2024 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశంలో ఎన్నికల కోలాహలం మొదలైంది. అటు ఐదు దశాబ్దాలకుపైగా దేశాన్ని పాలించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇటు ఇప్పటికే రెండు దఫాలుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మళ్లీ మళ్లీ అధికారంలోకి రావాలనే ఆరాటంతో, ఆత్రుతతో వేయని ఎత్తుగడలు లేవు. గత తొమ్మిదిన్నరేండ్లుగా దేశంలోని ప్రజా సమస్యలు పట్టని రాహుల్‌గాంధీ ఎన్నికలు రాగానే ‘భారత్ జోడో యాత్ర’ పేరిట దేశ సంచారం చేస్తుంటే… అధికారం చేపట్టిన నాటినుంచి పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు, వ్యవసాయ నల్ల చట్టాలు, ధరల పెరుగుదలతో ప్రజలను నానా యాతనలకు గురిచేసిన ప్రధాని నరేంద్ర మోదీ ‘సిటిజన్‌షిప్ అమెండ్మెంట్ యాక్ట్’ (సీఏఏ) పేరిట దేశంలో కొత్త పాచిక విసరడానికి సిద్ధమవుతున్నారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు తాము ఆడిందే ఆట, పాడిందే పాటగా పాలనను అటకెక్కించి చోద్యం చూస్తున్నాయి.
Karimnagar | 2023 చివరలో రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు జరుగగా కాంగ్రెస్ పార్టీ అత్తెసరు మెజారిటీతో అధికారాన్ని చేజిక్కించుకున్నది. అంతకుముందు తెలంగాణలో ఎలాగైనా బీజేపీ జెండా ఎగురవేయాలనే కుతూహలంతో ఆ పార్టీ నాయకులు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి మొదలు ఇతర రాష్ర్టాల ముఖ్యమంత్రుల దాకా తెలంగాణ రాష్ర్టాన్ని పర్యాటక ప్రాంతంగా ఎంచుకున్నారు. మోదీ మేనియా, ఆ పార్టీ ముఖ్యమంత్రుల శ్రమకు దక్కిన ఫలితం 8 అసెంబ్లీ సీట్లు. పుసుక్కున బీజేపీ అధికారంలోకి వస్తే తమకు ముఖ్యమంత్రి, మంత్రి పదవులు వస్తాయేమోననే ఆశతో అప్పటికే ఎంపీలుగా ఉన్న బండి సంజయ్, ధర్మపురి అరవింద్, సోయం బాపురావులు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి ఘోర పరాజయం చవిచూశారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఆ పార్టీ బలమెంతో ప్రజలు చెప్పకనే చెప్పారు.
ఈ ఎన్నికల్లో ఒక్క కేసీఆర్‌ను గద్దె దించేందుకు ఎన్ని శక్తులు ఏకమయ్యాయో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ‘మార్పు, మార్పు’ అంటూ కొందరు కుహనా మేధావులు పని గట్టుకొని చేసిన అబద్ధపు ప్రచారం, కాంగ్రెస్ పార్టీ అలవిగాని హామీలు పాపం రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించాయి. ఫలితంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (కేసీఆర్) నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ స్వల్ప తేడాతో అధికారాన్ని కోల్పోయింది. ప్రజల నిర్ణయాన్ని శిరసావహించిన నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు పంపించి సామాన్యుడి వలె ప్రగతిభవన్‌ను వీడారు. ముఖ్యమంత్రి కుర్చీ మీద కూర్చున్న రేవంత్‌రెడ్డి హుందాగా వ్యవహరించాల్సింది పోయి, తన స్థాయిని మరిచి దిగజారి మాట్లాడటం షురూ చేశారు. ప్రతిదాడికి సిద్ధమవుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను నిలువరించి కొత్త ప్రభుత్వానికి కొంచెం గడువు ఇవ్వాలని కేసీఆర్ ఆదేశాలు జారీచేయడం ఆయనకున్న రాజనీతిజ్ఞతను, తెలంగాణ పట్ల ప్రేమ ను మరోసారి తెలియజేసింది. అంతే, బీఆర్ఎస్ నాయకుల మౌనం కాంగ్రెస్ నాయకులకు అస్త్రంగా మారింది. అధికారంలోకి వచ్చి సరిగ్గా మూడు నెలలు కూడా గడవకుండానే కాంగ్రెస్ నేతల ఆగడాలకు అడ్డులేకుండా పోయింది. ప్రజలకు ఇచ్చిన హామీలను అటకెక్కించడమే కాదు, ప్రజలు అప్పగించిన అధికారానికి అంధకార ముసుగు తొడిగి ఆ పార్టీ నాయకులు చేసిన వీరంగం అంతా ఇంతా కాదు. అది ఏ స్థాయికి చేరిందంటే ‘రైతుబంధు ఏది సారూ..’ అని రైతులు అడిగితే చెప్పుతో కొడతామని హెచ్చరించే స్థాయికి చేరింది. మంత్రులుగా ఆసీనులైన వ్యక్తులు జర్నలిస్టులపై నాలిక మడతపెట్టి బల్లలు గుద్దే స్థాయికి చేరింది. ఏకంగా ఒక మహిళా మంత్రి ఆధ్వర్యంలో తన పీఏ.. ముఖ్యమంత్రి ఫొటోలు లారీలకు అంటించి ఇసుకను తరలించడం షరామామూలైంది. కాంగ్రెస్ ద్వితీయశ్రేణి నాయకులైతే ఏకంగా నేతన్నలను కండోమ్‌లు అమ్ముకొని జీవనం సాగించమని నీతులు చెప్పే స్థాయికి ఎదిగారు. ఇలా ఆకలితో ఉన్న పులికి మేకల గుంపు దొరికినట్టు.. పదేండ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్ నాయకులకు తెలంగాణ ప్రజలు ఒక అవకాశంగా దొరికారు.
‘ప్రజలు ఏమైపోతే మాకేం అవసరం’ అనుకున్నారో ఏమో.. ‘మార్పు’ పేరు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించిన కుహనా మేధావులు మెల్లగా పక్కకు జారుకున్నారు. అధికారానికి దాసోహమైన కొన్ని పత్రికలు కండ్లు మూసుకున్నాయి. అందుకే వాస్తవాలకు ముసుగు తొడిగి, అధికారానికి వత్తాసు పలుకుతున్నాయి. ఓ దిక్కు మేడిగడ్డ ఖాళీ అవుతుంటే దానికి అడ్డుకట్ట వేయమని చెప్పకుండా, బీఆర్ఎస్ ఖాళీ అంటూ వార్తలు వండి వారుస్తున్నాయి. అసలు బీఆర్ఎస్ ఖాళీ అయితే ఏంటి, నిండితే ఏంటి? ప్రజలకు మేలు చేసే కాళేశ్వరం ప్రాజెక్టును సవరించి రైతులకు నీళ్లు ఇవ్వాల్సింది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కాదు గదా? అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కదా! అధికార కాంగ్రెస్ పార్టీ ఓ దిక్కు మీడియాను పంచన పెట్టుకొని, ఇంకో దిక్కు కుహనా మేధావుల మెడలు పట్టుకొని చేస్తున్న అరాచకాలకు అంతే లేకుండాపోయింది. ఏకంగా ‘ఉప ముఖ్యమంత్రి’ స్థాయి వ్యక్తి అనే సోయి మరిచి, కేవలం దళిత వర్గానికి చెందిన వ్యక్తి అని యాదాద్రి ఆలయంలో చిన్నపీట వేసి కూర్చోబెట్టేంత అజ్ఞానం, అహంకారం కాంగ్రెస్ నాయకులను ఆవరించడం నిజంగా బాధాకరం.
‘మార్పు, మార్పు’ అంటూ ఎన్నికలకు ముందు మమ్మల్ని మాయ జేస్తే మా జీవితాల్లో ఇంకెంత మార్పు వస్తుందోనని భ్రమ పడ్డాం.., కానీ మా జీవితాలు అంధకారంలో కూరుకుపోయేలా మార్పు వస్తుందని ఊహించలేదు’ అంటూ మూడు నెలల తర్వాత ప్రజలు లబోదిబోమని మొత్తుకోవడం మొదలైంది.
