గత నవంబర్‌లో రాష్ట్రమంతా కన్నీరుమున్నీరైంది. రేవంత్ నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు లగచర్ల గిరిజన రైతుల మీద దాడులు చేయించడమే అందుకు కారణం. పచ్చని పంట పొలాలను లాక్కుని తన కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీలకు కట్టబెట్టడానికి రేవంత్ రెడ్డి సిద్ధపడ్డడు. ఈ క్రమంలో భూసేకరణను వ్యతిరేకించిన గిరిజన రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించారు. అంతటితో ఆగకుండా ఆ గిరిజన గ్రామమంతా గాఢ నిద్రలో ఉండగా అర్ధరాత్రి పూట పోలీసులతో కర్కశ కవాతు చేయించారు. గిరిజన మహిళలపై దాడి జరిగింది. అర్ధరాత్రి వేళ భయభ్రాంతులకు గురిచేస్తూ భూములివ్వాలని బెదిరిస్తూ మహిళలు అని కూడా చూడకుండా దాడులకు తెగబడ్డారు. సోనీ బాయి, శాంతి బాయి, జ్యోతి అనే తొమ్మిది నెలల నిండు గర్భిణితో పాటు చాలా మంది మహిళలను అసభ్యకరంగా తాకుతూ హింసించిన పరిస్థితిని చూసి రాష్ట్రమంతా ఖండించింది.
సావడానికైనా సిద్ధం కానీ, భూములు ఇచ్చేది లేదని, పచ్చని పంట పొలాలను ఫార్మా కంపెనీలకు అప్పగిస్తే తామెట్ల బతుకాల్నని ప్రశ్నించారు ఆ గిరిజన రైతులు. భూముల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించి, మద్దతు కోరుతూ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్ మెట్లెక్కారు. జ్యోతితో పాటు చాలామంది గిరిజన మహిళలు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. తోబుట్టువుల్లా ఆదరించి వారి తరఫున తాను పోరాడుతానని కేటీఆర్ అభయమిచ్చారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పోరాడే బాధ్యత తనదేనని యావత్ బీఆర్ఎస్ పార్టీ తమ వెంట ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. అప్పటికే అరెస్టయి జైల్లో ఉన్న వాళ్ల కుటుంబ సభ్యులకు జైలు నుంచి విముక్తి కలిగించేందుకు పార్టీ తరఫున లీగల్ సహాయం అందించారు. అంతేకాదు, సంగారెడ్డి జైల్లో ఉన్న రైతులందరినీ స్వయంగా కలిసి ధైర్యం చెప్పారు. లగచర్ల గిరిజన మహిళలపై ప్రభుత్వం చేసిన దాడిని ఖండిస్తూ, వాళ్లందరినీ తీసుకొని స్వయంగా ఢిల్లీలోని జాతీయ మహిళా కమిషన్, జాతీయ గిరిజన సంక్షేమ కమిషన్‌తో పాటుగా జాతీయ మానవ హక్కుల కమిషన్ల ముందుంచారు. గిరిజన బిడ్డలకు న్యాయం చేయాలని కోరుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులను ఢిల్లీ వేదికగా యావత్ ప్రపంచానికి తెలియజేశారు.
కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోరాటంతో కాంగ్రెస్ ప్రభుత్వం దిగి వచ్చింది. 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాలకు సంబంధించిన భూసేకరణను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ గిరిజన రైతులు కేసీఆర్, కేటీఆర్, పట్నం నరేందర్‌రెడ్డిలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు.
భూ పోరాటంలో తమకు అండగా నిలబడిన కేటీఆర్‌ను గిరిజనులు మరువలేదు. పోరాట సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతి ఆ తర్వాత పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు నామకరణం చేయాలని కేటీఆర్‌ను జ్యోతి ఆహ్వానించింది. భూ పోరాటంలో పుట్టిన ఆ బిడ్డకు ఇస్లావత్ ‘భూమి’ నాయక్ అని కేటీఆర్ నామకరణం చేసి వారి భూ పోరాటాన్ని చరిత్రలో శాశ్వత స్థానం కల్పించారు. ఆపత్కాలంలో తమకు అండగా నిలబడి, తమ కుటుంబ సభ్యులను, భూములను కాపాడిన రామన్నకు ఆ గిరిజన బిడ్డలు స్వయంగా రాఖీ కట్టడం విశేషం. లగచర్లకు చెందిన గిరిజన మహిళలు హైదరాబాద్‌లోని కేటీఆర్ నివాసానికి వచ్చి, రక్షణగా నిలబడిన రామన్నకు రక్షాబంధన్ సందర్భంగా రాఖీలు కట్టి అన్నాచెల్లెళ్ల బంధాన్ని మరింతగా పెంపొందించుకున్నారు. రామన్న లాంటి నాయకుడు ఉండటం బీఆర్ఎస్ పార్టీతో పాటు యావత్ తెలంగాణకు గర్వకారణమని చెప్పవచ్చు.
-నిఖిల్ అల్లేని
96666 51215