నిరుద్యోగుల ఆశల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మళ్లీ అదే నిరుద్యోగుల శాపానికి పతనమయ్యే స్థితికి చేరుకున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2025 ఆగస్టు 2తో జాబ్‌లెస్ క్యాలెండర్‌గా ఏడాది పూర్తిచేసుకున్నది. తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఉత్తర ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగుల పక్షాన కనీసం ఒక్కసారి కూడా గొంతు విప్పకపోవడం కడు శోచనీయం.
గత కేసీఆర్ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లు, పెట్టిన పరీక్షలకు ఫలితాలు ఇచ్చారు తప్పితే అంతుకుమించి ఒరగబెట్టిందేమీ లేదని నిరుద్యోగ యువకులు గగ్గోలు పెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే దగా, మోసం అని మరోసారి రుజువు చేసింద ని వాళ్లు వాపోతున్నారు. కాంగ్రెస్ అంటే నే.. కాలయాపనలు, కాంగ్రెస్ అంటేనే… కమిటీ లు అని పాపం వారికి ఆలస్యంగా అర్థమైంది.
కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవసరం ఉంటే నిరుద్యోగులతో బస్సు యాత్ర చేయిస్తారు. నోటిఫికేషన్లపై కేసులు వేయిస్తారు. దొంగ హామీలు ఇస్తరు. వాటిని నమ్మించడానికి ఢిల్లీ నాయకులనూ గల్లీకి తీసుకొస్తారు. అధికారంలోకి వచ్చినాక ఉద్యోగాలని అడిగితే మాత్రం కేసులు పెట్టి వేధిస్తారు. గతంలో, పీసీసీ అధ్యక్షుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగులను ఉద్దేశించి మీకు ఉద్యోగాలు రావాలంటే ముగ్గురి (కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు) ఉద్యోగాలు ఊడబీకాలని ఊకదంపుడు ఉపన్యాసాలిచ్చారు. ఇప్పుడు తను మూడు ముఖ్య పదవులు (ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, హోం మంత్రి) అనుభవిస్తూ నిరుద్యోగులను నీచం గా చూస్తున్నాడు. ఉద్యోగాలు లేక ఒక దిక్కు నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ‘నోటిఫికేషన్లు వద్దని నిరుద్యోగ అభ్యర్థులే అంటున్నారు’ అని సాక్షాత్తు ముఖ్యమంత్రిగా అబద్ధాలు ఆడటం రేవంత్ రెడ్డికే చెల్లింది.
యూపీఎస్సీ లాంటి జాతీయ పరీక్షల్లో తెలుగు అభ్యర్థులకు న్యాయం జరిగితే, తెలంగాణలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు గ్రూప్-1లో నష్టం వాటిల్లింది. దీనిపై కోర్టుకు వెళ్తే ప్రిలిమ్స్‌లో తెలుగు అకాడమీ తప్పు అంటూ, మెయిన్స్‌పై తెలంగాణ నిరుద్యోగులకు తెలుగు రాదని న్యాయవాదులు వాదించడం సిగ్గుచేటు. గ్రూప్-2 అభ్యర్థులు పోస్టులు పెంచాలంటే ప్రభుత్వం వాయిదా వేసింది. డీఎస్సీ అభ్యర్థులు వాయిదా వేయమంటే పరీక్ష పెట్టింది. గురుకులాలలో పోస్టులు నింపమంటే ‘యంగ్ ఇండియా నా బ్రాండ్’ అంటున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఒకటి చెప్తే, మరొకటి అర్థమవుతుందని నిరుద్యోగులు వాపోతున్నారు.
రోజురోజుకూ నిరుద్యోగ యువత వయస్సు పెరిగిపోతున్నది. ఇంటికి వెళ్లలేక, హైదరాబాద్‌లో ఉండలేక.. పెండ్లి చేసుకోలేక, చదువుపై మమకారం చంపుకోలేక జీవన్మరణ సమస్య ఎదుర్కొంటున్నది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ నిరుద్యోగులు ఆగ్రహం చూపిస్తే, రాష్ట్రంలో ఆ పార్టీ పత్తా ఉండదు. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయాలి. లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు.
(వ్యాసకర్త: ఓయూ విద్యార్థి నాయకుడు)
-తుంగ బాలు
99859 30246