‘సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి, ఓల్డ్ పింఛన్ విధానం (ఓపీఎస్) అమలుచేస్తాం..’ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో అభయహస్తం కింద ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన గ్యారంటీ ఇది. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు తొమ్మిది నెలలవుతున్నా ఆ దిశగా అడుగులు ముందుకు పడలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ తమను మోసం చేసిందన్న భావన ఉద్యోగుల్లో వ్యక్తమవుతున్నది. తాజా గణాంకాల ప్రకారం.. రాష్ట్రంలో 3,69,200 మంది రెగ్యులర్ ఉద్యోగులున్నారు. వీరిలో 40 శాతం మందికిపైగా ఉద్యోగులు సీపీఎస్ విధానంతో నష్టపోతున్నారు.
ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే నెలలో 50 వేల వేతనం పొందితే, ఆ ఉద్యోగికి పాత పింఛన్ విధానంలో నెలకు రూ.25 వేల వరకు పింఛన్ అందేది. ఇది కుటుంబ పోషణకు, జీవిత చరమాంకంలో బాసటగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ భరోసానే లేకుండాపోయింది. ప్రభుత్వం పలు దఫాలుగా చెల్లించే డీఏ, పీఆర్సీ ఫిట్మెంట్లుపింఛనర్లకు సైతం వర్తిస్తాయి. కానీ, సీపీఎస్‌లో ఇవేవీ వర్తించవు.
2004 తర్వాత నియామకమైన వారిని సీపీఎస్ పరిధిలోకి చేర్చారు. వీరంతా సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరుతున్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత ఇదే అంశంపై పలుమార్లు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులను కలిసినా ప్రయోజనం లేకుండా పోయింది. ‘చేస్తాం.. చూస్తాం’ అన్న మాటలే కానీ, ఇంతవరకు సీపీఎస్‌ను రద్దు చేసే ప్రయత్నాలేవీ సాగలేదు. దీంతో ఉద్యోగులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
సీపీఎస్ అనేది కేవలం ఉద్యోగి చందా ఆధారిత స్కీం. ఈ పథకంలో ఉద్యోగుల మూల వేతనం, డీఏల నుంచి ప్రతి నెలా 10 శాతం చొప్పున కట్ చేస్తారు. ప్రభు త్వం కూడా మరో 10 శాతం చందాను జమచేస్తుంది. ఈ మొత్తాన్ని ఎన్పీఎస్-ఎన్ఎస్డీఎల్కు బదిలీ చేస్తారు. అక్కడ ఉద్యోగికి పర్మినెంట్ రిటైర్మెంట్ అకౌం ట్ నెంబర్ (పాన్)లో ఈ మొత్తాన్ని జమచేస్తున్నారు.
సీపీఎస్ రద్దు కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ఎజెండాగా మారింది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తర భారతానికో నిబంధన, దక్షిణ భారతదేశానికో నిబంధన అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. సీపీఎస్‌ను రద్దు చేస్తామన్న హామీతోనే కాంగ్రెస్ రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోనూ ఇదే హామీనిచ్చింది. కాంగ్రెస్ మిత్రపక్షమైన జేఎంఎం అధికారంలో ఉన్న జార్ఖండ్‌లోనూ ఓపీఎస్‌ను అమలుచేస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో ఉద్యోగులకు పాత పింఛన్ పేమెంట్ ఆర్డర్లు సైతం ఇచ్చారు. అయితే దక్షిణాదిలోని కర్ణాటకలోనూ సీపీఎస్‌ను రద్దుచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పటివరకూ అది నెరవేర్చలేదు. ఇదే తరహాలో తెలంగాణలో సీపీఎస్ రద్దు నినాదంతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కానీ, ఈ రెండు రాష్ర్టాల్లో సీపీఎస్‌ను రదు ్దచేయకపోవడం విడ్డూరం.
కేంద్ర ప్రభుత్వం శనివారం కేబినెట్ సమావేశంలో ప్రవేశపెట్టిన భాగస్వామ్య పింఛన్ పథకం స్థానంలో కొత్తగా యూనిఫైడ్ పింఛన్ స్కీమ్ (యూపీఎస్)ను అమలుచేయాలనే నిర్ణయం పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
25 ఏండ్ల సర్వీస్ పూర్తిచేసిన ఉద్యోగులకు 50 శాతం పింఛన్ గ్యారంటీ చేస్తున్నట్టు, సర్వీసులో మరణించిన కుటుంబాలకు 60 శాతం పింఛన్ ఇస్తామని ప్రకటించినప్పటికీ ఉద్యోగి నెలవారీ వేతనంలో 10 శాతం కోత విధిస్తూ చందాతో కూడిన పింఛన్ పథకాన్ని రద్దుచేసే విషయాన్ని ప్రస్తావించలేదు. దీనిపై ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఎన్పీఎస్-యూపీఎస్ పింఛన్ విధానాన్ని ఎంచుకోవడం ఐచ్ఛికం అని పేర్కొనడంలోనే అసలు మోసం దాగున్నది. 1982 సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం.. పింఛన్ అనేది ఉద్యోగి హక్కు. కాబట్టి పాత పింఛన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఉద్యోగులు కోరుతున్నారు.
ఓపీఎస్ కింద ఉద్యోగి పదవీ విరమణ తర్వాత ప్రతి నెలా సర్వీస్ పింఛన్ అందేది. ఉద్యోగి రిటైరైన చివరి నెలలో ఉన్న వేతనంలో 50 శాతం వేతనాన్ని సర్వీస్ పింఛన్ కింద ప్రభుత్వం చెల్లించేది. ఇప్పుడు 2004 తర్వాత నియామకమైన వారికి సర్వీస్ పింఛన్ అన్నదే లేదు. ఒకవేళ పింఛనర్ చనిపోతే అతని భార్యకు, దివ్యాంగులైన పిల్లలు, పెండ్లికాని పిల్లలకు సర్వీస్ పింఛన్ అందేది. కానీ, ఇప్పుడు ఆ వెసులుబాటు కూడా లేకుండా పోయింది.
ఒక ఉద్యోగి రిటైర్ అయ్యే నెలలో 50 వేల వేతనం పొందితే, ఆ ఉద్యోగికి పాత పింఛన్ విధానంలో నెలకు రూ.25 వేల వరకు పింఛన్ అందేది. ఇది కుటుంబ పోషణకు, జీవిత చరమాంకంలో బాసటగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ భరోసానే లేకుండాపోయింది. ప్రభుత్వం పలు దఫాలుగా చెల్లించే డీఏ, పీఆర్సీ ఫిట్మెంట్లు పింఛనర్లకు సైతం వర్తిస్తాయి. కానీ, సీపీఎస్‌లో ఇవేవీ వర్తించవు. సీపీఎస్‌తో పింఛనర్లకు ప్రభుత్వంతో ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది.
మార్కెట్ హెచ్చుతగ్గులపైనే పింఛనర్లు ఆధారపడాల్సి వస్తుంది. పదవీ విరమణ తర్వాత కమ్యూటేషన్ కింద ఒక ఉద్యోగికి ఓపీఎస్‌లో కొన్నేండ్ల మొత్తం పింఛన్ అడ్వాన్స్‌గా పొందే వీలుంటుంది. ఇంటి నిర్మాణం, పిల్లల చదువులు, పెండ్లిండ్ల కోసం అడ్వాన్స్‌లు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటే లేకుండాపోయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరగా స్పందించి సీపీఎస్ విధానాన్ని రద్దుచేసి ఓపీఎస్ విధానాన్ని అమలుచేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
-రావుల రాజేశం
77801 85674