తెలంగాణ రాష్ట్రంలో అధికారం కోసం వెంపర్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. అధికార పగ్గాల కోసం జనాలకు అబద్ధపు కల్లబొల్లి మాటలు చెప్పి అయోమయంలో పెడుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై విషం చిమ్మి వారి నైజాన్ని చాటుకుంటున్నది. గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నది.
రాష్ర్టాభివృద్ధి, సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే, వాటిని చూసి దేశమంతా అబ్బురపడుతున్నది. ఇతర రాష్ర్టాలు ఇక్కడి సంక్షేమ పథకాలను తమ రాష్ట్రంలో అమలు చేస్తున్నాయి. దేశంలోని మిగతా రాష్ర్టాలకు మన అభివృద్ధి కనబడుతుంటే కాంగ్రెస్ పార్టీ నాయకులకు మాత్రం కనపడటం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ఈ దశాబ్ద కాలంలోనే శతాబ్ద కాలానికి సరిపడా అభివృద్ధి జరిగింది. ఇలాంటి అభివృద్ధి చూసి కాంగ్రెస్ నేతలకు ఇక పుట్టగతులు ఉండవని పచ్చని తెలంగాణలో చిచ్చుపెట్టేలాగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో తలెత్తుకుని తెలంగాణ ప్రజలు జీవిస్తుంటే ఈ కాంగ్రెస్ నాయకులు వచ్చి ఢిల్లీ పెద్దలకు గులాం చేసే కుతంత్రాలు చేస్తున్నారు. 60 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో అణచివేతలకు, అవమానాలకు గురైన తెలంగాణ ప్రజలు నేడు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు.
కాంగ్రెస్ నాయకులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో గానీ, రాష్ట్రం ఏర్పడిన తర్వాత గానీ ఏ ఒక్క రోజు ఈ ప్రాంతానికి ఉపయోగపడే మంచి మాటలు మాట్లాడింది లేదు. తెలంగాణ ప్రజల సంతోషంలో భాగం కాకపోయినా పర్వాలేదు. కానీ వారి సంతోషాన్ని ఓర్వలేని పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులున్నారు. మొదటి నుంచే తెలంగాణ రాష్ర్టాన్ని విఫలయత్నంగా చిత్రీకరించే కుతంత్రంలో చంద్రబాబు నాయుడు మోచేయి నీళ్లు తాగే రేవంత్ రెడ్డి ప్రయత్నించాడు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్‌ను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అధ్యక్ష పదవి ఇచ్చి కట్టబెట్టారంటేనే వారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతున్నది. ఇప్పటికీ రాష్ర్టానికి హక్కుగా రావలసిన నిధులు, ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడింది లేదు. తెలంగాణ ఏర్పాటు నుంచే ఈ ప్రాంతం మీద వివక్ష చూపిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన దాఖలాలు కూడా లేవు.
ఉమ్మడి రాష్ట్రంలో పదవులు అనుభవించిన నాయకులకు అధికారం కావాలి తప్ప ఇక్కడి ప్రజల సమస్యల పరిష్కారం, అభివృద్ధి అక్కర్లేదు. ప్రభుత్వం ఏం చేసినా గుడ్డిగా వ్యతిరేకించడమే పనిగా పెట్టుకున్నారు. కండ్ల ముందు అభివృద్ధి కనిపిస్తున్నా కండ్లుండి చూడలేని కబోదుల్లా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల సమయంలో వచ్చి అధికారం కావాలని ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే తమకు అధికారం దక్కితే సెక్రటేరియట్ కూల్చుతాం, ప్రగతి భవన్ పేల్చేస్తాం, ధరణి రద్దు చేస్తాం, 24 గంటల కరెంటు రద్దుచేసి కేవలం మూడు గంటల కరెంట్ ఇస్తాం. అని చెప్పుకోవడం తప్ప రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు చేస్తామనే హామీలు మాత్రం ఇవ్వడం లేదు కాంగ్రెస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులను స్మరించుకోవడం కోసం కీర్తి స్తూపాన్ని నిర్మించుకుంటే దాని మీద కూడా విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారు.తాము అధికారంలోకి వస్తే ధరణి పోర్టల్ రద్దు చేస్తామని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రైతుబంధు, రైతుబీమా ఎలా ఇస్తారో తెలపాలి.
కాంగ్రెస్ కండ్ల మంటతనం కాళేశ్వరాన్ని కూడా వదల్లేదు. తెలంగాణలోని వ్యవసాయానికి కేంద్ర బిందువు అయినటువంటి కాళేశ్వరం మీద కాంగ్రెస్ కుట్రలు అన్ని ఇన్ని కావు, ప్రాజెక్టు పూర్తికాకుండా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఆ పార్టీ చేయని ప్రయత్నం లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని స్వయానా రాహుల్‌గాంధీ మాట్లాడటం ఆయన అమాయకత్వానికి నిదర్శనం.
కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ఎందుకు కరువుతో విలవిలలాడిందో చెప్పగలరా? చెరువుల్లో నీళ్లు లేక పంటలు పండక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉన్న విషయం నిజం కాదా? ఉపాధి లేక తెలంగాణ యువత ముంబాయి, దుబాయ్ వలసలు వెళ్లింది నిజం కాదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం మీలో ఒక్కరికైనా ఉందా? కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అంధకారంలోకి నెట్టి వేయబడ్డది. పవర్‌కట్‌లతో వేలాది కంపెనీలు మూతపడ్డాయి. లక్షలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. కొత్త పెట్టుబడులు రాష్ర్టానికి రాలేదు. ఇంకోవైపు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ ఇంకా అంధకారంలోకి పోతుందని సీమాంధ్ర నాయకులు భయపెట్టారు. కానీ కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ అతి కొద్ది రోజుల్లోనే తెలంగాణ విద్యుత్తు సమస్యను పరిష్కరించారు. ఇప్పుడు 24 గంటల కరెంటుతో రాష్ట్రంలో వెలుగులు నిండాయి.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్తున్నది. 50 ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ప్రకటించిన పథకాల్లో ఏ ఒక్క దాన్నైనా దేశంలో ఏ రాష్ట్రంలోనైనా అమలు చేసిందా? అసలు హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్న నాటి నుంచి అడుగడుగునా దగా చేసింది కాంగ్రెస్ పార్టీనే. తెలంగాణను సమైక్య సంకెళ్లలో బందీ చేసిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీది. తమ హక్కుల కోసం అభివృద్ధి కోసం, నీళ్ల కోసం కోసం పోరాడిన తెలంగాణ వాదులను నక్సలైట్ల పేరిట పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ పార్టీనే. 1969లో పెద్దమనుషుల ఒప్పందం పేరుతో ఉద్యమానికి దొంగ దెబ్బ కొట్టి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్ర ఉద్యమం సాగుతుంటే సీమాంధ్ర నేతలతో కుమ్మక్కై ఉద్యమాన్ని దెబ్బతీయాలని చూసింది కాంగ్రెస్ పార్టీనే. 1200కు పైగా యువకులు ఆత్మహత్యలకు పాల్పడి అమరులైంది కాంగ్రెస్ పార్టీ మూలంగానే కదా? అందుకే తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష. విపక్షాల మాట నమ్మి మోసపోతే గోస పడటం ఖాయం.
-జి. రాజేష్‌నాయక్
96035 79115