వలస పాలనలో అత్యంత నిర్లక్ష్యానికి గురై, అన్ని విధాలుగా ఛిద్రమైంది మన తెలంగాణ. అందుకే పోరాటం చేసినం. రాష్ట్రం సాధించుకున్నం. స్వరాష్ట్రం సిద్ధించిందన్న ఆనందం ఓవైపు ఉంటే.. తెలంగాణ వాళ్లకు పాలన చాతనైతదా అంటూ ఓ వర్గం మీడియా రాస్తున్న పచ్చకామెర్ల రాతలను చూసి తన్నుకొస్తున్న నిర్వేదం మరోవైపు తెలంగాణ ప్రజలను వెక్కిరిస్తున్నది.
Telangana | స్వయంపాలన మనకు చాతనైతదా అని ప్రజల్లోనూ ప్రశ్నలు తలెత్తుతున్న సమయమది. కానీ, ఆ అనుమానాలన్నింటినీ కేసీఆర్ పటాపంచలు చేశారు. అసలు స్వయంపాలన 2014లో మొదలైంది. కానీ, ఈ పాలనకు మేధోమథనం మాత్రం 2001లోనే మొదలైంది. నాడు ఎంతమంది వెక్కిరించినా, ఎంతో మంది అవమానపరిచినా ఓ వైపు ఉద్యమం చేస్తూనే, మరోవైపు స్వయంపాలనలో చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ అప్పట్లోనే మేధోమథనం ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే అన్నిటికంటే ముందుగా ఛిద్రమైన రైతన్న బతుకును బాగుచేయాలని, సాగు నీళ్లియ్యాలనే ఆలోచన నుంచి పుట్టిందే మిషన్ కాకతీయ. కాకతీయ, రెడ్డి రాజులు తమ పాలనలో చెరువులు తవ్వించి, రైతులకు సాగునీరందించారు.
ఆ స్ఫూర్తితోనే ధ్వంసమైన అనేక చెరువులను కేసీఆర్ పునరుద్ధరించారు. అంతేకాదు, కొత్తగా అనేక చెరువులను తవ్వించారు. చెరువుల అనుసంధానంతో నీళ్లకు నడక నేర్పించారు. తద్వారా సిరుల తెలంగాణను సాకారం చేశారు. అందుకు ప్రత్యక్ష నిదర్శనమే పాలమూరు జిల్లా. చెరువుల పూడికతీత, నూతనంగా నిర్మించిన చెరువులతో పాలమూరు బీడు భూముల్లో సిరులు పండాయి. ఉమ్మడి పాలనలో కరవుకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పాలమూరు పచ్చని పైట కప్పుకొన్నది. ఇది కదా అసలుసిసలు మార్పు.
ప్రతీ ఇంటికి తాగునీరు అందించాలని, నల్గొండ జిల్లాను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టాలని కేసీఆర్ సంకల్పించారు. అనుకున్నట్టుగానే ఫ్లోరైడ్ సమస్యకు చరమగీతం పాడారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు ఇచ్చారు. బిందెలు పట్టుకొని కిలోమీటర్ల కొద్దీ నడిచే మహిళల దుస్థితికి ముగింపు పలికారు. వారి ఆత్మగౌరవాన్ని కాపాడారు. ఇది కదా మార్పు.
దశాబ్దాల పాటు సాగివేతలతో ప్రాజెక్టులను నిర్మించే చరిత్ర కాంగ్రెస్‌ది. కాంగ్రెస్ పాలకులు అసంపూర్తిగా వదిలేసిన ప్రాజెక్టుల పునర్నిర్మాణంతో పాటు కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి బారీ ప్రాజెక్టులను నిర్మించి ‘నా తెలంగాణ కోటి ఎకరాల మాగాణం’ అన్న దాశరథి కలను సాకారం చేసిన మార్పు బాగుంది. టీఎస్ఐపాస్ అనే విప్లవాత్మకమైన సంస్కరణలను చేపట్టి ప్రారిశ్రామిక ప్రగతి పరుగులు పెట్టించి, హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసిన మార్పు బాగుంది.
రైతుబంధు, రైతు బీమా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అవ్వతాతలకు పింఛన్లు, కంటివెలుగు వంటి ఎన్నో సంక్షేమ పథకాలను విజవంతంగా అమలు చేసి దేశానికే దిక్సూచిగా తెలంగాణను నిలిపిన మార్పు బాగుంది.
అభివృద్ధి-సంక్షేమం జోడెద్దుల బండిలాగా పరుగులు పెడుతున్న తరుణంలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేసిన ఏమార్పు ప్రజలను నిట్టనిలువునా ముంచింది. ఆరు గ్యారంటీలు, 13 అంశాలు, 420 అలవిగాని హామీలకు తోడు అబద్ధాలు, అర్ధసత్యాలను కాంగ్రెస్ వల్లెవేసింది. ఇష్టారీతిన ప్రజలను ఏమార్చి అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు కావస్తున్నా ఏ ఒక్క హామీని సంపూర్ణంగా అమలు చేయలేకపోవడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం. అంతేకాదు, అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి క్యాబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీకి ఆమోదిస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని, ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నిరుద్యోగులను నమ్మించి నయవంచన చేసింది.
