న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటీషన్లపై సుప్రీంకోర్టు(Supreme Court) వాదనలు చేపట్టనున్నది. మే 5వ తేదీ నుంచి సీఏఏ పిటీషన్లపై వాదనలు ఉంటాయని సుప్రీంకోర్టు చెప్పింది. సుమారు 200 పిటీషన్లపై మే 12వ తేదీ వరకు ఆ వాదనలు జరగనున్నాయి. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌కు చెందిన హిందువులు, సిక్కులు, బౌద్ధులు, క్రైస్తవులు, జైనులు, పార్సీ శరణార్థులకు సీఏఏ కింద భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వనున్న విషయం తెలిసిందే. 2014, డిసెంబర్ 31 కన్నా ముందు ఇండియాకు వచ్చిన వారికి సీఏఏ ప్రకారం ఆ పౌరసత్వాన్ని కల్పించనున్నారు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీ, విపుల్ ఎం పంచోలీతో కూడిన సుప్రీం ధర్మాసనం ఫైనల్ ఇయరింగ్స్కు చెందిన మార్గదర్శకాలను ఇవాళ ఇచ్చింది. ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ దాఖలు చేసిన పిటీషన్‌ను కూడా సుప్రీం విచారించనున్నది.