దౌత్యనీతికి అర్థం లేకుండా పోయింది. అంతర్జాతీయ సంబంధాలకు అర్థం మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో కర్ర ఉన్నవాడిదే బర్రె అన్న చందంగా ప్రపంచం చాలా వెనుకకు పోయింది. ఒక సార్వభౌమ దేశపు అధ్యక్షుడి ఎన్నికపై ఎంతగా అనుమానాలున్నప్పటికీ మరొక దేశపు సైన్యం దాడిచేసి అతడిని ఒక నేరస్థుడిలా చూపి తమ వెంట తీసుకుపోవచ్చునా? వెనెజువెలా అధ్యక్షుని విషయంలో జరిగింది అపహరణ లేదా కిడ్నాప్ మాత్రమే. ఎందుకంటే మదురో నేరాలు రుజువూ కాలేదు. ఆయనను ‘పట్టుకొని పోవడానికి’ అమెరికా సైన్యం విశ్వ పోలీసూ కాదు. అమెరికా ఇతర దేశాలపై దాడి చేయడం, అధినేతలను పట్టుకోవడం ఇదే కొత్త కాదు. ఇరాక్పైకి దండెత్తిన రోజు మహావిధ్వంసక మారణాయుధాలు ఓ సాకు. అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ దేశ అధ్యక్షుడు సద్దాం హుసేన్‌ను పట్టుకొని విచారించి, అప్పటికప్పడు ఉరిశిక్ష విధించింది అమెరికా. ఆ ఆయుధాల సంగతి ఇప్పటికీ రుజువు కాలేదు. ఇప్పుడు డ్రగ్స్ సరఫరా పేరిట మదురోపై చేస్తున్న ఆరోపణలకూ ఆ గతే పట్టవచ్చు. మదురో ‘అరెస్టు’ తర్వాత అమెరికా వెనెజువెలా చమురు గురించి మాట్లాడటం చూస్తే అర్థమవుతున్నది తాటిచెట్టు ఎక్కింది దూడ గడ్డి కోసం కాదని.
వెనెజువెలాలో సౌదీ అరేబియాను మించిన చమురు నిల్వలున్నాయి. ప్రపంచంలోని మొ త్తం చమురు వనరుల్లో 20 శాతం దాకా వెనెజువెలాలోనే ఉన్నాయి. ఆ చమురును డాలర్లలో కాకుండా చైనాకు ఆ దేశం ఎప్పటి నుంచో యువాన్ల మార్పిడిలో అమ్ముతున్నది. డాలరు నుంచి పూర్తిగా వైదొలుగుతున్నట్టు 2018లో వెనెజువెలా ప్రకటించింది. యువాన్‌తో పాటుగా యూరోలు, రూబుళ్లు ఇలా ఏ కరెన్సీకైనా చమురు విక్రయిస్తూ డాలరును పూర్తిగా పక్కన పెట్టేసింది. డీడాలరైజేషన్ కోసం ప్రయత్నిస్తున్న బ్రిక్స్ కూటమిలో చేరేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నది. 1974 నుంచి అప్రతిహతంగా కొనసాగుతున్న పెట్రోడాలర్ పెత్తనానికి పెద్ద గండికొట్టడానికి వెనెజువెలా దగ్గర అపారమైన చమురు సంప ద మూలుగుతున్నది. ప్రపంచ వాణిజ్యంలో పెట్రోడాలరును బతికించుకోవాల్సిన దుస్థితి లో అగ్రరాజ్యం విలవిలలాడుతున్నది. ఈ వల యం నుంచి బయటపడేందుకు వెనెజువెలాపై దాడిని ఎంచుకున్నదనేది ప్రత్యక్షర సత్యం.
ఐక్యరాజ్య సమితి భద్రతామండలిని మూలకు నెట్టేసి ‘నేనే న్యాయాధికారిని, నేనే దండనాధికారిని’ అంటున్నది అగ్రరాజ్యం. అమెరికా ఖండ దేశాల్లో అమెరికా సంయుక్త రాష్ర్టాల ఆధిపత్యం మాత్రమే కొనసాగాలని సుమారు 200 సంవత్సరాల క్రితం మన్రో డాక్ట్రిన్ వెనెజువెలా ఘటన నేపథ్యంలో పదేపదే ప్రస్తావనకు వస్తున్నది. వెనెజువెలా పరిపాలనను ‘కొన్నాళ్లపాటు’ అమెరికా చూసుకుంటుందని, అక్కడి చమురు పరిశ్రమ అమెరికా కంపెనీల నియంత్రణలో ఉంటుందని ట్రంప్ అంటున్నారు. ఇది వలస పాలన తప్ప మరోటి కాదని చెప్పక తప్పదు. వాతావరణ ఒప్పందం వంటి వేదికల నుంచి తప్పుకోవడం ద్వారా ప్రపంచ సమస్యలపై అమెరికా తన జవాబుదారీతనాన్ని నిరాకరిస్తున్నది. మరోవైపు సైనిక దురాక్రమణల ద్వారా ఆధిపత్యం నిలబెట్టుకోవాలని చూస్తున్నది. ఈ ధోరణి ఇప్పుడు ఒక దేశపు సార్వభౌమాధికారాన్ని గడ్డిపరకలా తీసిపారేసే స్థాయికి చేరుకోవడం ప్రపంచానికి ప్రమాదకరం. అమెరికాను ఒకప్పుడు చైనా అధినేత మావో కాగితపు పులిగా తీసిపారేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికా దుందుడుకు చర్యలను తీవ్రంగా ఖండించకపోతే దేశాల సార్వభౌమాధికారం కాగితపు పడవ అవుతుంది.