కాంగ్రెస్ పాలన ఈ స్థాయిలో ఉంటుందనుకోలేదని ఇప్పుడు ఏకరువు పెడుతున్నారు. మూడు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం రావణకాష్ఠంలా తయారైంది. నీళ్లు లేక పొలాలు ఎండిపోతున్నాయి. ఆ ఎండిపోయిన పొలాలకు గొడ్డూ గోదలను తోలుతున్నది రాష్ట్ర రైతాంగం. రైతుబంధు రావడం లేదంటూ రైతులు రచ్చకెక్కుతున్నారు. కల్యాణలక్ష్మి కనుమరుగైందంటూ తల్లిదండ్రులు కంటతడి తీస్తున్నారు. పింఛన్లు ఠంఛన్‌గా రావడం లేదం టూ వృద్ధులు ఫిర్యాదవుతున్నారు. బీమా అందడం లేదంటూ రైతుల కుటుంబాలు బావురుమంటున్నాయి. చెరువుల్లోకి నీళ్లు రావడం లేదని కర్షకులు చెమ్మగిల్లుతున్నారు. ఇంటింటికీ మంచినీళ్లు రావడం లేదంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మహిళలు ఈసడించుకుంటున్నారు. ‘మా ఖర్మ కాకపోతే ఈ కాంగ్రెస్‌ను ఎందు కు ఎన్నుకున్నామా?’ అంటూ రాష్ట్ర ప్రజలు లోలోపల మదనపడుతున్నారు.
ఈ సమయంలో తెలంగాణ ప్రజలకు ఒక దిక్సూచి అయ్యింది కరీంనగర్ గడ్డ. ముందుండి నడిపించే కాగడా అయ్యింది కరీంనగర్ ‘కదనభేరి’ బహిరంగ సభ. ఏ పార్టీ జెండా తమకు నీడనిస్తుందో.. ఏ నాయకుడు తమ నమ్మకాన్ని వమ్ము చేయడో ‘కదనభేరి’ బహిరంగ సభ తేల్చిచెప్పింది. ఉద్యమాన్ని ఎట్లా నడపాల్నో కేసీఆర్ నాయకత్వం గతంలో ఎరుకజేసింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి ఎట్లా పాలన సాగించాల్నో ఆయన చతురత మొన్నటిదాకా నిరూపించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటే ప్రజల తరపున ఎట్లా కొట్లాడాల్నో తెలుపుతూ కేసీఆర్ చేసిన ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలకు ‘నేనున్నాననే’ భరోసా కలిగించింది. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. కాంగ్రెస్ గత మూడు నెలల పాలన కారణంగా విసిగి వేసారిపోయిన ప్రజల మౌనం కేసీఆర్ మాటల తూటాలతో బద్ధలైంది. కరీంనగర్ ‘కదనభేరి’లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని ఎండగడుతూ ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేసిన ప్రసంగం రాష్ట్ర ప్రజలను మళ్లీ పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అని నినదించేలా చేసింది. తాము తప్పు చేశామని, భవిష్యత్తులో ఇలాంటి తప్పులు చేయబోమని, అందు కు రాబోయే పార్లమెంటు ఎన్నికలే సాక్షమని రాష్ట్ర ప్రజానీకం మాట్లాడుతుండటం నిజంగా ఒక శుభపరిణామం.
ఉద్యమాన్ని ఎట్లా నడపాల్నో కేసీఆర్ నాయకత్వం గతంలో ఎరుకజేసింది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన నిలబడి ఎట్లా పాలన సాగించాల్నో ఆయన చతురత మొన్నటిదాకా నిరూపించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చుంటే ప్రజల తరపున ఎట్లా కొట్లాడాల్నో తెలుపుతూ కేసీఆర్ చేసిన ప్రసంగం ద్వారా రాష్ట్ర ప్రజలకు ‘నేనున్నాననే’ భరోసా కలిగించింది. ప్రజల ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది.
-గడ్డం సతీష్
99590 59041