నూతన సంవత్సరం వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిత్యం తెలంగాణను వ్యతిరేకించే, ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణను కలిసి పుష్పగుచ్చం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపడం తెలంగాణవాదులను, ఉద్యమకారులను, తెలంగాణ ప్రజలను నివ్వెరపరిచింది. రాధాకృష్ణకు, రేవంత్‌రెడ్డికి మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్నది వారిద్దరి వ్యక్తిగతం. రాధాకృష్ణను రేవంత్‌రెడ్డి సాధారణ వ్యక్తిగా కలిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ, ఆయన ఇప్పుడు తాను తెలంగాణ ముఖ్యమంత్రి అన్న విషయం మరిచిపోతుండటం శోచనీయం.
తెలంగాణలో మెస్సీతో ఫుట్‌బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ మెగా ర్యాలీ సందర్భంగానైనా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగానైనా రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు, ఆయనకు దక్కిన గౌరవం తెలంగాణ ప్రజలు తలదించుకునేలా ఉన్నది. సీడబ్ల్యూసీ సమావేశానికి వెళ్లిన రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఒక నేత ‘డిప్యూటీ సీఎం’ అని పేర్కొనగా; సోనియా, రాహుల్‌తో ఫొటో దిగాలని రేవంత్ చేసిన విన్యాసాలు ఆశ్చర్యం కలిగించాయి. ఎవరి ఆధిపత్యం వద్దనుకొని ఉద్యమించామో.. ఎవరిని ఎదిరించి తెలంగాణ సాధించుకున్నామో.. ఇప్పుడు తెలంగాణ వారిముందే మోకరిల్లింది. ధిక్కరించిన వారికే ‘జీ హుజూర్’ అంటున్నది. అసలు రేవంత్ రెడ్డికి తాను తెలంగాణ ముఖ్యమంత్రిని అన్న సోయి ఉందా, లేదా? అన్నది అర్థం కావడం లేదు.
కార్యక్రమం, వేదికతో సంబంధం లేకుండా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గత రెండేండ్లుగా సీఎం రేవంత్‌రెడ్డి దూషిస్తున్నారు. కేసీఆర్ చావునూ కోరుకుంటున్నారు. కోస్గిలోనూ నోటికి వచ్చినట్లు తూలనాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన రెండేండ్ల తర్వాత ప్రజల ముందుకువచ్చిన కేసీఆర్ పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. సర్కార్‌ను నిలదీశారు. అందుకే రేవంత్‌రెడ్డి ఇలా బూతులతో రెచ్చిపోయారు. ఆయన తీరును తెలంగాణ సమాజం తప్పుబట్టింది. ఈ డ్యామేజ్‌ను కవర్ చేసుకోవడానికే శాసనసభ సమావేశాల ప్రారంభం సందర్భంగా కేసీఆర్ వద్దకు వెళ్లి రేవంత్‌రెడ్డి కరచాలనం చేశారు. దానిని ప్రత్యేకంగా వీడియో తీయించి ప్రతిపక్ష నేతను తాను గౌరవించానని ప్రచారం చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ సోషల్ మీడియా ద్వారా కేసీఆర్ ఇలా వచ్చి అలా వెళ్లిపోయారని దుష్ప్రచారం చేయించారు. బనకచర్ల, నల్లమల సాగర్లకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పెండింగ్‌లో పెట్టడం తెలంగాణ సమాజంలో చర్చకు రాకుండా ఉండేందుకు రేవంత్ ఈ డ్రామాలకు పాల్పడ్డారు.
