మే 21న నారాయణపూర్ ఊచకోతలో సీపీఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజును చట్టవిరుద్ధంగా హత్యచేసిన తర్వాత, మోదీ ప్రభుత్వం విజయోత్సాహంలో ఉన్నట్టు కనిపిస్తున్నది. హోం మంత్రి అమిత్ షా దీన్ని ‘నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి’ అని అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ‘అద్భుతమైన విజయం’గా ప్రకటించారు.
కర్ణాటక బీజేపీ నేతలు హోంమంత్రి అమిత్ షా కాలీఫ్లవర్ పట్టుకొని ఉన్న ఒక చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఆ చిత్రాన్ని చూసిన వెంటనే.. 1989లో భాగల్పూర్లో జరిగిన ఒక మారణహోమం గుర్తుకువచ్చింది. ఆ మారణ హోమంలో వంద మందికి పైగా వ్యక్తులను చంపి, సమాధి చేసిన నేలపై కాలీఫ్లవర్లు పెంచినట్టు హంతకులు పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం తన అతి పెద్ద మావోయిస్టు వ్యతిరేక సైనిక విజయాన్ని ప్రకటించుకున్న తరుణంలో భారతదేశంలో అత్యంత దారుణమైన మారణ హోమాల్లో ఒకదాన్ని బీజేపీ గుర్తుంచుకొని మరీ ఈ ఘోర కార్యానికి పూనుకున్నది.
నారాయణపూర్ మారణహోమంలో మావోయిస్టుల మరణాలను సీపీఐ (మావోయిస్ట్) దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ తరపున విడుదల చేసిన పత్రికా ప్రకటన ధృవీకరిస్తున్నది. దీని ప్రకారం ఈ మారణహోమంలో 28 మంది కార్యకర్తలు మరణించారు. వీరిలో అనేక మంది మహిళలు, పార్టీ సీనియర్ నాయకులున్నారు. బసవరాజుకు 60 మందికి పైగా యోధులతో కూడిన తక్షణ భద్రతా వ్యవస్థ ఉన్నదని, కానీ జనవరి నుంచి వేగవంతమైన కదలికల కోసం ఆ సంఖ్యను తగ్గించారని ఆ ప్రకటనలో పేర్కొన్నది. రక్షణ వలయంలోని కొందరు లొంగిపోవడం ద్రోహులుగా మారడంతో రాజ్యం తమ మిలటరీ ఆపరేషన్ను విజయవంతంగా ప్లాన్ చేసి అమలుచేయడానికి వీలు కలిగింది.
మారణ హోమం జరిగిన సమయంలో బసవరాజుకు 34 మంది యోధులు కాపలాగా ఉన్నారు. వారిలో ఏడుగురు భద్రతాదళాల వలయాన్ని ఛేదించి విజయవంతంగా తప్పించుకోగలిగారు. బసవరాజు తల్లి, నాగేశ్వర్రావు కుటుంబసభ్యులు, ఇతర నాయకులు, వారి బంధువుల మృతదేహాలను అంత్యక్రియల కోసం ఇంటికి తీసుకురావడానికి వారి కస్టడీని కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు అనుకూల ఉత్తర్వు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం పోస్ట్మార్టం తర్వాత మృతదేహాలను అప్పగిస్తామని కోర్టుకు హామీ ఇచ్చింది. కానీ, కుటుంబసభ్యులు మృతదేహాల కోసం వేచి ఉండగా, రాష్ట్రం వాటిని ‘క్లెయిమ్ చేయని మృతదేహాలు’ అంటూ దహనం చేసింది.
మావోయిజంపై యుద్ధం ముసుగులో, సైనికీకరణ కార్పొరేట్ దోపిడిల సంబంధానికి వ్యతిరేకంగా బస్తర్లో జరుగుతున్న ప్రతి ఆదివాసీ నిరసనను మోదీ ప్రభుత్వం మరుగుపరచడానికి ప్రయత్నిస్తున్నదని మనం గమనించాలి. గాంధేయవాది హిమాన్షు కుమార్ను ఛత్తీస్గఢ్ నుంచి బహిష్కరించారు. రచయిత్రి-కార్యకర్త బేలా భాటియాను వేధిస్తున్నారు, అణచివేస్తున్నారు. బస్తర్లో దీర్ఘకాల ప్రజాదరణ పొందిన ప్రజా గొంతుక మాజీ సీపీఐ ఎమ్మెల్యే మనీష్ కుంజమ్ను లక్ష్యంగా చేసుకుంటున్నారు. మూలవాసి బచావ్ మంచ్ అని పిలువబడే స్థానిక ప్రజల సైనికీకరణ వ్యతిరేక వేదికను నిషేధించారు. విచక్షణారహితంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఛత్తీస్గఢ్ ప్రత్యేక ప్రజా భద్రతా చట్టం-చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం వంటి క్రూరమైన చట్టాల కింద ప్రజలను మూకుమ్మడిగా అరెస్టు చేస్తున్నారు. ఒక భావజాలాన్ని సమర్థించడం నేరం కాదనీ, ప్రతి ఎన్కౌంటర్పై తప్పనిసరి దర్యాప్తు కోసం మార్గదర్శకాలున్నాయని సుప్రీంకోర్టు పదే పదే చెప్పింది. నేడు సైద్ధాంతిక వేట ఎన్కౌంటర్ హత్యలు, తటస్థీకరణగా ఎక్కువగా వర్ణించబడుతున్నాయి. ఇవి రాజ్యం నిరంకుశ పాలసీకి మూల స్తంభాలుగా మారాయి.
‘ఆపరేషన్ కగార్’ పరిణామాలు బస్తర్ లేదా మావోయిస్టులకే పరిమితం కావు. అవి న్యాయం కోసం జరిగే ప్రతి ఉద్యమానికి, ఫాసిస్ట్ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరిగే అన్ని అసమ్మతులకూ శరాఘాతంగా మారుతాయి. త్వరలోనే, బస్తర్లో రూపుదిద్దుకుంటున్న ఈ అరాచక మోడల్ కొత్త లక్ష్య సమూహాలకు వ్యతిరేకంగా ఎక్కడైనా అమలవుతుంది. బీజేపీ కర్ణాటక దుష్ట చిత్రాల్లో అమిత్ షా చేతుల్లో ఉన్న కాలీఫ్లవర్ అందరికీ ఒక హెచ్చరికగా పనిచేయాలి. మావోయిస్టులు ఏక పక్ష కాల్పుల విరమణ ప్రకటించిన సమయంలో, శాంతి సంభాషణల ద్వారా రాజకీయ పరిష్కారం కోసం విస్తృత సమావేశం జరగాలి.
భారత రాజ్యాంగం మనుగడ సాగించాలంటే నారాయణపూర్ హత్యాకాండ, ఆపరేషన్ కగార్ పేరిట జరిగిన మారణహోమాలపై న్యాయ విచారణ జరిగి తీరాలి. మావోయిస్టులు ప్రస్తుత పరిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవాలి. బస్తర్ తదితర ప్రాంతాల సాధారణ ప్రజానీకం గౌరవ ప్రదమైన న్యాయానికి అర్హులు. ఈ అమానుష సైనికదాడికి బలైన అమాయక జన బాహుళ్యానికి న్యాయం జరిగేలా చూడటం ప్రజాస్వామ్యవాదుల బాధ్యత.
– (వ్యాసకర్త: జాతీయ ప్రధాన కార్యదర్శి, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్)
కామ్రేడ్ దీపాంకర్ భట్టాచార్య