బీఆర్ఎస్ 2023 ఎన్నికలలో గెలవకపోవటానికి ఒక ముఖ్య కారణం, తన పాలనా కాలంలో చేసిన మంచిని ప్రజలకు వివరించి చెప్పకపోవటమని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కొన్ని సందర్భాలలో అన్నారు. విమర్శకులు దీనిని స్వీయసమర్ధనగా కొట్టివేయవచ్చుగాక. కాని పరిశీలించి చూసినట్లయితే అందులో నిజమున్నట్లు అర్థమవుతుంది. ఆ నిజమేమిటో మునుముందు పరిశీలిద్దాము. దానినట్లుంచి, ఇపుడు త్వరలో పార్టీ శ్రేణులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నందున, బీఆర్ఎస్ పాలనలో జరిగిన మంచిని ప్రజలకు వివరించి చెప్పగల విధంగా కార్యకర్తలను సిద్ధం చేయటం ఆ శిక్షణలో భాగం కావాలి.
ఆ చర్చల్లోకి వెళ్లేముందు గతంలోకి చూసి కొన్ని విషయాలు చెప్పుకోవాలి. తెలంగాణ ఉద్యమ మలిదశ సుమారు 1996 నుంచి మొదలుకాగా, 2001లో టీఆర్ఎస్ స్థాపన నుంచి ఉధృత రూపానికి వచ్చింది. 2014 మధ్య వరకు సుదీర్ఘంగా సాగింది. కాని మరొకవైపు నుంచి చూసినపుడు రెండు కొరతలు కన్పించాయి. ఒకటి, జాతీయస్థాయిలో సానుభూతి, సానుకూలత రావలసినంతగా రాలేదు. రెండు, ఉద్యమ కారణాలేమిటో, పరిస్థితులు ఏమిటో సంవత్సరాలు గడుస్తున్నా ఇతర రాష్ర్టాల ప్రజలకు సమాచారాలు చేరలేదు. సగకాలం గడిచినాక ప్రొఫెసర్ జయశంకర్ బృందం ఢిల్లీ వెళ్లి వేర్వేరు పార్టీల నాయకులను కలిసి మద్దతు లేఖలు సంపాదించగలిగింది గాని అది అంతటితో ఆగిపోయింది. అట్లాగే, స్వరాష్ర్టాల కోసం పోరాడిన, పోరాడుతుండిన పార్టీల నాయకులు కొందరు అక్కడి నుంచో, హైదరాబాద్‌కు వచ్చో మద్దతు తెలియజేశారు. ఇటువంటివి ఉండి కూడా మొత్తంమీద చూసినపుడు, పైన అన్నట్లు, జాతీయస్థాయి మద్దతు కొరవడింది. ఇతర రాష్ర్టాలకు సమాచారాలు స్వల్పంగానే చేరాయి. జాతీయ మీడియా అనేది సహకరించలేదు.