జనవరి 1న ప్రజాభవన్‌లో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులపై జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో రేవంత్ మరింతగా రెచ్చిపోయారు. కేసీఆర్, హరీశ్‌రావులను బహిరంగంగా ఉరితీసినా తప్పులేదని అంటూ ఉగ్రవాది కసబ్‌తో పోల్చే స్థాయికి దిగజారిపోయారు. తెలంగాణ వ్యతిరేక మీడియా అండగా ఉందని నోటికొచ్చిన ఆరోపణలు చేస్తే, అవి తాటికాయంత అక్షరాలతో ప్రచురిస్తే తెలంగాణ సమాజం నమ్ముతుందని రేవంత్ భావించడమంటే తెలంగాణ చైతన్యాన్ని తక్కువగా అంచనా వేయడమే. కాగా, ఒకవైపు బీఆర్ఎస్ హయాంలో గోదావరి, కృష్ణా నదుల మీద చేపట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకుపోవడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. అందుకే కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వానికి రెండేండ్లు సమయం ఇచ్చిన కేసీఆర్ బయటకువచ్చి సాగునీటి విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. వెన్నులో వణుకు పుట్టిన రేవంత్ సర్కారు అబద్ధాలతో ఎదురుదాడికి దిగడం మొదలుపెట్టింది.
ఇదిలా ఉంటే పాలమూరు బిడ్డనని పదే పదే చెప్తున్న రేవంత్ రెడ్డి గత రెండేండ్లుగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులను పడావు పెట్టారు. వట్టెం పంప్‌హౌస్ నీట మునిగినా ఒక్కసారి పరిశీలించలేదు. రూ.5,600 కోట్లతో కాలువల తవ్వకానికి వేసిన టెండర్లను అధికారంలోకి వచ్చిన వెంటనే 2024 జనవరి 1న రద్దు చేయడమే కాకుండా, ఉద్దండాపూర్ ద్వారా గ్రావిటీతో నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాలకు సాగునీరందే అవకాశం ఉన్నా దానిని పక్కనపెట్టారు. కొత్తగా జూరాల మీద నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించారు. కేవలం ఆరున్నర టీఎంసీల సామర్థ్యం ఉన్న జూరాల మీద ఆధారపడి 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. దాని మీద అదనంగా ఇప్పుడు నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం భారాన్ని మోపాలని చూస్తున్నారు.
శ్రీశైలం మీద ఆధారపడి పాలమూరు- రంగారెడ్డి నిర్మించడం జలవివాదాలకు తెరలేపడమేనని రేవంత్‌రెడ్డి అండ్ కో చెప్పడం వెనక ప్రధాన కారణం శ్రీశైలం జలాలు ఆంధ్రాకు దోచిపెట్టి తన గురువు చంద్రబాబుకు దక్షిణ చెల్లించడమేనని తెలుస్తున్నది. శ్రీశైలం మీద ఏపీ కన్నా తెలంగాణకే ఎక్కువ హక్కులున్నాయి. నిజాం కాలం నాటి నుంచి అనేక ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులు కూడా తెలంగాణకే అనుకూలంగా ఉన్నాయి. మరి సాగునీళ్ల కోసం సవాల్ విసిరి, సమరం చేసి సాధించాల్సిన సమయంలో రేవంత్ రెడ్డి కాడి కింద పడేసి చంద్రబాబుకు సలాం కొట్టడం ఆశ్చర్యంగా ఉన్నది. ఒకవైపు బనకచర్ల, నల్లమల సాగర్‌కు అనుకూలంగా సంతకాలు చేసి తెలంగాణ హక్కులను కాలరాసిన రేవంత్ రెడ్డి, పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో కూడా పుట్టిన గడ్డకు తీవ్ర అన్యాయం చేస్తున్నారు. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణను తన బానిస మనస్తత్వంతో ఆంధ్రా గురువులకు, ఢిల్లీ అధిష్ఠానాలకు తాకట్టు పెడుతున్నారు. ఇప్పటికైనా తన తీరు మార్చుకుని తెలంగాణ ప్రయోజనాలను కాపాడకుంటే భవిష్యత్తులో తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడక తప్పదు. రేవంత్ తెలంగాణ వ్యతిరేక చర్యలకు సంఘీభావం తెలుపుతున్న కాంగ్రెస్ మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులకు ఇదే వర్తిస్తుంది. అధికారం దక్కింది కాబట్టి తాను ఏం చేసినా చెల్లుతుందని రేవంత్ రెడ్డి భావిస్తే తెలంగాణ ప్రజల చేతిలో పరాభవం తప్పదు.
(వ్యాసకర్త: రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్)
-దూదిమెట్ల
బాలరాజు యాదవ్