‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనేది అక్షరాల నిజం. భోగ భాగ్యాలను కలుగజేసే సిరిసంపదలు ఆరోగ్యవంతమైన సమాజం ముందు దిగదుడుపే. ఆరోగ్యానికి ఎన్ని సంపదలైనా సాటిరావు. అందుకే రాష్ట్రంలో సామాన్య ప్రజలకు సైతం సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చి అందరికీ ఆరోగ్య భాగ్యం కలిగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండటం ఆహ్వానించదగిన పరిణామం.
గతంలో అరకొర వసతులు, సిబ్బంది కొరతతో ప్రజలకు సరైన వైద్యం అందేది కాదు. దీంతో ప్రభుత్వ దవాఖానలంటే ప్రజలకు నమ్మకం ఉండేది కాదు. అందుకే చిన్న జ్వరం వచ్చినా ప్రైవేట్ దవాఖాననే ఆశ్రయించేవారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్రంలోని వైద్యరంగం పరిస్థితి పూర్తిగా మారింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెరిగింది. రోజురోజుకు దవాఖానాల్లో పెరుగుతున్న ఔట్ పేషెంట్ సేవలే నిదర్శనం. ఆరోగ్య తెలంగాణ సాధనలో భాగంగా ‘హెల్త్ ఫర్ ఎవ్రీ ఏజ్.. హెల్త్ ఎట్ ఎవ్రీ స్టేజ్’ అనే నినాదంతో అన్ని వయస్సుల వారికి ఉత్తమ వైద్య సేవలందిస్తున్నారు. అందుకు అనుగుణంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ‘ఇల్లాలు ఆరోగ్యమే ఇంటికి వెలుగు’ అని భావిస్తున్నారు. ప్రతి మహిళ ఆరోగ్యంతో ఉండాలనే లక్ష్యంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘ఆరోగ్య మహిళా పథకాన్ని’ ప్రారంభిస్తుండటం అభినందనీయం.
ఈ పథకం మహిళలకు వరం లాంటిది. ఇందులో భాగంగా ప్రభుత్వం మహిళలకు ఎనిమిది రకాల పరీక్షలు చేయనున్నది. అయితే మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల రేటు 30 నుంచి 61 శాతానికి పెరిగింది. మాతృ మరణాల రేటు 92 నుంచి 43కు, శిశు మరణాల రేటు 39 నుంచి 21 శాతానికి తగ్గింది. ఆరోగ్యరంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్న చిత్తశుద్ధికి ఈ పథకాలే నిలువెత్తు నిదర్శనం. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పుల వల్ల నేడు రాష్ట్రం ఆరోగ్య తెలంగాణ దిశగా దూసుకువెళ్తున్నది.
(వ్యాసకర్త: రాష్ట్ర దివ్యాంగుల సహకార సంస్థ చైర్మన్)
-డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
95530 86666