ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు మెరుగైన వైద్యం కోసమని జూన్ నెల వేతనం/పెన్షన్ నుంచి 1.5 శాతం చొప్పున మినహాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం చూపిన చొరవ.. ఆ విధానం అమలుకు తగిన మార్గదర్శకాల రూపకల్పనలో చూపించడం లేదు. నగదు రహిత వైద్యం ఎలా అమలవుతుందో వివరాలతో విధివిధానాలను విడుదల చేయకుండానే, మే నెల జీతం, పెన్షన్ నుంచి 1.5 శాతం వాటాను సర్కార్ మినహాయించింది. మరో నాలుగు రోజుల్లో జూన్ నెల వేతనం/పెన్షన్ నుంచి మళ్లీ మినహాయించే సమయం వచ్చింది.
ఇప్పటికీ ఆరోగ్య నిధి ట్రస్టుతో ఏ ఏ ఆసుపత్రులు చర్చించాయి? ఏ దవాఖానలు ఈ పథకం కింద ఉద్యోగులు, పెన్షన్లర్లకు నగదు రహిత చికిత్స చేస్తాయి? ప్రభుత్వం ఏ మార్గదర్శకాలు ఇచ్చింది? ఏవిధంగా చికిత్స జరుగనున్నదనే విషయంలో ఇప్పటికీ స్పష్టత లేదు. జూన్ 2న ఉద్యోగులకు డిజిటల్ ఆరోగ్య కార్డులను అందిస్తామని సీఎం ప్రకటించారు. కానీ నేటికీ ఆ డిజిటల్ కార్డు ఏ రకంగా ఉంటుంది? ఎలా ఇస్తారో స్పష్టత లేదు. ప్రభుత్వం ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్ పర్సన్‌గా,16 మంది అధికారులు, 9 మంది ఉద్యోగ సంఘ నాయకులు, ముగ్గురు పెన్షనర్ల సంఘాల నాయకులు, ఈహెచ్ఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మెంబర్ కన్వీనర్‌గా ట్రస్టు ఏర్పాటైంది. అయితే వయోవృద్ధులైన పెన్షనర్లుండే సంఘాల నుంచి మరో ముగ్గురిని సభ్యులుగా చేరిస్తే మరింత సమగ్రంగా ఉండేది.
ఈ నేపథ్యంలో ఎంప్లాయీస్ హెల్త్‌కేర్ ట్రస్టు సమావేశంలో నగదు రహిత వైద్యం అందించే మార్గదర్శకాలు వెంటనే రూపొందించి ఉద్యోగులు, పెన్షనర్ల భయాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఉద్యోగులు, పెన్షనర్లకు కార్పొరేట్, ప్రైవేట్ దవాఖానలు నగదు లేకుండా సత్వరం వైద్యాన్ని అందించాలంటే వాటికి ఎప్పటికప్పుడు ప్రభుత్వం నిధులను జమ చేయాలి. దానిని ఇతర అవసరాలకు మళ్లించకుండా జాగ్రత్త పడాలి. 25 ఏండ్లు దాటిన నిరుద్యోగులైన కుమారులు, అవివాహితులు, వితంతు కుమార్తెలను కూడా చికిత్సకు అర్హులుగా పరిగణించాలి. నగదు రహిత వైద్యాన్ని అవుట్ పేషెంట్లకు కూడా అందించాలి. ఏడాదికి రెండుసార్లు ఫుల్ బాడీచెకప్ సదుపాయం ఉండాలి. వృద్ధులైన పెన్షనర్లు బెంగళూరు, చెన్నై వంటి ఇతర రాష్ర్టాల్లోని తమ పిల్లల వద్దకు వెళ్లినపుడు అక్కడ అస్వస్థతకు గురైతే అక్కడ కూడా హెల్త్‌కార్డులు పనిచేసేలా ఏర్పాటు ఉండాలి. ట్రెజరీ నుంచి కాకుండా ఆయా శాఖల నుంచి నేరుగా పెన్షన్ అందుకుంటున్న వ్యవసాయ మార్కెట్ కమిటీలు, జిల్లా గ్రంథాలయ సంస్థలు తదితర 8 విభాగాల వారిని నూతన ఆరోగ్య పథకం పరిధిలోకి తేవాలి. వివిధ శాఖల్లో 20 ఏండ్ల నుంచి పనిచేస్తున్న 5 లక్షలకు పైగా ఉన్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కూడా ఈ పథకంలో చేర్చే అంశాన్ని పరిశీలించాలి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు కార్పొరేట్ ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం అందించేందుకు ప్రభుత్వం క్యాష్‌లెస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) ప్రకటించింది. ఈ పథకం కింద అర్హులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తామని హామీ కూడా ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే లబ్ధిదారుల కచ్చితమైన వివరాలు, సమాచారం కోసం ఆర్థిక శాఖ అన్ని ప్రభుత్వ శాఖలకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది.
