పెన్పహాడ్, ఆగస్టు 14 : మండలంలో ఇందిరమ్మ ఇండ్లు సంతలో సరుకులా విక్రయిస్తున్నారు. లబ్ధిదారులు ఒకరైతే.. కట్టుకునేది మరొకరు. దీంతో ఈ పథకం లక్ష్యమే దెబ్బతింటున్నంది. ఈ పథకంలో అర్హులైన వారికి కాకుండా ఇతరులకు లబ్ధి చేకూరడం, ఒకరి పేరున ఉన్న ఇంటిని మరొకరు నిర్మించుకోవడం వంటి చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. మండల వ్యాప్తంగా ప్రతి గ్రామంలో గ్రామానికి 5 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను డబ్బులకు విక్రయిస్తున్నారు. మొదటి విడతలో మండల వ్యాప్తంగా 684 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా 90 శాతం నిర్మాణం పూర్తి కావొస్తున్నాయి.
ఈ పథకం అమలులో పూర్తి పారదర్శకత ఉందంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు చెబుతున్నా అమలులో మాత్రం వాస్తవ విరుద్ధంగా ఉంది.ప్రతి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన లబ్ధిదారులు ఇండ్లు మంజూరైనా నిర్మించుకునే స్తోమత లేకపోవడంతో, ఎలాంటి అర్హత లేని వారికి రూ.40వేల నుంచి 50వేల వరకు విక్రయిస్తూ డబ్బులు తీసుకుంటున్నట్లు సమాచారం. విక్రయించిన వారి బ్యాంకు ఖాతాకే డబ్బులు జమ కావడంతో.. ఆ డబ్బును తీసి అమ్మిన వ్యక్తి ఇస్తున్నారు.
అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం తమ ప్రభుత్వ హయాంలోనే ఇండ్ల నిర్మాణం చేట్టామని, ఎలాంటి అక్రమాలు జరగలేదని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఎవరైనా లబ్ధిదారులు నిబంధనలు ఉల్లంఘించి ఇండ్లను విక్రయించేందుకు ప్రయత్నించినా..ఇతరులు వాటిని కొనుగోలు చేసినా.. ప్రభుత్వం ఆ కేటాయింపులను రద్దు చేసి, తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుంది. లబ్దిదారులకు ఇప్పటికే వేరే ఇల్లు ఉన్నట్లు తేలినా, దీన్ని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించుకున్నా అర్హత రద్దవుతుంది.
ఇందిరమ్మ ఇండ్లను విక్రయిస్తున్నారనే విషయమై ఇప్పటి వరకు మా దృష్టికి రాలేదు. ఇండ్లను ఇతరులకు అమ్ముకోవడం నిషేధం. ఒక వేళ లబ్ధిదారులు తమకు మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను ఇతరులకు తక్కువ ధరకు అనధికారికంగా (అగ్రిమెంట్) విక్రయిస్తే ఆ కేటాయింపును రద్దు చేస్తాం.
-నాగరాజు, హౌజింగ్ ఏఈ, పెన్పహాడ్