తెలంగాణ రైతులపై కాంగ్రెస్, బీజేపీలకు ఎందుకింత కక్ష. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు వారి బతుకులను ఆగం చేస్తున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలకు ఎనిమిదేసి సీట్లు ఇవ్వడమే రైతులు చేసిన తప్పా? రాష్ట్రంలో కాంగ్రెస్‌కు, కేంద్రంలో బీజేపీకి అధికార పీఠాన్ని అందించడమే వారు చేసిన పొరపాటా? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో నిరుడు యాసంగిలో వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో 5 లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుతో పనిలేకుండానే ఎస్సారెస్పీ స్టేజీ-1, స్టేజీ-2 ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లు ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పంటలు చేతికొచ్చే ముందు చేతులెత్తేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సీజ న్ కాబట్టి అవగాహన లేకపోవచ్చునని అందరూ అనుకుంటున్నారు. కాళేశ్వరంలో ఏదో జరిగిపోయిందనే తప్పుడు ప్రచారంతో అందరు నిజమే అనుకున్నారు. రైతులు కూడా తమ నష్టాలను దిగమింగుకున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయం నుంచే కాంగ్రెస్, బీజేపీలు ఆ ప్రాజెక్టుపై అక్కసు వెళ్లగక్కుతూ ఉన్నాయి. 20 లక్షల ఎకరాల ఆయకట్టుకు నేరుగా ఇంకో 18 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు నీళ్లిచ్చేలా ఆ ప్రాజెక్టును రూపొందించడమే తప్పయ్యింది. శరవేగంగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయడమే పొరపాటు అయ్యింది. 2020 నుంచి 2023 వరకు ప్రతి యాసంగి సీజన్లో లోయర్ మానేర్ డ్యాం దిగువన ఉన్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజీ-1, స్టేజీ- 2 ఆయకట్టు 10 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీటి భరోసానిచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద యాసంగి పంట పండింది. 2019 నుంచి 2023 వరకు ప్రతి యాసంగి సీజన్లో (డిసెంబర్ నుంచి మార్చి నెలాఖరు వరకు) కాకతీయ కాలువ నిండుకుండలా కదలాడిన సంగతి ప్రతి రైతుకు తెలుసు. కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రాకముందు వానకాలంలోనే వారబందీ (ఆన్ అండ్ ఆఫ్) పద్ధతిలో సాగునీటిని విడుదల చేసిన గడ్డు రోజులు కూడా రైతుల యాదిలో ఉన్నాయి. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు మీదుగా ఎగసివచ్చిన కాళేశ్వర గంగ లోయర్ మానేరును దాటుకొని వందలాది కిలోమీటర్లు పరుగులు పెట్టింది. దాని ఫలితమే పుట్లకొద్దీ ధాన్యపు రాశులు.
2023, డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ ఎన్నికలకు కొన్నిరోజుల ముందే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకులో ఒక పియర్ (పిల్లర్) కుంగింది. ఆ పిల్లర్ కుంగగానే కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బ తీసేందుకు బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయి. ఘటన వెలుగుచూసిన 24 గంటల్లోనే నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ) వాలిపోయింది. పడవల్లో బ్యారేజీని చూసిన ఎన్డీఎస్ఏ బృందం మధ్యంతర నివేదిక ఇచ్చేసింది. కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఉమ్మడి వ్యూహం ఫలించింది. మేడిగడ్డ నిర్మాణం లోపభూయిష్టమని, డిజైన్లు సరిగా లేవని, అనేక అక్రమాలు జరిగాయని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ సైతం కొనసాగుతున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బ్యారేజీలో పిల్లర్ కుంగుబాటుకు సరైన కారణాలు ఏమిటో కూడా తెలుసుకోకుండానే మధ్యంతర నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ పూర్తి నివేదిక ఇవ్వడానికి తీవ్ర కాలయాపన చేసింది. ఎట్టకేలకు ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక అందజేసింది. కారణాలేమిటో తెలియదు కానీ, ఆ నివేదిక ఇంకా రాష్ర్టానికి చేరలేదు.
మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్‌ను డైమండ్, కట్టింగ్ పద్ధతిన తొలగించి మళ్లీ నిర్మించాలని ఎన్డీఎస్ఏ సిఫారసు చేసినట్టుగా మీడియా కథనాలను బట్టి తెలిసింది. అంటే బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్టుగా మేడిగడ్డ బ్యారేజీ కొట్టుకుపోలేదు. మరమ్మతులు చేస్తే పూర్తికాలం సేవలందించడం ఖాయం. ఇప్పుడు ఎన్డీఎస్ఏ నివేదిక ప్రకారం మేడిగడ్డకు రిపేర్లు చేస్తే తమ ఆరోపణలన్నీ తప్పు అని జనం ముందు పలుచన అవుతామన్న భయం కాంగ్రెస్, బీజేపీ నేతలకు పట్టుకున్నది. అందుకే నివేదికను వెలుగు చూడనివ్వడం లేదు. ఫిబ్రవరిలోనే కేంద్ర ప్రభుత్వం రాష్ర్టానికి ఆ నివేదికను పంపిస్తే జూన్‌లోగా బ్యారేజీని పునరుద్ధరించవచ్చు. వానకాలం మొత్తం గేట్లు తెరిచి ఉంచినా వరద తగ్గుముఖం పట్టాక గేట్లు దించి ప్రయోగాత్మకంగా నీటిని నిల్వ చేస్తూ బ్యారేజీని పూర్తిస్థాయిలో వినియోగించుకోవచ్చు. 2019 నుంచి 2023 వరకు ప్రతి యాసంగిలో ఇచ్చినట్టే వంద నుంచి 110 రోజులు ఎల్ఎండీకి దిగువన కాకతీయ కాల్వకు నిరంతరాయంగా నీళ్లు ఇవ్వొచ్చు. ఆ నీళ్లు సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ వరకు డోర్నకల్‌ను దాటి ఉమ్మడి ఖమ్మం జిల్లా పంటలకు ఇచ్చి రైతులను ఆదుకోవచ్చు. రైతుల బతుకులు పచ్చబడటం కాంగ్రెస్, బీజేపీలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం ఇష్టం లేదు.
అందుకే మేడిగడ్డ బ్యారేజీకి రిపేర్లు చేయకుండా అడ్డుపడుతున్నాయి. నిరుడు, ఈ యేడు యాసంగి సీజన్లో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు స్టేజీ-1, స్టేజీ-2 కలిపి 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు ఎండిపోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే కారణం. ఈ యాసంగిలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సాగునీటి విడుదలకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ అంటూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. ప్రభుత్వ ప్రకటనలు నమ్మి రైతులు పెద్ద ఎత్తున పంటలు సాగు చేశారు. ఫలితం వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట జిల్లాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరుసగా రెండేండ్లు యాసంగి సీజన్లో లక్షలాది ఎకరాల్లో రైతులు పంటలు కోల్పోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇవ్వకపోవడమే అందుకు కారణం అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. అయినా వాళ్లకు రాజకీయాలే ముఖ్యం. లక్షలాది మంది రైతుల కష్టాలు ఏ మాత్రం పట్టవు. వాళ్ల రాజకీయ కక్షకు తెలంగాణ రైతన్నలు సమిధలవడమే విషాదం.
మేడిగడ్డ బ్యారేజీకి పూర్తిస్థాయిలో మరమ్మతులు సాధ్యమేనని దానిలో లోపాలు వెలుగు చూసినప్పుడే నిర్ణయానికి వచ్చారు. దెబ్బతిన్న ఏడో బ్లాక్‌లోని పిల్లర్లను పూర్తిగా తొలగించాల్సి రావొచ్చని.. ఆ ఒక్క బ్లాక్‌ను తిరిగి నిర్మిస్తే బ్యారేజీ పూర్తిస్థాయిలో వినియోగించుకునే అవకాశం ఉన్నదని నిర్ధారించారు. రైతులకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పం ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఆ పనిచేసేది. కానీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రైతుల ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం. అందుకే ఎన్డీఎస్ఏను అడ్డం పెట్టుకొని ఫక్తు రాజకీయాలు చేస్తున్నాయి. వరుసగా మూడో ఏడాది రైతుల పంటలను ఎండబెట్టడానికి కుట్రలు చేస్తున్నాయి. ఇప్పటికీ మించిపోయింది లేదు. ఎన్డీఎస్ఏ నివేదికను వేగంగా తెప్పించి ఏడో బ్లాక్ పునరుద్ధరణ పనులు చేపట్టాలె. వచ్చే యాసంగి సీజన్లోనైనా రైతులు నష్టోకుండా ఇప్పటినుంచే చర్యలు తీసుకోవాలె. లేకుంటే కాంగ్రెస్, బీజేపీ రైతు వ్యతిరేకులుగా మిగిలిపోవడం ఖాయం. ఇప్పుడు ఆ రెండు పార్టీలు తేల్చుకోవలసింది వారికి రాజకీయాలు ముఖ్యమా? లేక రైతుల ప్రయోజనాలు ముఖ్యమా? అన్నది. కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తిస్థాయిలో వినియోగించుకుంటే సాధించే అద్భుతాలు ఏమిటో మన రైతుల కండ్లముందే ఉన్నాయి. వాటిని విస్మరిస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారన్న విషయం గుర్తించాల్సింది పాలకులే.
(వ్యాసకర్త: శాసనమండలి సభ్యురాలు)
-కల్వకుంట్ల కవిత