‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే నినాదం పునాదిగానే తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. ఈ మూడింటి విషయమై ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని గుర్తించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమానికి నడుం కట్టారు. ఈ క్రమంలోనే అరువై ఏండ్ల కల ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ సాకారమైంది. ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును నిర్మించుకొని మన నీళ్లను మనం మలుపుకొన్నాం. కానీ తెలంగాణలో అధికారం మళ్లీ పరాయి ప్రతీపశక్తుల అధీనంలోకి వెళ్లింది. మళ్లీ నీళ్ల లొల్లి షురువైంది. కాళేశ్వరంపై కుట్రలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే నీళ్ల వాస్తవాలపై వరుస వ్యాసాలు నేటి నుంచి మీ కోసం…
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన సుమారు 25 ఏండ్ల తర్వాత నియమించిన ఇండియన్ ఇరిగేషన్ రెండవ కమిషన్ తమ రిపోర్టును 1972లో కేంద్ర ప్రభుత్వానికి అందించింది. అంటే, ఇది జరిగి యాభై ఏండ్లు దాటింది. ఈ అర్ధ శతాబ్దిలో సాగునీటిరంగం ఎన్నో కొత్త సవాళ్లను ఎదుర్కొన్నది. ప్రాజెక్టుల నిర్మాణంలో బెనిఫిట్-కాస్ట్ రేషియో (పెట్టుబడి విలువ-ప్రయోజనాల నిష్పత్తి) 1:1 కరువు ప్రాంతాల్లో ఉండాలని, ఇతర ప్రాంతాల్లో 1:1.5 ఉండాలని రెండవ కమిషన్ సూచించింది. ప్రభుత్వాలు ప్రాజెక్టులపై పెట్టుబడి పెట్టినా ప్రయోజనాలను అధికంగా ఆశించడంలో తప్పు లేదు. కానీ పర్యావరణంలో వచ్చిన మార్పులు ముఖ్యంగా గ్లోబల్ వార్మింగ్ వల్ల, వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా గతంలో రూపొందించుకున్న దేశ జల నియమాల్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నది. దేశంలో 140 మిలియన్ల హెక్టార్లలో సాగునీటి వసతి కల్పించగా దీనిలో 79 మిలియన్ హెక్టార్లకు మాత్రమే సాగునీరందుతున్నది. దీనిలో ఉపరితల నదీ, వర్షాధార జలాల ద్వారా సాగవుతున్నది 30 నుంచి 40 శాతం మాత్రమే. సుమారు 55 నుంచి 60 శాతం భూగర్భ జలాలపైనే ఆధారపడి సాగవుతున్నది.
సాగునీటి వసతి ఏనాడో కల్పించినా నీరందని గ్యాప్ ఆయకట్టు విషయంలో గానీ, సముద్రం పాలవుతున్న గంగా, బ్రహ్మపుత్రా, సింధూ, గోదావరి, మహానది తదితర నదుల జలాల కొత్త ఆయకట్టు కల్పన, గ్యాప్ ఆయకట్టుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసే విషయంలో భారత పాలకులకు స్పష్టమైన జల విధానమేదీ లేదనేది స్పష్టం. దేశవ్యాప్తంగా 30 నదీజలాల అనుసంధాన ప్రాజెక్టులను 5.6 లక్షల కోట్ల వ్యయంతో నిర్మించాలని 1980లోనే ప్రణాళికలు సిద్ధం చేసినా (2002 రూపాయి విలువతో) ప్రస్తుత అంచనా వ్యయం 22 లక్షల కోట్లకు చేరింది. ఈ 30 ప్రాజెక్టులలో ఇప్పటికి మొదలైన ఒకే ఒక్క ప్రాజెక్టు బుందేల్‌ఖండ్‌లోని కెన్-బెట్వా ప్రాజెక్టు.
రాష్ట్రంలో గతంలో నిర్మించిన 7 భారీ ప్రాజెక్టుల (నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, జూరాల, రాజోలిబండ, కడెం, మూసీ) కింద 21.30 లక్షల ఎకరాలకు సాగునీటి వసతిని కల్పించినా సుమారు 10 నుంచి 15 లక్షల ఎకరాలకు మాత్రమే సాగు నీరందుతున్నది. మిగులు జలాలపై ఆధారపడిన శ్రీశైలం ఎడమ కాల్వ కింద కూడా సగానికన్న తక్కువ ఆయకట్టుకే సాగునీరందుతున్నది. అధికారిక గణాంకాల ప్రకారమే పై 7 భారీ ప్రాజెక్టుల కింద 35.4 శాతం గ్యాప్ ఆయకట్టు ఉన్నది. మైనర్ ప్రాజెక్టులు, చెరువులు, కుంటల కింద మరో 10 లక్షల ఎకరాల గ్యాప్ ఆయకట్టు ఉండేది. గత ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం అమలుతో ఇది చాలావరకు తగ్గింది.
