మిర్యాలగూడ, ఆగస్టు 14 : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎడమ కాల్వకు వానకాలం సాగునీటిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అన్నారు. శుక్రవారం పట్టణంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి అన్ని డ్యాంలు నిండుగా ఉన్నాయని, శ్రీశైలం ప్రాజెక్టులో 872 అడుగుల నీరు ఉందని, మరో ఏడు అడుగులు అయితే ప్రాజెక్టు నిండుతుందని, ఈ దశలో అక్కడ విద్యుత్ తయారు చేసి సాగర్ ప్రాజెక్టుకు వదిలినట్లయితే ఆ నీటితో ఎడమకాల్వకు రెండు పంటలకు నీటి విడుదల చేయవచ్చని, అదేవిధంగా తాగునీటికి కూడా కొరత ఉండదని తెలిపారు.
నీటి పారుదల శాఖ మంత్రి జిల్లాకు చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉన్నా కూడా నీటి విడుదలపై నోరు మెదపడం లేదని, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రావు, భట్టి విక్రమార్కలతోపాటు నల్లగొండ జిల్లా ఆయకట్టు పరిధిలో ఎంపీ రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జైవీర్‌రెడ్డి, బీఎల్ఆర్, పద్మావతిలు ఉన్నారని, సాగునీటిపై వీరు ప్రభుత్వాన్ని నిలదీసే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎల్‌నినో ఏర్పడింది నీటి కొరత ఉంటుందని అవగాహన లేకుండా శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ తయారీని నిలిపివేశారని, ప్రతిపక్ష నాయకులు ప్రశ్నించిన సందర్భంలోనే శ్రీశైలం ప్రాజెక్టు నుంచి విద్యుత్‌ను తయారు చేసి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల చేశారని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణ దశలోనే కేవలం విద్యుత్ తయారీ, నీటి నిల్వ కోసమే ఏర్పాటు చేశారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఇటువంటి పరిస్థితుల్లో శ్రీశైలం ప్రాజెక్టు నీటిని పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్రమంగా తరలిస్తున్నారని, ఈ విషయాన్ని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ప్రత్యక్షంగా పరిశీలించారని తెలిపారు. అక్రమ నీటి తరలింపుపై ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సోయి లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి విడుదల విషయంలో నిర్లక్ష్యం చేస్తే రైతుల ఆగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి విడుదలపై సలహాలు స్వీకరించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నీటి విడుదల చేయనట్లయితే రైతులతో కలిసి ఛలోసాగర్ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా మాజీ అధ్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, హాతీరాం, అన్నభీమోజు నాగార్జునాచారి, నామిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, పడిగపాటి కోటిరెడ్డి, ఎండీ యూసుఫ్, ఇలియాస్, పాచ్చునాయక్, వినోద్, రవీందర్, షోయబ్, పద్మావతి, రమాదేవి తదితరులు ఉన్నారు.