22 ఏండ్ల కిందట ఉమ్మడి పాలమూరు జిల్లాలో అప్పటి ముఖ్య మంత్రి చంద్రబాబు ఫార్మా కంపెనీల కోసం చేసిన దుర్మార్గపు భూసేకరణ వల్ల వందల మంది దళిత, గిరిజనులు తమ ఇండ్లను, భూమిని, జీవనోపాధిని, సర్వస్వాన్నీ కోల్పోయారు. ఇప్పుడు ఆయన శిష్యుడి వంతు వచ్చింది. రెండుసార్లూ ఫార్మా కంపెనీల కోసమే భూ సేకరణ. రెండు సార్లూ దళిత, గిరిజనులే బాధితులు. రెం డు సందర్భాల్లో అదే పోలీసు దాష్టీకాలు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయ మేమంటే.. రెండుచోట్లా భూ సేకరణ బాధిత గ్రామాల్లో పోలేపల్లి అనే పేరు గల ఊరు ఉండటం. రెండు చోట్లా ప్రజలు తిరగబడి తమ హక్కుల కోసం నినదించారు. అంటే చరిత్ర పునరావృతమవుతున్నదా?
చంద్రబాబు హయాంలో 2002లో నేషనల్ హైవే 7 (హైదరాబాద్-బెంగళూరు) పక్కనే ఉన్న సుమారు వెయ్యి ఎకరాల భూమి మీద ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. శంషాబాద్‌లో కొత్తగా నిర్మించతలపెట్టిన విమానాశ్రయానికి దగ్గరగా, జడ్చర్ల రైల్వేలైనుకు కూతవేటు దూరంలో అన్నివిధాలా అనుకూలంగా ఉన్న ఈ భూమి పారిశ్రామికవేత్తలకు బంగారంతో సమా నం. ఇంకేముంది రాత్రికి రాత్రే ఈ భూమిని కాజేసేందుకు కుట్రలు రచించారు. ఈ భూముల్లో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ నెలకొల్పుతామని నోటిఫికేషన్లో తెలిపారు. పోలేపల్లి, గుండ్లగడ్డ తాండా, ముదిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన సుమారు వెయ్యి ఎకరాల సేకరణకు నోటిఫికేషన్ వస్తే అందులో భూమి కోల్పోతున్న రైతులందరూ బహుజనులే కావడం యాదృచ్ఛికం కానే కాదు. ఇందులో 320 బాధిత కుటుంబాలుండగా అత్యధికులు దళితులు, గిరిజనులే.
నిరక్షరాస్యులైన ఈ పేదల నుంచి బెదిరించి వెయ్యి ఎకరాల భూమికి కేవలం ఎకరానికి రూ.16,000 నుంచి రూ.18,000 వరకు చెల్లించి బలవంతంగా లాక్కున్నది. ఇంతలో ప్రభుత్వం మారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయినా ఆ బాధితులకు న్యాయం జరగలేదు. 2006 నుంచి 2008 ప్రాంతంలో ఈ భూములు ఎకరానికి రూ.40 లక్షల చొప్పున అధిక ధరకు ప్రైవేటు కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం అమ్ముకోజూసినప్పుడు అక్కడి ప్రజలు మరోసారి ఉద్యమించారు. ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ దళారీగా మారి ఏండ్లకిందట అగ్గువకు లాక్కున్న భూములు ఇప్పుడు ఫార్మా కంపెనీలకు అధిక ధరకు అమ్ముకోవడం అన్యాయమని వారు తిరగబడ్డారు. మధు కాగుల, సుజాత సూరేపల్లి తదితర ఉద్యమకారులు ఆ పోరాటానికి అండగా నిలబడ్డారు. ప్రొఫెసర్ బాలగోపాల్ ఆయా ఊళ్లకు వెళ్లి వారి పోరాటానికి సంఘీబావం ప్రకటించారు. అప్పుడప్పుడే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన సినీనటుడు చిరంజీవి కూడా పోలేపల్లిని సందర్శించారు. ఈ పోరాటాల ఫలితంగా ఆ బాధితులకు ఇండ్ల స్థలాల రూపంలో స్వల్ప ప్రయోజనం కలిగింది. కానీ, భూములు మాత్రం వెనక్కి రాలేదు.
పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలోని కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలో లగచర్ల, పోలేపల్లి, దుద్యాల, రోటిబండ తండా గ్రామాల్లో ఫార్మా విలేజ్ పేరిట 1,350 ఎకరాల భూమిని సేకరించాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆ ప్రాంత ప్రజలు తమ నెత్తి మీద పిడుగుపడ్డట్టుగా భయకంపితులయ్యారు. ఫార్మా కంపెనీలు వస్తే గాలి, నీరు, భూమి మొత్తం కాలుష్యమయమై తమ పిల్లలకు భవిష్యత్తు ఉండదని వారికి అర్థమైంది. తమ పూర్వీకుల నుంచి ఏకైక ఆదరువుగా వస్తున్న ఈ భూమిని లాక్కుంటే తమ పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు అరణ్య రోదనలయ్యాయి. కాంగ్రెస్‌కు, రేవంత్‌కు మెజారిటీ ఓట్లేసిన ప్రాంతం ఇది. అందుకే స్థానిక నాయకత్వం ద్వారా తమ గోడు వెళ్లబోసుకునేందుకు ప్రయత్నించారు. సొంత నియోజకవర్గమైనా ఈ ప్రాంత ప్రజలతో చర్చలు జరిపి, వారిని ఒప్పించే ప్రయత్నం రేవంత్ గాని, అతని తరఫున ఇంకెవరూ కాని నేటివరకూ చేయకపోవడం విస్మయం కలిగించే విషయం. ఉల్టా రేవంత్ సోదరుడు ఈ ప్రాంత రైతులను అసభ్యకరమైన భాషలో బెదిరిస్తున్న ఫోన్‌కాల్ రికార్డింగ్ ఒకటి చక్కర్లు కొడుతున్నది.
నవంబర్ 11న జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఇతర ఉన్నతాధికారులు లగచర్లలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లినప్పుడు సహనం కోల్పోయిన స్థానిక గిరిజన రైతులు వారిమీద తిరగబడ్డారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనమైంది. అయితే ఇంత వ్యతిరేకత వచ్చినా తీరు మార్చుకోవలసిన రేవంత్ ప్రభుత్వం తిరుగుబాటును అణచివేయాలనున్నది. అందుకే అదే రోజు అర్ధరాత్రి వందల మంది మఫ్టీ పోలీసులు, కాంగ్రెస్ గూండాలు ఆ ఊరిమీద పడి కరెంటు తీసేశారు. ఇండ్ల తలుపులు పగలగొట్టి, మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. సుమారు 30 మంది రైతులను పోలీసులు అరెస్ట్ చేశా రు. అంతేకాదు, వారిని చిత్రహింసలూ పెట్టారు.
ఈ తిరుగుబాటు వెనుక కేటీఆర్, బీఆర్ఎస్ పార్టీ కుట్ర ఉన్నదనే ఒక తప్పుడు కేసు పెట్టి మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టారు. ప్రభుత్వ దమనకాండకు దీటుగా స్పందించిన బీఆర్ఎస్ నాయకత్వం లగచర్ల బాధితులకు అండగా నిలిచింది. వారికి అవసరమైన న్యాయసహాయం అందిస్తున్నది. కాగా, లగచర్ల బాధితులు హైదరాబాద్‌కు వచ్చి రాష్ట్ర ఎస్టీ కమిషన్ ముందు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అంతేకాదు, జాతీయ మానవహక్కుల కమిషన్‌కు, జాతీయ ఎస్సీ/ఎస్టీ కమిషన్‌కు రాష్ట్ర ప్రభుత్వం జరుపుతున్న దమనకాండకు సంబంధించి ఒక విజ్ఞాపన పత్రం ఇచ్చారు. ఢిల్లీలో జాతీయ మీడియాను ఉద్దేశించి కూడా తమ కష్టాలు చెప్పుకొన్నారు.
లగచర్ల, పోలేపల్లి, దుద్యాల, రోటిబండ తండా పరిసర గ్రామాల గిరిజన రైతులు, వారి కుటుంబసభ్యుల్లో అత్యధికులు నిరక్షరాస్యులు కావొచ్చు. అయి నా, వారు కొన్ని మౌలికమైన ప్రశ్నలు వేస్తున్నారు. ‘రేవంత్ రెడ్డికి నిజంగా కొడంగల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉంటే ఇక్కడ ఒక స్కూల్, లేదా కాలేజీ పెట్టొచ్చు కదా?’ అని ఒక వృద్ధురాలు ప్రశ్నించింది. ఇంకో మహిళ అయితే చాలా ఆవేశంగా ‘గెట్టు దగ్గర ఇంచు భూమి గురించి పంచాయితీ అయి తే అన్నాదమ్ములమే తలకాయలు పలగ్గొట్టుకుంటం సార్. మధ్యల ఈ గవర్నమెంటోడు ఎవడు. వానికి మా భూములు గుంజుకునే హక్కెక్కడిది? సావనైనా సస్తం కానీ, మా భూములు మాత్రం ఇడిసేది లేదు’ అన్నది.
20 ఏండ్ల కిందట ఒక పోలేపల్లి, దాని పరిసర గ్రామాలు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం చేసిన మోసానికి బలైనయి. ఆనాడు వారికి అండగా నిలిచే బలమైన నాయకత్వం లేకపోవడంతో వారి పోరాటం విఫల మైంది. ఇప్పుడు ఆయన శిష్యుడు రేవంత్‌రెడ్డి మోసానికి బలవడానికి మరో పోలేపల్లి, దాని పరిసర గ్రామాల ప్రజలు సిద్ధంగా లేరు. వీరి పోరాటానికి అండగా నిలబడటానికి బీఆర్ఎస్ నాయకత్వం ఉన్నది. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా లగచర్ల-పోలేపల్లి పరిసర గ్రామాల దళిత, గిరిజన రైతుల పోరాటం విజయవంతం కావాలని ఆశిద్దాం.
(వ్యాసకర్త: రాష్ట్ర డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్)
– కొణతం దిలీప్