‘ఉద్యమకారులు, కవులు, కళాకారులు, మేధావుల ఏకాభిప్రాయంతో ‘తెలంగాణ తల్లి’ ఇలా ఉండాలని నిర్ణయించి నాడే ఆ తల్లిని హుందాగా రూపొందించారు. నేడు ఆ ఆకృతిని బోసిపోయినట్టుగా మార్చడం రాష్ర్టానికే సిగ్గుచేటు. కేసీఆర్ ఆనవాళ్లను లేకుండా చేస్తానని ప్రకటించిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ దిశగానే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్టుంది’ అని తెలంగాణ ఉద్యమకారుడు, నాగర్‌కర్నూల్‌కు చెందిన కవి వనపట్ల సుబ్బయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ముచ్చటించారు.
వనపట్ల సుబ్బయ్య: బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఓ అభిమానిగా, ఓ కవిగా ఊహించుకోలేకపోతున్నా. ఓ రాజకీయ పార్టీనో లేక ఓ రాజకీయ నాయకుడో పెట్టింది కాదు బతుకమ్మ. తెలంగాణ లో అనాది నుంచి వారసత్వంగా వస్తున్న సంప్ర దాయం. 50 ఏండ్ల పాటు తెలుగు తల్లిగా ఉన్నటువంటి తెలంగాణలో మనకంటూ ఒక ‘తెలంగాణ తల్లి’ ఉండాలనే ఆలోచన చేసిన మొట్ట మొదటి వ్యక్తి కేసీఆర్. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహంలో నాటి ఉద్యమకారులు బతుకమ్మకు ప్రముఖ స్థానం కల్పించారు. అలాంటి బతుకమ్మను నేటి తెలంగాణ తల్లి నుంచి వేరు చేయడం సిగ్గుచేటు.
తన చేతిలో బతుకమ్మ పెట్టుకొని ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తొలిసారిగా 2006లో కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఆవిష్కరింపబడింది. ఆ త ర్వాత తెలంగాణ తల్లి మనకు ఆరాధ్య దైవమైంది. ఏ తల్లయినా బట్టలు చినిగిపోయి ఉండాలని కోరుకోదు. అందుకే నాటినుంచి ఆభరణాలు, కిరీటం చేయించి అమ్మగా కొలుచుకుంటున్నాం.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని మీరు అధికారంలో ఉండి పెట్టలేకపోయారు. అందుకే, ఇప్పుడు మేము పెడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలకు పోతున్నది. కానీ అది వాస్తవానికి విరుద్ధం. 2006లోనే రాష్ట్ర వ్యాప్తంగా వేలకొద్దీ తెలంగాణ తల్లి విగ్రహాలు కొలువుదీరాయి. అమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటుచేసిన విగ్రహం కావచ్చు, ప్రపంచ తెలుగు మహాసభలలో ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా పూజలందుకున్న తెలంగాణ తల్లి కావచ్చు.. ఇవన్నీ గతంలో ఏర్పాటుచేసినవే. రాష్ట్రంలో మూలమూలన తెలంగాణ తల్లి విగ్రహాలున్నప్పటికీ మళ్లీ పెట్టాలనే ప్రభుత్వ ఆలోచన వెనుక కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే కుట్రలు కనపడుతున్నాయి.
నూటికి నూరు శాతం నా అభిప్రాయం అదే. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయం ఎదురుగా ప్రతిష్ఠించుకుందామనుకొని, అందుకోసం స్థలాన్ని కూడా సేకరించుకొని పెట్టుకున్నది. ఆలోపు అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఆ పనికి ఆగిపోయింది. ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని కాంగ్రెస్ నాయకులు సద్వినియోగం చేసుకోకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. అందుకు ఉదాహరణే సచివాలయం ముందు రాజీవ్‌గాంధీ విగ్రహ ప్రతిష్ఠాపన. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించాల్సిన చోట, అసలు తెలంగాణకు, తెలంగాణ ఉద్యమానికి ఏ మాత్రం సంబంధంలేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం తెలంగాణ అస్తిత్వాన్ని అణగదొక్కాలని చూడటమే. దానితోనే ఆగకుండా తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని కూడా మార్చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. తెలంగాణ తల్లి, బతుకమ్మలను వేరు చేయడం ఇంకా విచారకరమైన విషయం.
సచివాలయంలో పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో అభయహస్తం ఉంది, అది చేయిగుర్తును పోలినట్టుగా ఉన్నది. ఆ చేతిలో బతుకమ్మ ఉంటే మాకు, తెలంగాణ ప్రజలకు గౌరవంగా ఉంటుంది. బతుకమ్మ లేని తెలంగాణ తల్లిని ఒక కవిగా నేను ఊహించుకోలేకపోతున్నా.
వంద శాతం అనిపిస్తున్నది. తెలంగాణ ఉద్యమ సమయంలో రెండు కండ్ల సిద్ధాంతాన్ని ప్రదర్శించిన చంద్రబాబు ప్రస్తుతం ఆంధ్రప్రదే శ్‌కు సీఎంగా ఉన్నాడు. ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి ప్రస్తుతం తెలంగాణ రాష్ర్టానికి ముఖ్యమంత్రి గా ఉన్నారు. గత పదేండ్లలో కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆనవాళ్లను ఈ ఇద్దరు కలిసి తుడిచేయాలనే కుట్రలు చేస్తున్నట్టు ప్రస్ఫుటంగా అర్థమవుతున్నది. ఆ కుట్రలో భాగమే ఉద్యమ సమయంలో తయారు చేసుకున్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం మార్చివేసి అబాసుపాలవుతు న్నది.
సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడమనేది హర్షించదగిన విషయం ఎంతమాత్రమూ కాదు. ఎందుకంటే రాష్ట్రంలోని నలుమూలల నుంచి ప్రజలు నగరానికి వస్తుంటారు, పోతుంటారు. ఆ తల్లి విగ్రహాన్ని చూడాలనుకున్నప్పుడు సచివాలయ పోలీసు సిబ్బంది వారిని లోపలికి అనుమతించే ఆస్కారం ఉండదు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలనే కోరిక నాదే కాదు, నాలుగుకోట్ల తెలంగాణ ప్రజలది కూడా. అరువై ఏండ్లు పోరాడినా తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించకపోవడంతో, ఇక తెలంగాణ రాష్ట్రం రాదేమోనని, మేము ఆత్మబలిదానాలు చేసుకుంటేనైనా తెలంగాణ ప్రకటిస్తారేమోనన్న ఆశతో కొంతమంది యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, అగ్నికి ఆహుతయ్యారు. వారి ఆశయాలకనుగుణంగా ఇవ్వాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. అలాంటి తెలంగాణ రాష్ట్రంలో బంగారు బాటగా దూసుకెళ్తున్న క్రమంలో పరాయి శక్తులు మళ్లీ తెలంగాణపై పడ్డాయి. అందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పు, ఆ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేయడమే. ఇది తెలంగాణకు క్షేమదాయకం కాదు. ప్రభుత్వం ఇకనైనా పునరాలోచించుకొని తెలంగాణ తల్లి విగ్రహ మార్పులో వెనక్కి తగ్గాలి. లేకుంటే తెలంగాణ ప్రజలు సహించరు.
– తోషకాన ప్రదీప్ 94904 12413