‘ఏం లేని విస్తరాకే ఎగిరెగిరి పడుతది’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు పాలనా తీరు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేక, చేసిన వాగ్దానాలను నెరవేర్చలేక హస్తం పాలకులు పదే పదే అబద్ధాలు వల్లె వేస్తూ పబ్బం గడుపుతున్నారు. గారడీలు చేస్తూ అందరినీ ఏమార్చే పనిలో పడ్డారు. చెప్పుకొనేందుకు ఇప్పటివరకు చేసిన పనులేవీ లేకపోవడంతో అబద్ధాల రాగం ఆలపిస్తున్నారు. ఈ గారడీల పరంపర ఎక్కడి వరకు వచ్చిందంటే.. ఆఖరికి గ్రాడ్యుయేట్లను మోసం చేసేవరకు వచ్చింది. నిరుద్యోగులు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేస్తున్నారన్న మన సీఎం రేవంత్‌రెడ్డి కోతలు ఆ కోవకు చెందినవే.
‘జాబ్ క్యాలెండర్ ప్రకటించండి. వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయండి మహాప్రభో’ అని లబోదిబోమని మొత్తుకుంటున్న నిరుద్యోగుల ఆవేదన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఇలా అర్థమైంది. వేదిక ఏదైనా, సందర్భమేదైనా మైకు చేతికందితే చాలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్‌రెడ్డి.. తాజాగా రైతుభరోసా విజయోత్సవ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వెనువెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తే.. ‘అన్ని నోటిఫికేషన్లు ఒకేసారి వద్దు. మాకు చదువుకోవడానికి టైం ఉండదు. కొంచెం గ్యాప్ ఇచ్చి నోటిఫికేషన్లు వేయండని నిరుద్యోగులు అంటున్నారు’ అని రేవంత్ గొప్పలకు పోయారు. పైపెచ్చు ‘ఉద్యోగ నోటిఫికేషన్లు వద్దని ఎక్కడైనా ధర్నా జరిగిందంటే అది ఒక్క తెలంగాణలోనే’ అని స్వడబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదం.
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏ మాత్రం బాధ్యత లేకుండా, నిస్సిగ్గుగా ఇంత దారుణంగా ఎలా అబద్ధాలు చెప్పగలిగారో అర్థం కావడం లేదు. ముఖ్యమంత్రి దారిలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా నడుస్తున్నారు. ఆయన సైతం పదే పదే ఇదే వ్యాఖ్యలు చేస్తూ తన స్థాయిని దిగజార్చుకుంటున్నారు. సర్వీస్ కమిషన్ ప్రక్షాళనతో నోటిఫికేషన్లు వస్తూనే ఉన్నాయి. అది ఏ స్థాయికి వెళ్లిందంటే, ‘ఒకప్పుడు నోటిఫికేషన్లు కావాలని ధర్నాలు చేసేవాళ్లు. ఇప్పుడేమో నోటిఫికేషన్లు వద్దనే పరిస్థితి ఉన్నది. ఆ స్థాయిలో మేం ఉద్యోగ నోటిఫికేషన్లను ఇస్తున్నాం’ అని తమ సర్కారుకు కితాబిచ్చుకున్నారు.
ఎన్నికలకు ముందు జాబ్ క్యాలెండర్ పేరిట నిరుద్యోగులను కాంగ్రెస్ దగా చేసింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఉద్యోగులు కొలువుల భర్తీపై నిలదీయడంతో అధికారంలోకి వచ్చాక డమ్మీ జాబ్ క్యాలండర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసి చేతులు దులుపుకొన్నది. ఆ డమ్మీ జాబ్ క్యాలెండర్‌లోనూ 18 రకాల ఉద్యోగాల నోటిఫికేషన్లను పొందుపరిచింది. ఏ నెలలో నోటిఫికేషన్ విడుదల చేస్తారు, ఏ నెలలో పరీక్ష నిర్వహిస్తారనే వివరాలను కూడా అందులో చేర్చింది. 2024 అక్టోబర్‌లో విద్యుత్తు సంస్థల్లో ఇంజినీరింగ్ పోస్టుల నోటిఫికేషన్, 2025 జనవరిలో పరీక్షలు; 2025 ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్, ఏప్రిల్‌లో పరీక్షలు; 2025 ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్, మే నెలలో పరీక్షలు; 2024 నవంబర్‌లో టెట్ నోటిఫికేషన్, 2025 జనవరిలో పరీక్షలు; 2025 మే నెలలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ల నోటిఫికేషన్, అక్టోబర్‌లో పరీక్షలు; 2025 ఏప్రిల్‌లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్, ఆగస్టులో పరీక్షలు.. ఇలా అనేక నోటిఫికేషన్లకు సంబంధించి డమ్మీ జాబ్ క్యాలెండర్‌ను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సర్కారు రిలీజ్ చేసింది. కానీ, వాటిలో ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి