు సమకూర్చుతున్నాయి. అయినా దక్షిణాదికి ఇటు నిధుల పరంగా, పార్లమెంట్లో సీట్ల పరంగా అన్యాయం తలపెట్టడం దారుణం.
ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం.. డీ లిమిటేషన్ ప్రక్రియ చేపడితే దేశంలో పార్లమెంట్ సీట్ల సంఖ్య 848కి చేరుతుంది. దీని ప్రకారం చూసుకుంటే.. యూపీలో ప్రస్తుత 80 సీట్లు 143కి, బీహార్‌లోని 40 సీట్లు 79కి, మహారాష్ట్రలోని 48 సీట్లు 73కి, గుజరాత్ లోని 26 సీట్లు 53కి, రాజస్థాన్‌లోని 25 సీట్లు 50కి, మధ్యప్రదేశ్‌లోని 29 సీట్లు 47కు చేరుతాయి. ఈ లెక్కన ఒక్క యూపీలోనే 63 సీట్లు పెరుగనున్నాయి. బీహార్‌లో దాదాపుగా రెండింతలు 39 సీట్లు పెరుగనున్నాయి. అదే సమయంలో దక్షిణాది రాష్ర్టాలన్నీ కలిపి 35 సీట్లు మాత్రమే పెరుగుతాయి. దక్షిణాది రాష్ర్టాల్లో ప్రస్తుతం ఉన్న 129 సీట్లు 165కి పెరుగుతుండగా.. యూపీ, బీహార్ రాష్ర్టాల్లోనీ 120 సీట్లు 222కి పెరుగనున్నాయి. ఈ రెండు రాష్ర్టాల్లో సీట్ల పెరుగుదల శాతం 85 కాగా.. దక్షిణాదిలో 28 శాతం సీట్లు పెరుగుతున్నాయి. ఇతర రాష్ర్టాల్లో చూసుకున్నా సీట్ల పెరుగుదల శాతం దక్షిణాది కంటే ఎక్కువగా 57 శాతంగా ఉన్నది.
వాస్తవానికి దక్షిణాదిలోని ఏ ఒక్క రాష్ట్రంలోనూ ప్రస్తుతం బీజేపీ అధికారంలో లేదు.ఏపీలో మాత్రమే మైనర్ పార్ట్నర్గా ఉన్నది. భవిష్యత్తులోనూ దక్షిణాదిలో బీజేపీ ఏ రాష్ట్రంలోనూ గెలిచే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే, తనకు పట్టున్న హిందీ రాష్ర్టాల్లో సీట్ల సంఖ్యను గణనీ యంగా పెంచుకోవాలని కాషాయ పార్టీ కుటిలయత్నం చేస్తున్నది.
అదే జరిగితే యూపీ, బీహార్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి హిందీ బెల్ట్ రాష్ర్టాల్లో పాగా వేసి శాశ్వతంగా అధికారంలో ఉండిపోవాలని కుట్రలు పన్నుతున్నది. దక్షిణాదికి మాత్రమే కాదు, పశ్చిమబెంగాల్, ఒడిశా, పంజాబ్ లాంటి ప్రాంతీయ అస్తిత్వాలకు ప్రతీకలైన రాష్ర్టాల్లోనూ డీ లిమిటేషన్ వల్ల తీవ్ర నష్టం జరుగనున్నది.
ఇప్పటికే నిధుల విషయంలో అన్యాయం జరుగుతుండగా, రాబో యే రోజుల్లో దేశ నాయకత్వాన్ని ఎన్నుకునే క్రమంలో దక్షిణాది ఓటు చెల్లుబాటు కాకుం డా పోతుంది. పార్లమెంట్లో దక్షిణాది మాట పలుచనయ్యే ప్రమాదం ఉన్న ది. దక్షిణాది ప్రజలను సెకండ్ క్లాస్ సిటిజెన్స్‌గా చూస్తూ, వివక్ష చూపే అవకాశం లేకపోలేదు. ఈ ప్రమాదాన్ని అరికట్టేందుకు కేసీఆర్ చూపిన బాటలో దక్షిణాది నేతలు అడుగులు వేస్తున్నారు. తమిళనాడు సీఎం స్టాలిన్ దీనిపై పోరు మొదలుపెట్టగా.. చంద్రబాబు మోదీకి ఎదురు తిరగలేక జనాభాను పెంచాలని పిలుపునిస్తున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు చెన్నైలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో బీఆర్ఎస్ తరఫున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ తదితర నేతలు తెలంగాణ గళం వినిపించారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణ సహా దక్షిణాదికి జరగనున్న అన్యాయంపై చర్చించారు. మెజారిటీ ప్రాంతం వల్ల మైనారిటీ ప్రాంతానికి జరిగే వివక్ష తెలంగాణకు స్వానుభవమేనని, సీమాంధ్రకు వ్యతిరేకంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి, 14 ఏండ్ల పాటు పోరు సలిపి విజయం సాధించారని కేటీఆర్ ఈ సందర్భంగా చెప్పారు. దక్షిణాది రాష్ర్టాల హక్కుల కోసం జరిగే పోరులో కూడా బీఆర్ఎస్ ముందు వరుసలో ఉంటుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రానున్నరోజుల్లో ఈ మహోద్యమానికి తెలంగాణ కేంద్ర బిందువుగా మారడం ఖాయం.
(వ్యాసకర్త: బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి)
-షేక్ ఫరెజ్ మొహియుద్దీన్
96661 74738