ధర్నాచౌక్‌ను పునఃప్రారంభిస్తూ.. కాంగ్రెస్ పాలనలో ధర్నా చౌక్ అవసరం ఉంటుందని చెప్పకనే చెప్పింది. ఒక్క ధర్నా చౌకే కాదు, ఈ రాష్ట్రమే ఓ ధర్నా చౌక్ అవుతుందని నిరూపించింది. ప్రమాణస్వీకారం చేయకముందే ప్రగతి భవన్ వద్ద ఇనుప కంచెలను తొలగించి హడావుడి చేశారు. ప్రజావాణి పేరిట ముఖ్యమంత్రిని ఎవరైనా, ఎప్పుడైనా కలవొచ్చంటూ ప్రగల్భాలు పలికారు. కానీ, తీరా చూస్తే అది ఆరంభ శూరత్వమేనని ఇప్పుడు తేలిపోయింది.
పాలనలో అనుభవమే లేదు. పాలనను అర్థం చేసుకున్నదే లేదు. నెలకు 20 రోజులు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏడు నెలలైనా ముఖ్య శాఖలకు మంత్రులను కేటాయించకుండా శాంతిభద్రతలకు తిలోదకాలిచ్చి రాష్ర్టాన్ని అగ్నిగుండంలా మారుస్తున్నారు. ఎన్నికల సమయంలో ‘ఆ ఇంటి కాకి ఈ ఇంటిపై వాలొద్దు.. ఈ ఇంటి కాకి ఆ ఇంటిపై వాలొద్దు, అలా వాలితే కాల్చిపారేస్తా’ అని ప్రగల్భాలు పలికారు. కానీ, నేడు ఆ ఇంట్లోకే పోయి ఆ కాకులను బతిమాలి మరీ పార్టీలో చేర్చుకుంటున్నారు నాటి ఉద్యమ ద్రోహి. ఆయన చెప్పిన మాటలకు ఎంత విలువ ఉందో దీన్నిబట్టే అర్థమవుతున్నది. పట్టుమని పది రోజులు కూడా మాట మీద నిలబడలేదని ఆయన తీరును చూసి తెలంగాణ సమాజం ముక్కున వేలేసుకుంటున్నది. నాడు పార్టీ ఫిరాయింపు చట్టాలను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీయే. అదే పార్టీకి చెందిన ముఖ్యమంత్రి నేడు ఇతర పార్టీల శాసనసభ్యుల ఇళ్లకు తిరుగుతూ పార్టీ ఫిరాయింపు చట్టాలకు నిళ్లొదలడం గర్హనీయం.
మాటల్లో అతివాదం, చేతల్లో మితవాదం ఉన్న నాయకులు పాలిస్తే వారి పాలన ఎలా ఉంటుందో చెప్పడానికి నేటి తెలంగాణ ఓ ప్రత్యక్ష ఉదాహరణ. గడచిన ఆరు నెలల పాలనను, రాష్ట్ర పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న తెలంగాణ సమాజం.. తాము ఎంతటి ఏమరుపాటుకు లోనయ్యామని ఇప్పుడు బాధపడుతున్నది. ఈ ప్రభుత్వం చేసిన మార్పు పునర్నిర్మాణ విధ్వంసం, ప్రశ్నించే గొంతుల అణచివేత, ప్రశ్నించేవారిపై అక్రమ నిర్బంధాలు. కాంగ్రెస్ చేసింది మార్పు కాదు, ఏమార్పు. అందుకే అత్యాశే ఏమార్చిందని, తమ కొంపముంచిందని గ్రామీణ తెలంగాణ నేడు నిర్వేదంలో కొట్టుమిట్టాడుతున్నది. ఒక్కటి మాత్రం నిజం. ‘ప్రాంతేతరుడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేర వరకు తరిమికొట్టు, ప్రాంతంవాడు మోసం చేస్తే ప్రాంతం పొలిమేరల్లోనే పాతిపెట్టు’ అనే మాటను తెలంగాణ సమాజం ఎప్పటికీ మరువదు.
ఏమార్పు – 6 గ్యారంటీలు
ఏమార్పు – 13 అంశాలు
ఏమార్పు – 420 హామీలు
ఏమార్పు – తొలి క్యాబినెట్లో మెగా డీఎస్సీ
ఏమార్పు 2023 డిసెంబర్ 9న రుణమాఫీ
ఏమార్పు – రైతుభరోసా ఇవ్వకపోవడం
ఏమార్పు – నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేయలేకపోవడం
ఏమార్పు – ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు
ఏమార్పు – నీటి నిల్వలను కాపాడలేకపోడం.
మార్పు- మిషన్ కాకతీయ
మార్పు- మిషన్ భగీరథ,
మార్పు- రైతుబంధు
మార్పు- రైతు బీమా
మార్పు- ప్రాజెక్టుల నిర్మాణం
మార్పు- 24 గంటల
ఉచిత విద్యుత్తు
మార్పు – హైదరాబాద్ నగరాన్ని మేటి నగరంగా తీర్చిదిద్దటం
మార్పు- సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేసి తద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధించడం.
మేడిపల్లి వెంకటేశ్వర్‌రెడ్డి
96151 46666