మే 31లోపు ఉద్యోగులు, పెన్షనర్లు,వారి కుటుంబ సభ్యుల వివరాలన్నింటినీ ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఈ డాటా ఆధారంగానే అత్యాధునిక డిజిటల్ హెల్త్ కార్డులను పంపిణీ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగానే వివరాలను అప్లోడ్ చేశారు. అయితే, ఉద్యోగులను ఈహెచ్ఎస్లో చేర్చే ముందు పూర్తి మార్గదర్శకాలు, అమలు విధానాలను అందుబాటులో ఉంచాలి.
ఎంప్యానెల్ చేసిన దవాఖానల జాబితా, అందుబాటులో ఉన్న ప్రత్యేక వైద్య సేవల వివరాలు. ఆమోదించిన చికిత్సల ప్యాకేజీల వివరాలు. ఇన్‌పేషెంట్, ఔట్‌పేషెంట్ సేవల పరిధి, లబ్ధిదారుల హక్కులు, బాధ్యతలకు సంబంధించిన సమాచారం. ఉద్యోగి/పెన్షనర్ల వాటా (చందా), ప్రభుత్వ వాటా సమానంగా నేరుగా (ఎంప్లాయి హెల్త్‌కేర్ ట్రస్ట్) ఖాతాలో జమ చేయాలి. దీంతో ఆసుపత్రిలో బిల్లుల చెల్లింపు వేగవంతంగా జరుగుతుంది. ఎంప్యానెల్ ఆసుపత్రుల పట్ల విశ్వాసం పెరుగుతుంది. అంతరాయం లేని నగదు రహిత వైద్యం ఉద్యోగులకు అందుతుంది.
ప్రస్తుతం 1.5 శాతం మినహాయింపు మొత్తంతో ప్రైవేట్ రంగంలో ఇన్సూరెన్స్ కంపెనీలు ఆరోగ్య పాలసీలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఈ పథకం మరింత ఆకర్షణీయంగా రూపొందించాలి. సీజీహెచ్ఎస్ మాదిరిగా స్లాబ్ ఆధారిత వాటా (చందా) విధానాన్ని ప్రత్యామ్నాయంగా ఆలోచించాలి. నాన్-గెజిటెడ్ ఉద్యోగులు, నిర్ణయించిన స్లాబ్ ప్రకారం స్థిర నెలవారీ వాటా (చందా)తో సెమీ-ప్రైవేట్ వార్డు అర్హత, గెజిటెడ్ ఉద్యోగులు, అధిక స్థిర నెలవారీ చందాతో ప్రైవేట్ వార్డు అర్హత, ఉద్యోగులు తమ హోదాతో సంబంధం లేకుండా స్వచ్ఛందంగా అధిక స్లాబ్‌ను ఎంచుకునే విధానాన్ని పరిశీలించాలి.
వయస్సు, జీతం పెరిగే కొద్దీ చెల్లించే ప్రీమియం పెరుగుతుంది. లబ్ధిదారుల సంఖ్య తగ్గుతుంది. సీనియర్ ఉద్యోగులపై అసమాన ఆర్థిక భారం పడుతుంది. అందువల్ల ఈ విధానంలో తగిన మార్పులు చేయడం న్యాయసమ్మతం. ఉద్యోగి వాటాను కేవలం మూలవేతనానికి అనుసంధానించకుండా కుటుంబ సభ్యుల సంఖ్య ఆధారంగా నిర్ణయించాలి. నమోదు చేసిన కుటుంబ సభ్యుడికి నామమాత్రపు చందా విధించాలి. గరిష్ఠ పరిమితి (సీలింగ్) ఉండాలి. దీనివలన ఉద్యోగి వాటా నేరుగా లబ్ధిదారుల సంఖ్యకు అనుసంధానమవుతుంది. వాస్తవ కవరేజ్‌కు అనుగుణంగా ఉద్యోగులు చెల్లిస్తారు. అన్ని వర్గాల ఉద్యోగుల మధ్య భారం సమానంగా పంపిణీ జరుగుతుంది. ప్రతి కుటుంబ సభ్యుడి కోసం వాటా వసూలు చేస్తున్నట్లయితే, ఆధారపడిన పిల్లలకు వయస్సు పరిమితితో సంబంధం లేకుండా హెల్త్‌కార్డ్ ప్రయోజనాలు కొనసాగించాలి.