అట్లా ఎందుకు జరిగిందో చెప్పుకోవాలి. ముందుగా జాతీయస్థాయి సంగతి చూద్దాం. జాతీయస్థాయి అంటే ప్రధానంగా ఢిల్లీ, అక్కడి నుంచి పనిచేసే ప్రభుత్వం, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, అధికార యంత్రాంగం, మేధావివర్గాలు, మీడియా (భారతీయ మీడియా, విదేశీ మీడియా). రాష్ట్ర సాధనా ఉద్యమం సఫలం అయేందుకు ఉద్యమం బలంగా సాగటం ఎంత అవసరమో, ఈ వివిధ వర్గాలను ప్రభావితం చేయటం కూడా అంతే అవసరం. ఎందుకంటే ఈ వర్గాలలో కొన్ని ఒపీనియన్ మేకర్స్ కాగా, కొన్ని డెసిషన్ మేకర్స్. వారిని ఒక పద్ధతి ప్రకారం ప్రభావితం చేసేందుకు ఉద్యమానికి ఏ దశలోనూ ఒక ప్రణాళిక లేకపోయింది. కాని మరొకవైపు నుంచి తెలంగాణ వ్యతిరేక శక్తులు ఒక ప్రణాళిక ప్రకారం ఆ పని చేస్తూపోయాయి. ఆ శక్తులు ముప్పేటగా పనిచేశాయి. అది ఆర్థిక సంస్కరణల వాతావరణం జోరుగా ఉన్న కాలం, సంస్కరణలకు అప్పటి ప్రధాని మన్మోహన్ నాయకత్వం వహిస్తుండిన కాలం. ఉమ్మడి రాష్ట్రంలో వేగంగా అమలవుతుండిన సంస్కరణలు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే ఆ వేగం కుంటుపడుతుందని స్వయంగా మన్మోహన్ వ్యాఖ్యానించిన స్థితి. సంస్కరణలకు అనుకూలమైన జాతీయ, అంతర్జాతీయ లాబీలన్నీ విభజనను వ్యతిరేకించటం, రాహుల్‌గాంధీ సహా కాంగ్రెస్‌లోని కొందరు కీలక నేతలు ఈ ప్రభావాలకు లోనుకావటం, విభజన జరిగితే నక్సలిజం పెరుగుతుందంటూ సైన్యాధికారులను సైతం ఈ వ్యతిరేక వాదనలలో భాగం చేయటం వంటివన్నీ కలిసి ఆ ముప్పేటలో ఒక పాయగా పనిచేశాయి. ఆ ప్రభావాలు జాతీయ మీడియాపైనే గాక, ఢిల్లీలో తమ కార్యాలయాలు గల ప్రాంతీయ భాషా పత్రికలపై కూడా పడ్డాయి.
రెండవ పాయ, అపుడంతా టీడీపీ అధ్యక్షునిగానో, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగానో ఉండిన చంద్రబాబు తన జిత్తులమారి ఎత్తుగడలను ఉపయోగిస్తూ ఢిల్లీలో రాజకీయ పార్టీలను, సీనియర్ అధికారులను, పారిశ్రామికవర్గాలను, ఇంగ్లీష్ మీడియాను, సీనియర్ జర్నలిస్టులను ప్రభావితం చేయటం. అందుకోసం డబ్బు కూడా చాలానే ఖర్చు చేశారన్నది వినవచ్చిన మాట. ఇటువంటి ఎత్తుగడలకు, జిత్తులకు ఆయన ఇతరత్రా కూడా పేరుపడిన వ్యక్తే అయినందున, తెలంగాణ విషయమై సాగించిన లాబీయింగ్‌ను అర్థం చేసుకోవటం కష్టం కాదు.
ఇక మూడవ పాయ, ఉభయ కమ్యూనిస్టులు. ముఖ్యంగా సీపీఎం. ఆ దశలో ఉభయ కమ్యూనిస్టులూ ప్రత్యేక తెలంగాణకు వ్యతిరేకమే కాగా, సీపీఎం వీరవిప్లవ వ్యతిరేకిగా వ్యవహరించింది. కొంత మెతకగా ఉండిన సీపీఐని, తన బిగ్ బ్రదర్ దాదాగిరీతో భయపెట్టింది. బెంగాల్ లెఫ్ట్‌ఫ్రంట్ భాగస్వాములైన ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ మాత్రం సానుభూతి చూపాయి. ఇక్కడ మరొక రెండు విశేషాలున్నాయి. ఒకటి, సీపీఎంకు ఢిల్లీలో యూపీఏ కూటమి భాగస్వామిగా, బెంగాలీ అయిన ప్రణబ్ ముఖర్జీతోపాటు పశ్చిమబెంగాల్లోని గూర్ఖా రాష్ట్ర ఉద్యమాన్ని వ్యతిరేకించేదిగా రాజకీయ పలుకుబడి ఉండేది. అదిగాక బలమైన వామపక్షంగా ఢిల్లీ సీనియర్ అధికారులలో, మేధావివర్గాలలో, రచయితలూ కళాకారులలో, మీడియాలో పలుకుబడి ఉండేది. వారు యథాతథంగానే ఈ వేర్వేరు పలుకుబడులను తెలంగాణ ఉద్యమం పట్ల వ్యతిరేక ప్రచారానికి ఉపయోగించుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబుకు సీపీఎం మంచి చుట్టంగా పనిచేసింది. రెండు విశేషాలలో ఇది ఒకటి కాగా, ఆ కాలమంతా సీపీఎంకు సీతారాం యేచూరి పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉండి, తెలంగాణకు వ్యతిరేకంగా కంకణం కట్టుకుని పనిచేయటం రెండవది అయింది. ఆంధ్రా ప్రాంతపు ఉన్నత కుటుంబానికి చెంది, ఢిల్లీ జేఎన్‌యూలో చదివి ఎనలిటిస్టు లక్షణాలు బాగా వంటబట్టించుకున్న ఆయనకు, హరికిషన్‌సింగ్ సూర్జిత్ కాలం నుంచి కాంగ్రెస్‌లో, ఇతరత్రా బ్యూరోక్రసీతో, ప్రతిపక్షాలతో, మీడియాలో, మేధావివర్గాలలో మంచి సంబంధాలుండేవి. ఆ విధంగా తన ఆధ్వర్యంలో సీపీఎం పార్టీ, చంద్రబాబు అనుబంధం కూడా ఉండగా, తెలంగాణకు వ్యతిరేకంగా మూడవ పాయగా చాలా పనిచేసింది.
విషయమేమంటే, ఇటువంటి బలమైన మూడు పాయలతో కూడిన తెలంగాణ వ్యతిరేక లాబీని పూర్తిగా వమ్ముచేయటం ఎంతమాత్రం తేలిక కాకపోయినా, తెలంగాణ శక్తులు ఒక పద్ధతి ప్రకారం వ్యవహరించి ఉంటే కొన్ని వర్గాలలో, ఒక స్థాయి వరకు సానుకూల వాతావరణం తప్పక ఏర్పడే అవకాశాలుండేవి. కాని ఆ ప్రయత్నాలు జరగలేదు. ఇక్కడ మీడియా గురించి, ఉద్యమ వాస్తవాలు దేశంలోని వివిధ రాష్ర్టాల ప్రజలకు మీడియా ద్వారా చేరటం గురించి, కమ్యూనిస్టుల ప్రభావ పరిధికి బయట ఉండే మేధావులు, రచయితలు, కళాకారుల గురించి, ప్రజాస్వామికంగా ఆలోచించే వారి గురించి చెప్పుకోవాలి. ఒక పద్ధతి ప్రకారం పనిచేసి ఉంటే సానుకూల మీడియాను, జర్నలిస్టులను గుర్తించటం, అన్ని రాష్ర్టాల భాషా పత్రికలకు ఢిల్లీలో ప్రతినిధులు ఉంటారు గనుక వారిలోని సానుభూతిపరుల ద్వారా ఉద్యమ వాస్తవాల ప్రచారం, మేధావులు, రచయిత వర్గాల ద్వారా సానుకూల వాతావరణ సృష్టి జరిగే వీలు తప్పకుండా ఉండేది. కాని ఇవేవీ జరగలేదు. అందువల్ల తగినన్ని నష్టాలు మాత్రం జరిగాయి. అది తెలంగాణ వ్యతిరేకులకు కలసివచ్చింది.
ఇదంతా, ఇంత వివరంగా,ఇంత కాలం తర్వాత చెప్పుకోవటం ఎందుకు ? ఒక్కమాటలో చెప్పాలంటే గత అనుభవాల నుంచి నేర్చుకునేందుకు. ఈ తరహా విషయాలలో తెలంగాణ వంటి సమాజాలకు, కోస్తాంధ్ర వంటి సమాజాలకు ఎక్కడైనాసరే కొన్ని తేడాలుంటాయి. కోస్తాంధ్ర వంటి సమాజాలకు, అక్కడి ఆర్థిక, రాజకీయ, మేధావివర్గాలకు స్వార్థ ప్రయోజనాలు, ప్రాగల్భ్యాలు, చాతుర్యాలు, తెలివిమీరినతనాలు, కూహకంతో కూడిన వ్యూహాలు, వక్రధోరణులు ఎక్కువ.
