ఓటర్ల జాబితాను అప్పుడప్పుడూ సవరించడం తప్పనిసరి. అర్హులకు చోటు కల్పించి అనర్హులపై వేటు వేసేందుకు ప్రత్యేక ఉధృత సర్వేను (దీన్నే క్లుప్తంగా ‘సర్’ అని పిలుస్తున్నారు) నిర్వహించడమూ అవసరమే. దీని పై ఎవరికీ ఎలాంటి అభ్యంతరం ఉండనవసరం లేదు. ఈ విషయమై ఎన్నికల సంఘానికి ప్రజాప్రాతినిధ్య చట్టం (1951) పూర్తి స్వేచ్ఛను కల్పించింది. సంస్థ ఈ విషయం లో ఎవరి అనుమతి తీసుకోవాల్సిన లేదా ఎవరికీ జవాబుదారీ వహించాల్సిన అవసరం లేదు. దేశంలో ఇలాంటివి జరగడం ఇదే కొత్త కాదు కూడా. 1952 నుంచి 2004 వరకు 13 సార్లు ఉధృత సర్వేలు జరిగాయి. కానీ, ప్రస్తుత సర్వే స్థాయిలో అవేవీ వివాదాల్లో చిక్కుకోలేదు. అయితే ఎన్నికల కమిషన్ విశ్వసనీయత కొడిగట్టిన ప్రస్తుత తరుణంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ‘సర్’ పేరిట జరుగుతున్న తతంగమంతా కేంద్ర పాలక పక్షమైన బీజేపీకి సానుకూలత, విపక్షాలకు ప్రతికూలత కల్పించేందుకేనని, అందుకు కృత్రిమమైనరీతిలో చేర్పులు, ప్రక్షాళనలు జరుగుతున్నాయని ప్రధానమైన ఆరోపణ. పనిలోపనిగా పౌరసత్వ పరీక్షలూ జరుగుతున్నాయనేది మరో ఆరోపణ.
దాదాపు 20 ఏండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఎన్నికల సంఘం సర్వే చేపట్టింది. అందులోనూ మొదటి విడతగా బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించడంపై తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. మార్పుల తర్వాత జాబితాలో 50 లక్షలకు పైగా ఓటర్ల పేర్లు గల్లంతు కావడంపై పార్లమెంటు కూడా దద్దరిల్లింది. ఈ వివాదం ఒక కొలిక్కి రాకుండానే దేశమంతటా సర్ కార్యక్రమం చేపట్టనున్నట్టు ఎన్నికల కమిషన్ గత అక్టోబర్ 27న ప్రకటించింది. దీనిపై విపక్ష పాలిత రాష్ర్టాలు తీవ్ర వ్యతిరేకత తెలిపాయి. ముఖ్యంగా తమిళనాడు, పశ్చిమబెంగాల్ ప్రతిఘటించి తీరుతామని శపథం పూనాయి.
ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ సర్‌లో ఏకంగా సుమారు 20 శాతం ఓటర్ల పేర్లు, అంటే 2.89 కోట్ల ఓట్లు గల్లంతయ్యాయన్న వార్త సహజంగానే కలకలం రేపింది. రాష్ట్రంలోని మొత్తం ఓట్ల సంఖ్య 15.44 కోట్ల నుంచి 12.55 కోట్లకు తగ్గిపోయింది. ఇక రాజధాని నగరం లక్నోలో 39.9 లక్షల ఓట్లుంటే అందులో 30 శాతం సర్వేలో ఎగిరిపోయి 27.9 లక్షలే మిగిలాయి. అందులో కొందరు ఓటర్లు చనిపోయారని, మరికొందరు వేరే ప్రాంతాలకు వలసపోయారని, ఇంకొందరి పేర్లు రెండు లేదా అంతకంటే ఎక్కువచోట్ల ఉన్నాయని కమిషన్ అంటున్నది. ఏదేమైనప్పటికీ భారీ స్థాయిలో ఓట్ల తొలగింపుపై రాజకీయ విమర్శలు, ప్రతివిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సర్ కార్యక్రమం వల్ల కొన్ని వర్గాలు తీవ్ర ప్రభావానికి గురయ్యాయని ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ అంటున్నది.
సర్‌పై సర్వోన్నత న్యాయస్థానంలో తమిళనాడు న్యాయపోరాటం చేస్తున్నది. ఎన్నికల సంఘం చేపట్టిన సవరణకు ఎలాంటి రాజ్యాంగ బద్ధత, చట్టబద్ధత లేదని, పారదర్శకత, సమన్యాయం లోపించాయని ఆరోపిస్తూ, పాలక డీఎంకే, దాని మిత్రపక్షాలు కేసులు వేశాయి. ప్రస్తుతం వీటిపై సుప్రీంకోర్టు విచారణ జరుపుతున్నది. పైగా హడావుడిగా జరుపుతున్నారని, ముసాయిదా జాబితాలో మహిళల ఓట్లు అధికంగా గల్లంతు కావడం అనుమానాలకు తావిస్తున్నదని ఆ పార్టీలు వాదిస్తున్నాయి. మరోవైపు పశ్చిమ బెంగాల్లో అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి, సర్ యంత్రాంగానికి మధ్య హోరాహోరీ యుద్ధమే జరుగుతున్నది. సర్‌లో విధానపరమైన లోటుపాట్లు, అవకతవకలు జరుగుతున్నాయని అక్కడి పాలకపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇప్పటివరకు కమిషన్‌కు మూడు లేఖాస్ర్తాలు సంధించారు. ఓవైపు ఈ వివాదం ఇలా కొనసాగుతుండగానే నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్‌కు సర్ యంత్రాంగం విచారణ నోటీసు పంపించడంపై బెంగాలీలు మండిపడుతున్నారు. దేశ విభజన నుంచి బంగ్లా యుద్ధం దాకా అనేక చారిత్రిక కారణాల వల్ల బెంగాల్లో పౌరసత్వ సమస్యలున్నాయి. సర్ పేరిట దొడ్డిదారిన సిటిజన్‌షిప్ రిజిష్టర్‌ను ప్రవేశపెడుతున్నారని టీఎంసీ అంటున్నది. ఈ వివాదాల వెనుక నిజానిజాల మాట అటుంచితే, ప్రజలకూ, పార్టీలకూ సర్‌పై అంతులేనన్ని అనుమానాలున్నాయన్న మాట నిజం. వాటిని కేంద్ర ప్రభుత్వం నివృత్తి చేస్తుందని ఎవరూ ఆశించడం లేదు. ఎన్నికల సంఘంపై నమ్మకం అంతకంటే లేదు. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు మీదే ఆ గురుతర బాధ్యత ఉన్నదని చెప్పక తప్పదు.