ఎవరి కోసం వాటా (ప్రీమియం) వసూలు చేస్తే, వారికి ఆరోగ్య కవరేజ్ కూడా ఇవ్వాలి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే, పెన్షనర్లు కూడా ఇద్దరూ పెన్షనర్లు అయితే వారిలో ఒక్కరి నుంచే ప్రీమియం కట్ చేయాలి. కానీ ఇద్దరి నుంచి బేసిక్‌లో 1.5 శాతం కట్ చేయడం అన్యాయం.
కాగా, హెల్త్ కార్డుల మంజూరు, వాటి వినియోగంపై ప్రభుత్వం ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలను విడుదల చేయలేదు. ఈ పథకం కింద ఏయే కార్పొరేట్, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం అందుతుందో స్పష్టమైన జాబితా లేదు, ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి అధికారిక ఒప్పందాలు చేసుకోలేదు. కనీసం ఉద్యోగుల సమ్మతి (ఆప్షన్) తీసుకోకుండా, డీడీవోలకు సమాచారం ఇవ్వకుండా ప్రభుత్వం మే నెల వేతనాలు/పెన్షన్ల నుంచి 1.5 శాతం మినహాయించి, ఏకపక్షంగా వ్యవహరించింది. హెల్త్ కార్డులు చేతికి రాకముందే, ముందస్తుగా వేతనాల్లో 1.5% కోత విధించడం అన్యాయం. ఉద్యోగుల నుంచి మినహాయించిన ప్రభుత్వం హెల్త్‌కేర్ ట్రస్ట్‌లో తన వంతుగా 1.5% మ్యాచింగ్ గ్రాంట్ నిధులను జమ చేయలేదు.
రాష్ట్రంలోని 2.60 లక్షల మంది కొత్త పెన్షన్ విధానం (సీపీఎస్) వర్తించే ఉద్యోగులు ఉన్నారు. సర్వీసులో ఉన్నవారికి వేతనం నుంచి చందా మినహాయించి వైద్య చికిత్స అందిస్తారు. వారు రిటైరైతే పరిస్థితి ఏమిటి? ఇప్పటికే సుమారు 3 వేల మంది రిటైరైనవారు ఉన్నారు. వారికి ఇతర పెన్షనర్ల మాదిరిగా నెల నెలా పెన్షన్ రాదు. ఈహెచ్ఎస్ చందా మినహాయింపు ఉండదు, కనుక వారికి చికిత్స అందదు. ఇది తీవ్రమైన వివక్ష! సీపీఎస్ వర్తించే పెన్షనర్ల విషయంలో ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవాలి. సర్వీసులో ఉన్నంతకాలం ప్రతీ నెలా మూలవేతనం నుంచి 1.5 శాతం నిధులు కట్ చేసి, రిటైరైన మరుక్షణం నుంచి హెల్త్ స్కీమ్‌ను వర్తింపజేయకపోతే రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు భరోసా ఏముంటుందని ఆ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హెల్త్‌కార్డుల పంపిణీకి జూలై మొదటివారంలో ముఖ్యమంత్రి శ్రీకారం చుడతారనే వార్తల నేపథ్యంలో ఆరోగ్య కార్డులపై ఇంకా స్పష్టత రాలేదు. ఇదిలా ఉంటే ఏర్పాటైన ఈహెచ్ఎస్ ట్రస్టు బోర్డు 27నాటి సమావేశంలో గైడ్‌లైన్స్ రూపొందించాలి. ఈహెచ్ఎస్ నిబంధనలు కచ్చితంగా పాటించే విధంగా మార్గదర్శకాలు రూపొందించి అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలి. బ్యాంకుల్లో ఏ విధంగా పెన్షనర్లు, ఇతరులకు వర్తిస్తుందో స్పష్టత లేదు. ఉద్యోగికి, పెన్షనర్‌కు ఆటోమేటిక్‌గా యాక్సిడెంట్ పాలసీ అమలవుతుందా? ప్రభుత్వం చెప్త్తున్న కోటీ 20 లక్షల ప్రమాద బీమా పెన్షనర్లకు వర్తించదని బ్యాంకులు తాజాగా ప్రకటించాయి. ఆరోగ్య కార్డుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు నగదు రహిత చికిత్స మార్గదర్శకాలు రూపొందించే చర్యలు తీసుకోకుండా కొత్తగా బీమా పథకం ముందుకు తేవడం అసలు సమస్యను పక్కదారి పట్టించడమే అవుతుంది.
(వ్యాసకర్త: విద్యారంగ నిపుణుడు)
-కే వేణుగోపాల్
9866514577