భారీ, మధ్యతరహా, మైనర్ ప్రాజెక్టుల కింది గ్యాప్ ఆయకట్టు తగ్గించడానికి, కింద గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిధిలో 18.75 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం (నిజాంసాగర్, శ్రీరాంసాగర్ రెండు దశలు, వరదకాల్వ, అప్పర్ మానేరు మొదలైనవి) అప్పటి సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భగీరథ ప్రయత్నమే మొదలుపెట్టారు. ప్రతిపక్ష కాంగ్రెస్, కేంద్రంలోని బీజేపీ, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఒకప్పటి ఉద్యమ సహచరులు పిడికెడు మంది కేసీఆర్ ప్రయత్నాలకు ఆది నుంచి అడ్డు తగులుతూనే ఉన్నారు. వీరి వాదనల్లో ప్రధానమైనది కాళేశ్వరం ప్రాజెక్టుకు కాస్ట్-బెనిఫిట్ రేషియో సరిగా లేదని!
1972లో ఇండియన్ ఇరిగేషన్ రెండవ కమిషన్ నివేదిక ఇచ్చేనాటికి వివిధ దశల ఎత్తిపోతల పథకాల గురించి, నదుల అనుసంధానం గురించి, ఒకే రాష్ట్రంలోని వివిధ ఉపనదుల మధ్య అనుసంధానం గురించి పెద్దగా చర్చగానీ, అవసరం గానీ, అవగాహన కానీ లేనే లేదు. ఆ కమిషన్ పెట్టిన బెనిఫిట్- కాస్ట్ (బీసీ) రేషియో కనీసం 1:1 ఉండాలి. ప్రపంచంలోని ఏ దేశ సాగునీటి విధానంలో కూడా తప్పనిసరిగా బీసీ రేషియో 1:1 ఉండాలనే నిబంధన ఏదీ లేదు. బ్రిటిష్ ప్రభుత్వం 1901లో నియమించిన తొలి ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ నివేదికలో కూడా 1:1 బీసీ రేషియో గురించి లేదు. సాగునీటి ప్రాజెక్టుల ద్వారా కలిగే అన్నిరకాల ప్రత్యక్ష, పరోక్ష ఆర్థిక, సాంఘిక, పర్యావరణ, ప్రజారోగ్య దీర్ఘకాల ప్రయోజనాలను సరిగ్గా, శాస్త్రీయంగా అంచనా వేయగలిగితే ఏ ఎత్తిపోతల ప్రాజెక్టుకైనా బీసీ రేషియో 1:1 కన్న ఎన్నో రెట్లు ఎక్కువగానే ఉంటుంది. ఈ కాలం చెల్లిన విధానాలను పట్టుకొని ఒకరిద్దరు ఐఏఎస్ మేధావులతో పాటు పైన తెలిపిన వారంతా కాళేశ్వరం ప్రాజెక్టుపై విషం కక్కుతున్నారు. ప్రజల మనసులను కలుషితం చేస్తున్నారు. కేంద్ర జల సంఘం ప్రమాణాలను బట్టి ఎంత పండుతుంది, త్రాగునీరు, పరిశ్రమలకందించే నీటి అమ్మకాలు, నదీజలాల్లో రవాణా టూరిజం ద్వారా, చేపల పెంపకం ద్వారా సమకూరే ప్రత్యక్ష ఆదాయాలను మాత్రమే లెక్కించి కాళేశ్వరం 1:1 రేషియో లేదని కాగ్ నివేదిక తెలిపింది. గణాంకాలు తప్ప ప్రకృతి, పర్యావరణం, జీవావరణం, మానవ సంబంధాలు, పల్లెల్లో ఛిద్రమైన జీవితాలు, మన గోస గానీ, నీటి వల్ల, వ్యవసాయం వల్ల కలిగే ప్రయోజనాలు గానీ కాగ్ అధికారులకు, ఢిల్లీలో ఏసీ గదుల్లో క్యాలిక్యులేటర్స్తో కాలం గడిపే జలసంఘం ఇంజినీర్లకు అర్థమవుతాయా? సాగునీరందక, బావులు, బోర్లు ఎండి, కొత్త బోర్ల కోసం చేసిన అప్పులు తీర్చక బలవన్మరణాలకు పాల్పడిన వేలాది తెలంగాణ రైతుల ఆత్మఘోష ఏనాటికైనా కేంద్ర జలసంఘ, కాగ్ పెద్దలకు తెలిసి వస్తుందా?