దేశంలో కఠిన చట్టాలు ఉన్నప్పటికి కూడా అవినీతి, అక్రమాలు ఈ స్థాయిలో ఉన్నాయి. ఇక ఫలానా విషయం చట్టవిరుద్ధం కాదంటే, కానీ చేయొద్దంటే వినేవారెవ్వరు? అసలే చట్టాలు కొందరికి చుట్టాలు. ఇది అందరికీ తెలిసిన సత్యం. అధికారంలో, బడాబడా పదవుల్లో ఉండి, వ్యాపారాలు చేయడం కరెక్టేనా? ఏం.. చేస్తే తప్పేంటి? అని ఎదురుప్రశ్నిస్తే సమాధానం చెప్పేవారెవరు? ప్రభుత్వంలోని పలుకుబడిని వాడుకుంటూ, అధికార యంత్రాంగానికి జోలపాడి నిద్రపుచ్చి, అక్రమాలకు పాల్పడే నేతలను చూస్తున్నాం. అధికారులు ఏ నిబంధనల పేరుతో పేదోడి ఇంటిని కూల్చుతున్నారో, అవే నిబంధనలతో పెద్దోడి ఇంటిని కూల్చడంలేదు. అంటే అక్రమ వ్యాపారాలను చేయడం కోసం అధికారాన్ని వాడుకోగలరనేది నిజం… వాడుకుంటున్నారన్నది నిదర్శనం.
రాజ్యాంగ పదవులు నిర్వహిస్తున్న వ్యక్తులు వ్యాపారాత్మక వ్యవహారాలు కూడా నెరపవచ్చా అన్నది మన ముందు ఉన్న ప్రశ్న. అరుణాచల్‌ప్రదేశ్ సీఎం పేమాఖండూ 2015-25 మధ్య తన కుటుంబ సభ్యులకు రూ.1200 కోట్ల కాంట్రాక్టులు ఇప్పించుకున్న కేసులో సుప్రీంకోర్టు ఇటీవల సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్య మంత్రి నటించిన మరో సినిమా ఈ మధ్యనే విడుదలైంది. దీనిపైనా పలువురు ప్రశ్నలు సంధిస్తున్నా రు. ఇలాంటి పరిసస్థిల్లో పైన పేర్కొన్న ప్రశ్న ప్రా ధాన్యత సంతరించుకున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, అధికారుల ప్రవర్తనా నియమావళి ప్రకారం, వారు ఎలాంటి ఇతర ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ చేయరాదు. వారు 24 గంటలు ప్రభుత్వ అధికారిగా అందుబాటులో ఉండాలి. అట్లాగే, రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్లో పేర్కొన్న, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏదైనా వేతనంతో కూడిన పదవిలో ఉన్నవారు, పార్లమెంట్, రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికకు అర్హులు కారని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 102, ఆర్టికల్ 191 తెలుపుతున్నవి. అయితే, పార్లమెంట్ లేక రాష్ట్ర శాసనసభ సభ్యులుగా ఎన్నికై మంత్రులుగా నియమితులైన తర్వా త వేరే ఇతర వృత్తి కూడా చేయవచ్చా అనే ప్రశ్న కు, రాజ్యాంగంలో కానీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం,1951లో గానీ ఇతర ఏ చట్టంలో కానీ సమాధానం లేదు. 1990లలో, హరినాథబాబు వర్సెస్ ఎన్టీ రామారావు కేసు చాలా సంచలనం కలిగించింది.
అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తాను ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ సినిమాలో నటించనున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి పదవిలో ఉన్నవారు 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండాలి. కాబట్టి సినిమాల్లో నటించకూడదని, ఎన్టీఆర్‌ను సినిమాలో నటించకుండా ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేయాలని అప్పటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది.
పిటిషన్ కొట్టివేయడానికి హైకోర్టు పలు కారణాలను చూపింది. రాజ్యాంగంలో కానీ, మరేతర చట్టంలో కూడా ఒక మంత్రి ఎలా వ్యవహరించాలో లేక ఇతర వృత్తి కానీ, వ్యాపారం కానీ చేయకూడదని పొందుపరచలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వయంగా ఏర్పరచుకున్న ‘కోడ్ ఆఫ్ కం డక్ట్’ నియమావళిలో కొన్ని ప్రవర్తనకు సంబందించిన హద్దులు ఉన్నాయి. కానీ, దానికి చట్ట బద్దత లేకపోవడంతో, న్యాయస్థానాలు దాని ఆధారంగా ఆదేశాలు జారీ చేయలేదు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, న్యాయస్థానాలు జోక్యం చేసుకోలేకపోయినా, రాజ్యాంగ విలువలకు కట్టుబడి, వ్యక్తిగత వ్యవహారాల్లో కూడా స్వీయ క్రమశిక్షణతో వ్యవహరించాలి. ఆ విధంగా ముఖ్యమంత్రిగా ఉంటూ, ఇతర (లాభదాయక) వృత్తి చేపట్టడాన్ని మంత్రుల మనస్సాక్షికే వదిలింది హైకోర్టు.