అందులో భాగంగా తమకు లేనివి ఉన్నట్లు చెప్పుకోవటం, ఉన్న అవలక్షణాలను దాచిపెట్టటం చేస్తారు. అదంతా కలిపి అక్కడి ప్రాబల్య వర్గాల సంస్కృతి అవుతుంది. ఇందుకు భిన్నంగా తెలంగాణ వంటి సమాజాలలో, ఏ వర్గానికైనా సరే వాస్తవికతలు, అణకువలు, నిజాయితీలు, నిరాడంబరతలు, ముక్కుసూటితనాలు, రుజుమార్గాలు ఎక్కువ కనిపిస్తాయి. ఉన్న గొప్పతనాన్ని కూడా దాచుకోవటం తప్ప ఆర్భాటాలకు, ప్రాగల్భ్యాలకు పోయే సంస్కృతి ఇటువంటి సమాజాలలో కనిపించదు. ఇతరులకు హాని చేసే ధోరణులు ఉండవు.
తెలంగాణ ఉద్యమకారులు ఆ రోజులలో ఉద్యమ కారణాల గురించి జాతీయస్థాయిలో అవసరమైన ప్రచారాలు ఎందుకు చేయలేదన్నా, తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం తను చేసిన మంచిని చేయవలసినంతగా ఎందుకు ప్రచారం చేయలేదన్నా, వ్యతిరేకంగా సాగిన అసత్య ప్రచారాలను తిప్పికొట్టవలసినంతగా ఎందుకు తిప్పికొట్టలేదన్నా, అన్నింటికి సమాధానం ఒక్కటే. అది పైన ఇచ్చుకున్న సామాజిక స్వభావ వివరణలలో ఉంది. అటువంటి స్వభావం ఒక సమాజానికి ఒక స్థాయిలో గౌరవప్రదమైనదే. కాని, ప్రమాదకరమైన లక్షణాలు గల శక్తులను ఎదుర్కొనవలసి వచ్చిపుడు ఎంతమాత్రం వాంఛనీయం కాదు. ఆత్మహత్యాసదృశం వంటిది కూడా కావచ్చు. మనం మంచి పనులు చేసినపుడు ప్రజలే గుర్తిస్తారు లెమ్మనే మంచితనపు, అమాయకపు, లౌక్యంలేనితనపు ఫిలాసఫీకి పరిమితులుంటాయి.
కనుక ఇపుడు జరగవలసింది, చేసిన మంచిని ఒక పద్ధతి ప్రకారం సులభమైన రీతిలో, వివిధ వర్గాల ప్రజల చెవిన వేయగల విధంగా, వారి సందేహాలను సైతం తీర్చగల విధంగా, కార్యకర్తలకు శిక్షణలు ఇవ్వటం. అంతకన్న ముందు, జరిగిన ఆ మంచి ఏమిటో సులభశైలిలో పాఠాలు తయారుచేయటం. ఈ అంశాల శిక్షణలే సర్వస్వం కాజాలవు. విస్తృతాంశాలలో ఇది కూడా ఒక భాగం కావాలి. కేసీఆర్ ఇటీవల పార్టీ బాధ్యుల సమావేశాలలో చెప్పిన మాటలను గమనించినపుడు, ఆయన బీఆర్ఎస్ దీర్ఘకాలిక భవిష్యత్తును పటిష్టంగా తీర్చిదిద్దే యోచనలో ఉన్నట్లు అర్థమవుతుంది. అదెంత జరిగితే తెలంగాణకు అంత మేలవుతుంది. ఈ తరహా శిక్షణలు అందుకు రాగల కాలమంతా పలు విధాలుగా ఉపయోగపడతాయి.
-టంకశాల అశోక్