రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పోలీస్ ఉద్యోగాలు 19 వేలు ఖాళీగా ఉన్నాయని చెప్తూనే..కేవలం 5 వేల ఉద్యోగాలు నింపుతామని సెలవిచ్చింది. రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాలకు పోటీపడే అభ్యర్థులు 12 నుంచి 13 లక్షల వరకు ఉండొచ్చు. కానీ ప్రభుత్వం మాత్రం అన్ని ఖాళీలు నింపకుండా రెండున్నరేండ్లకు పైగా తాత్సారం చేస్తున్నది. ఉద్యోగాలు రాష్ట్ర అవసరాల కోసం, నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం ఉండాలే గానీ ఎలక్షన్ల నోటిఫికేషన్ల కోసం ఉండరాదని పలువురు వాపోతున్నారు.
బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేండ్ల పాలనలో పోలీస్ నియామక ప్రక్రియను పరిశీలిస్తే…2016లో 9,281 కానిస్టేబుల్, 510 ఎస్ఐ, 2018లో 18,428 కానిస్టేబుల్, 1,217 ఎస్ఐ, 2022లో 15,644 కానిస్టేబుల్, 554 ఎస్ఐ ఉద్యోగాలను భర్తీ చేసింది. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు దాటినా ఒక్క పోలీస్ నోటిఫికేషన్ కూడా రాలేదు. 2022లో వచ్చిన నోటిఫికేషన్‌తో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వమే ప్రిలిమ్స్, ఈవెంట్స్, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి ఫలితాలు ప్రకటించింది. కానీ 2023లో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత పోలీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చి 15 వేల ఉద్యోగాలు తామే ఇచ్చామని ఎంతో గొప్పగా ప్రకటించుకున్నది.
కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఎన్నికల ప్రణాళికలో భరోసా ఇచ్చింది. కానీ రెండున్నరేండ్లు దాటినా కేవలం 13,900 ఉద్యోగాలు మాత్రమే పూర్తి చేసింది. పైగా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నాటి 67,753 ఉద్యోగాలను తమ ఖాతాలోకి వేసుకున్నది.
వయోపరిమితి పెంపు..జీవో 31 ప్రకారం గతంలో ఉన్న వయోపరిమితిని 32 సంవత్సరాల నుంచి 34 ఏండ్లకు పెంచింది. మళ్ల్లీ జీవో 87 ద్వారా వయోపరిమితిని 34 నుంచి 32 ఏండ్లకు తగ్గించింది. కానీ జీవో 31 ప్రకారం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. పైగా ఇప్పుడు జీవో 87 ప్రకారం ఇప్పుడు వయోపరిమితిని రెండేండ్లకు కుదించింది. అయితే, ఎంతోకాలం నుంచి ఉద్యోగాల భర్తీ లేనందున కానిస్టేబుల్ పోస్టుకు వయోపరిమితి 36 ఏండ్లు, ఎస్ఐకి 38 ఏండ్ల వరకు పెంచాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
లాంగ్ జంప్: ఆంధ్రా ఐపీఎస్ అధికారి, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాస్‌రావు అనాలోచిత నిర్ణయం కారణంగా ఎంతోమంది మెరిట్ అభ్యర్థులు పోలీస్ ఉద్యోగాలకు దూరమయ్యారు. ఆర్మీలో, ఏ రాష్ట్రంలో లేనివిధంగా పోలీస్ అభ్యర్థులకు లాంగ్ జంప్‌ను 3.8 మీటర్ల నుంచి 4 మీటర్లకు పెంచారు. కానీ దీనివల్ల తమకు ఎంతో అన్యాయం జరుగుతుందని, కనుక మళ్లీ పాత పద్ధతిలోనే లాంగ్‌జంప్‌ను 3.8 మీటర్లకు తగ్గించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
జీవో 46. ఈ జీవో కారణంగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల విద్యార్థులకు 70, 80 మార్కులకు ఉద్యోగాలు వస్తుండగా వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల విద్యార్థులకు 125 మార్కులు వచ్చినా కానిస్టేబుల్ ఉద్యోగం రాని పరిస్థితి నెలకొన్నది. కానిస్టేబుల్ ఉద్యోగాల్లో ఏఆర్, టీఎస్ఎస్పీ రాష్ట్ర స్థాయి బెటాలియన్వారీగా ఉద్యోగాలు నిర్వహిస్తుండగా, జిల్లాల జనాభా ఆధారంగా వాటిని భర్తీ చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో జనాభా ఎక్కువ, కానిస్టేబుల్ ఉద్యోగాలకు పోటీపడేవారు తక్కువ. దీనిని పరిగణనలోకి తీసుకొని జీవో 46ను రద్దు చేసి, జిల్లాల జనాభా ఆధారంగా కాకుండా, రాష్ట్ర స్థాయిలో భర్తీ చేయాలని నిరుద్యోగ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు.
నియామక ప్రక్రియ హోం శాఖ పరిధిలో శాంతిభద్రతలను నిర్వహించే పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఎక్సైజ్, జైల్ వార్డర్, ఫైర్ వంటి ఉద్యోగాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఇస్తున్నప్పటికీ ఈవెంట్స్, ఎగ్జామ్ ఒకటే నిర్వహిస్తున్నారు. పైగా నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకోవటానికి ఐదు రకాల ఫీజులు తీసుకొని ఒకే ఈవెంట్ మాత్రమే నిర్వహిస్తున్నారు. దీంతో ఒక్క ఈవెంట్లో ఫెయిల్ అయినా మిగిలిన అన్నింటికీ అభ్యర్థులు దూరమవుతున్నారు. ఫీజులు మాత్రం ఒక్క అప్లికేషన్‌కు వెయ్యి రూపాయల చొప్పున ఐదువేల రూపాయలు వసూలు చేస్తున్న టీఎస్ఎల్పీఆర్బీ బోర్డు ఈవెంట్ ఒకటే నిర్వహించి అభ్యర్థులను అనర్హులుగా మార్చుతున్నది.
పోలీస్ ఉద్యోగాల భర్తీలో ఎన్నో రకాలుగా అన్యాయం జరిగే అవకాశాలు ఉన్నందున తమ ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని 5 వేల ఉద్యోగాలు కాకుండా 19 వేల ఉద్యోగాలతో నోటిఫికేషన్ జారీ చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లాంగ్ జంప్ 4.0 మీటర్ల నుంచి 3.8 మీటర్లకు తగ్గించాలని, జీవో 46ను తొలగించి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని, కానిస్టేబుల్ ఎంపికకు వయోపరిమితి 32 నుంచి 36 ఏండ్లు, ఎస్ఐకి 38 ఏండ్ల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
(వ్యాసకర్త: నిరుద్యోగ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు)
-పాలకూరి అశోక్ గౌడ్