అదే విధంగా, మంత్రిగా ఉంటూ, ఒక ధారావాహిక టీవీ షో చేస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్దూను నియంత్రించడానికి పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా నిరాకరించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా 25.3.2026 న ఉప ముఖ్యమంత్రి సినిమాలో నటించకుండా ఉత్తర్వులు, ఆదేశాలు జారీ చేయాలని దాఖలు చేసిన అభ్యర్థనను ఇవే కారణాలు చూపుతూ కొట్టివేసింది. ప్రముఖ న్యాయవాదులు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన తర్వాత కూడా కోర్టులలో ప్రాక్టీస్ చేయడం, వాదించడం చూస్తూ ఉంటాం.
అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో, ప్రజా ప్రతినిధులు న్యాయవాద వృత్తి చేయకుండా నిరోధించే అధికారం ఏ చట్టంలో లేదు కాబట్టి, ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన న్యాయవాదులను లా ప్రాక్టీస్ చే యకుండా నియంత్రించలేమని సుప్రీంకోర్టు కూడా స్పష్టంచేసింది. సినిమా రంగం నుంచి రాజకీయా ల్లో ప్రవేశించి సీఎం అయిన తర్వాత ఎంజీఆర్ సినిమా రంగానికి స్వస్తి పలికారు. జయలలిత కూడా సీఎం అయిన తర్వాత సినిమాల్లో నటించలేదు.
ప్రజా ప్రతినిధులకు/మంత్రులకు నెలవారి జీ తం, ఇతరేతర సౌకర్యాలు ఉన్నాయి. పదవి కాలం పూర్తయిన తర్వాత పింఛను కూడా లభిస్తుంది. ఎమెల్యే, ఎంపీ కన్నా మంత్రులకు బాధ్యతలెక్కువగా ఉంటాయి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు మరింత ఎక్కువ. మంత్రిగా అధికారిక కార్యక్రమాలు లేకున్నా, తన నియోజకవర్గ సమస్యలు ఉంటాయి. 24 గంటలు సేవ చేయ(లే)క పోయినా, ప్రజలకు అందుబాటులో ఉండాలనే స్పూర్తితో పనిచేయాలి. స్వీయ నియంత్రణ లేని నాయకులను దృష్టిలో నుంచుకొని, ప్రభుత్వ ఉద్యోగులవలే, రాజ్యాంగ పదవులు నిర్వహించే వారు కూడా, పదవిలో ఉన్న సమయంలో ఇతర లాభదాయక వృత్తులు చేయరాదని పార్లమెంట్లో చట్టం చేయాల్సిన ఆవశ్యకత ఎంతయినా ఉన్నది.
ప్రజాప్రతినిధులు వ్యాపారాలు చేయకూడదని ఎలాంటి నిబంధన లేదు కదా అంటూ పలువురు సమర్థించుకుంటున్నారు. కానీ మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా వివిధ హోదాల్లో ఉండి, వ్యా పారాలు చేయడం అధికార దుర్వినియోగానికి కూ డా దారి తీస్తున్నది. ప్రభుత్వంలో ఉన్న హోదా ను అడ్డుపెట్టుకొని కాంట్రాక్టులు దక్కించుకోవడమో, తమ వ్యాపార సంస్థలు ప్రభుత్వ ఆస్తుల ను కబ్జా చేయడమో వంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. కాబట్టి నైతిక విలువలు లేని రాజకీయ నేతలు, చట్టాల్లోని లొసుగులను కూడా వాడుకొని అడ్డగో లు పనులు చేసే ప్రజాప్రతినిధులు కోకొల్లలుగా ఉ న్నారు. అలాంటి నేతలు స్వచ్ఛందంగా వి లువలు పాటించాలంటే అసాధ్యం. అలాంటి వా రు అం తటి విలువలు పాటిస్తారని అనుకోవడం అత్యాశ. కాబట్టి చట్టం చేయడమే ఏకైక పరిష్కారం.
– (వ్యాసకర్త: న్యాయ నిపుణుడు)
హరీశ్ కొలిచాల