విశ్వవిద్యాలయాలకు సంబంధించి కేంద్ర సంస్థగా ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఉన్నత విద్యా సంస్థల్లో కులవివక్ష నిర్మూలనపై తాజా నిబంధనలు ప్రవేశపెట్టింది. 2012 యూజీసీ నిబంధనల స్థానంలో వీటిని తీసుకొచ్చారు. ఈ కొత్త నియంత్రణల్లో ప్రధానంగా మూడు అంశాలు ఉన్నాయి. ఒకటి, నిషేధిత ప్రవర్తనను కులం, తెగ ఆధారిత వివక్షగా నిర్వచించడం, రెండు, క్యాంపస్లలో సమాన అవకాశాల కేంద్రాలు (ఈవోసీ), సమానత్వ కమిటీల వంటి నివారణ పరిష్కార యంత్రాంగం ఏర్పాటు చేయడం, మూడు, అమలులో వైఫల్యాన్ని నిబంధనల ఉల్లంఘనగా గుర్తించి సంస్థలపై చర్యలు తీసుకోవడం, జరిమానాలు విధించడం. కొత్త నిబంధనలు వివక్షపై నీతులు వల్లించడం లాగా కాకుండా స్పష్టత వైపు ఇవి అడుగులు వేయడం విశేషం. వివక్షను ఏదో నైతిక ఉల్లంఘనగా కాకుండా ప్రతీ ఉన్నత విద్యాసంస్థలో నివారణ, పరిష్కార యంత్రాంగాలు తప్పనిసరిగా ఉండాలని సూచించడం కీలక పరిణామమేనని చెప్పక తప్పదు.
చారిత్రకంగా మన వర్సిటీల్లో వివక్ష అంశాలపై నిరాకరణ, తాత్సారం, పక్కదారి పట్టించడం అనే త్రిముఖ వ్యూహంతో ఎదుర్కోవడం జరుగుతున్నదనేది వాస్తవం. పరిష్కార విధానాల్లో నిర్ణీత గడువులు, పత్రాలపై స్పష్టత ఇవ్వడం ద్వారా కొత్త నిబంధనలు ఈ తరహా పలాయనవాదానికి చోటులేకుండా చేశాయి.
ఈ నిబంధనల రూపకల్పన నేపథ్యం పరిశీలిస్తే, ఇంతటి కట్టుదిట్టమైన రీతిలో వీటిని ఎందుకు రూపొందించారో మనకు అర్థమవుతుంది. యూనివర్సిటీల్లో వెనుకబడిన వర్గాల విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతుండటం దేశ ఉన్నత విద్యా వ్యవస్థ ప్రతిష్టను మసకబార్చింది. 2019-2021 మధ్యకాలంలో దళిత, బహుజన, ఆదివాసీ విద్యార్థులు కేంద్ర నిర్వహణలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఆత్మహత్య చేసుకున్నట్టు స్వయంగా కేంద్ర ప్రభుత్వమే 2023లో రాజ్యసభలో వెల్లడించింది. మరో అంచనా ప్రకారం 2014-2021 మధ్యకాలంలో అగ్రస్థాయి సంస్థల్లో 122 మంది ఆత్మహత్య చేసుకుంటే అందులో 68 మంది అంటే 55 శాతం వెనుకబడిన కులాల వారే ఉన్నారు. అందులో 24 మంది ఎస్సీలు, ముగ్గురు ఎస్టీలు, 41 మంది ఓబీసీలు ఉన్నట్టు ప్రభుత్వం లోక్సభకు తెలిపింది.
ఈ విషాదకర పరిణామాల నేపథ్యంలో ఉన్నత విద్య చదువుతున్న ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు నిబంధనలు పదునెక్కడానికి దారితీశాయి అని గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఎస్సీ పీహెచ్డీ స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య, రెండు, ముంబై నాయర్ హాస్పిటల్లో పాయల్ తడ్వీ అనే ఎస్టీ పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్ ఆత్మహత్య. ఈ ఇద్దరు వివక్ష బాధితుల తల్లులు దాఖలు చేసిన పిటిషన్ను పురస్కరించుకుని నిబంధనలు నామమాత్రంగా కాకుండా కఠినంగా ఉండాలని సుప్రీంకోర్టు నిరుడు జనవరిలో తీర్పు చెప్పింది. ఆ మేరకు యూజీసీ ప్రవేశపెట్టిన నిబంధనలపై క్యాంపస్ల లోపలా, వెలుపలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కులవివక్ష అణచివేతకు తెచ్చిన నిబంధనలు మరోసారి కులపరమైన విభేదాలకు ఆజ్యం పోస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. భారత్కు కులపరమైన అంశం చాలా సున్నితమైన అంశమనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మండల్ వంటి చారిత్రక వివాదాలను తట్టుకుని నిలిచిన దేశం మనది. యూజీసీ నిబంధనల విషయంలో కేంద్రం మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.