కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆరు గ్యారెంటీల మాటున ఎన్నో హామీలు ఇచ్చింది. 7వ గ్యారెంటీగా ప్రజాస్వామిక పాలనను అందిస్తామని ప్రజల హక్కులను కాపాడుతామని నమ్మబలికింది. కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో 4 చాప్టర్లు, 42 పేజీలలో వందల హామీ లతో భూతల స్వర్గాన్ని చూపించింది. వరంగల్ రైతు డిక్ల రేషన్, హైదరాబాద్ యూత్ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్ల రేషన్, మైనారిటీ డిక్లరేషన్, కామారెడ్డి బీసీ డిక్లరేషన్, నిరుద్యోగ సమస్యల వంటి ఎన్నో హామీలు ఇచ్చింది. కానీ, అవి అమలు చేయడంలో చతికిలబడింది. రైతులకు ఇస్తానన్న రైతు భరోసా నత్తనడకన సాగుతున్నది. భూమిలేని నిరుపేదలకు రూ. 12,000 ఇస్తానని మాట తప్పింది. ఆసరా పింఛన్లను రూ.4 వేలకు పెంచుతానని వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళల ఆశలను అడియాసలు చేసింది. ఇందిర మ్మ ఇండ్ల ప్రహసనం కొనసాగుతూనే ఉంది. రేషన్‌కార్డుల జారీకి కచ్చితమైన ప్రమా ణాలేవీ పెట్టకపోవడంతో పేద ప్రజలు మీ సేవల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల నిర్మాణం పేరుతో ప్రభుత్వ బడుల మూసివేతకు కుట్రలు జరుగుతున్నాయి.
కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టడంలో విఫలమైంది. ప్రభుత్వ వర్సిటీల సమస్యలను పరిష్కరించలేదు. సాధారణ సమస్యను కూడా విద్యా కమిష న్కు ముడిపెట్టడం ద్వారా తీవ్రమైన తాత్సారానికి గురిచేస్తున్నది. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 10వ తరగతి పాసయితే రూ.10,000, ఇంటర్ పాసయితే రూ.15,000, గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తే రూ.25,000 పీజీ పూర్తి చేస్తే రూ.లక్ష, ఎంఫిల్, పీహెచ్డీ పూర్తిచేస్తే రూ.5 లక్షలు అందిస్తామని అరచేతిలో స్వర్గాన్ని చూపించింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని దానికోసమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నామని హడావుడి చేసింది. కానీ, ఉద్యోగాలను భర్తీ చేయడంలో విఫలమైంది. గత ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ల ద్వారా పోస్టులను భర్తీచేసింది. పోలీసు ఉద్యోగులను, కొంతమం ది కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది తప్ప ఉన్న అన్ని ఖాళీ ఉద్యోగులను భర్తీ చేయడంలో చిత్తశుద్ధి లేదు. నిరుద్యోగ భృతి రూ.3,000 ఇవ్వలేదు. నిరుద్యో గులకు ఉచితంగా కోచింగ్, మెటీరియల్ ఇస్తామని, ఉచితంగా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తామని మాట తప్పింది. ఉద్యమకారులకు ఇస్తానన్న 250 గజాల ఇంటి స్థలం, పింఛన్ ఇవ్వడానికి నిర్దిష్టమైన ప్రమాణాలేవీ లేవు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కొనసాగుతున్నా కావలసినన్ని బస్సులను వేయాల్సింది పోయి ఉన్న బస్సుల్లోనే కోతలు విధించింది. దీంతో మహిళలకు ఉచిత ప్రయాణం భారమైంది.
రాష్ట్ర ప్రభుత్వ హామీలను అమలు చేయాలంటే నిర్దిష్టమైన ప్రణాళికలుండాలి. కానీ, నేటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అలాంటి యాక్షన్ ప్లాన్ లేదు. రేవంత్ ప్రభుత్వం ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నది. రైతులు, కూలీలు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, వృద్ధులు, ఉద్యమకారులు, కార్మికులు.. ఇలా అన్నివర్గాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వం పట్ల తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. రానున్న కాలంలో ఈ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ముఖ్యమంత్రి, మంత్రులు పర్యటన సందర్భంగా ప్రజాసంఘాల నాయకుల అరెస్టులు పరిపాటిగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, ఆశ్రిత పక్షపాతం, బంధు ప్రీతి పెరిగిపోయింది. ప్రజా హక్కులను కాలరాస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడిన లగచర్ల గిరిజన రైతాంగంపై అక్రమ కేసులు బనాయించి జైళ్లో నిర్బంధించింది. స్వేచ్ఛ, ప్రజా స్వామ్యం మాటున అధికారాన్ని చేపట్టి ఎన్కౌంటర్ల పరంపరను కొనసాగిస్తున్నది. సమాజం అభివృద్ధి చెందాలంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. కానీ, నేడు రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల వల్ల ఇవి మరింత దూర మయ్యే అవకాశం ఉన్నది. ప్రభుత్వం ఏర్పడి సుమారు 15 నెలలు గడుస్తున్నా హామీల అమలు చేయకపోవడానికి నిర్దిష్టమైన కారణాలను చెప్పడం లేదు. ప్రభుత్వం ఇకనై నా తన వైఖరిని మార్చుకోవాలి. లేకుంటే, ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ నాయకులకు శిక్ష తప్పదు.