సహా కాంగ్రెస్ నాయకులంతా తమ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలోనే 60 వేల ఉద్యోగాలిచ్చిందని ప్రచారం చేస్తూ అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయారు. (మొన్నటి వరకు 56 వేల ఉద్యోగాలనే చెప్పారు. రేవంత్‌రెడ్డి దాన్ని తాజాగా 60 వేలకు పెంచారు). అసలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో కొత్తగా విడుదలైన ఉద్యోగ నోటిఫికేషన్లు ఎన్ని? కేవలం ఒకే ఒక్కటి. వైద్య ఆరోగ్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, సివిల్ సర్జన్లు, స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి కాంగ్రెస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇది తప్ప కాంగ్రెస్ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ను కొత్తగా జారీ చేసి నియామకాలను పూర్తిచేయలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు కొన్ని పోస్టులు కలిపి, మెగా డీఎస్సీ అంటూ దగా చేసింది. ఈ నియామకాల్లోనూ అక్రమాలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. పోస్టులు అమ్ముకున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా టీచర్ల నియామకాల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు రాష్ట్రమంతా కోడై కూస్తున్నది. స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ల సర్టిఫికెట్ల పరిశీలనలో అక్రమాలపై ఇప్పటికే కొందరికి షోకాజ్ నోటీసులు వెళ్లాయి. ఇప్పుడు దీనిపై విద్యాశాఖ, క్రీడా శాఖల మధ్య విభేదాలు తలెత్తినట్టు తెలుస్తున్నది. తప్పు నీదంటే నీదంటూ ఒకరిపై ఒకరు నెపం వేస్తూ తప్పించుకోవాలని చూస్తున్నాయి.
ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా 60 వేల ఉద్యోగాలను ఇవ్వడమనేది కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యమైంది. ఇది ప్రపంచంలో 8వ వింత కాక మరేమిటి? పైగా, బీఆర్ఎస్ వాళ్లు ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తారనే మన ముఖ్యమంత్రి అందరినీ ఎల్బీ స్టేడియానికి పిలిచి ఒక్కో తలను లెక్కపెట్టి మరీ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారట. ఈ తలల లెక్క సంగతేమో గానీ, ఎల్బీ స్టేడియంలో రేవంత్ నియామక పత్రాలు ఇచ్చింది మాత్రం బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించినవారికే. మరోవైపు, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే విడుదల చేసిన గ్రూప్స్ పోస్టుల భర్తీ ప్రక్రియ అక్రమాల సుడిగుండంలో చిక్కుకున్నది. ఈ కారణంగానే ఇంకా నియామక పత్రాలు ఇవ్వడం లేదు. ‘మాకు నియామక పత్రాలు ఇవ్వండి సారూ..’ అని గ్రూప్-1కు ఎంపికైన అభ్యర్థులు, ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసి ఉద్యోగ నియామకాలు చేపట్టాలని నిరుద్యోగులు ఆందోళన బాటపడుతున్నారు.
ఉద్యోగ నియామకాలంటే ఖాళీల వివరాలను సేకరించి, నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులను స్వీకరించి, పరీక్షలు పెట్టి, అభ్యర్థులను ఎంపిక చేసి ఆ తర్వాత నియామక పత్రాలను ఇవ్వడమన్న విషయాన్ని మన ముఖ్యమంత్రికి ఎవరైనా చెప్తే బాగుండు. ‘ఏ దొడ్లో కడితే ఏంది, మన దొడ్లో ఈనితే చాలు అన్నట్టు’ బీఆర్ఎస్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు తమ ప్రభుత్వం వచ్చాక నియామక పత్రాలిచ్చి.. రేవంత్ అదంతా తమ గొప్పేనని ప్రచారం చేసుకుంటున్నారు.
ఇకనైనా ఆ అబద్ధపు ప్రచారాన్ని ఆపి ఉద్యోగ నియామకాలపై సీరియస్‌గా దృష్టిపెడితే బాగుంటుం ది. ఎందుకంటే, చెప్పిందల్లా నమ్మడానికి, చెవిలో పూలు పెట్టించుకోవడానికి అక్కడున్నది కాంగ్రెస్ కార్యకర్తలు కాదు, గ్రాడ్యుయేట్లు. అవునూ… రేవంత్ ప్రభుత్వానికి ఈ సందర్భంగా మరో ముఖ్యమైన విషయం చెప్పదలచుకున్నా.. ఈ నెల నాలుగున నిరుద్యోగ యువకులు ‘ఛలో సెక్రటేరియట్’ నిరసన కార్యక్రమం పెట్టుకున్నరట మరి, జర జాగ్రత్త.