Kumram Bheem | జోడెఘాట్లో నాటి నిజాం బలగాలతో తలపడిన గోండు అమరవీరుడు కుమ్రంభీం చుట్టూ ఎన్నో కథనాలు, కల్పనలు అల్లుకున్నాయి. వాటిని ఛేదించే ప్రయాణంలో నేను భీం సతీమణి సోంబాయిని కలిసి మాట్లాడాను. అలాగే అప్పటి కలెక్టర్ (అవ్వల్ తాలూక్దార్) అబ్దుల్ సత్తార్ నివేదికలను పరిశోధించాను. వాటి ఆధారంగా రాసిన ఈ వ్యాసం ద్వారా కుమ్రంభీం వ్యక్తిత్వం, నాడు జరిగిన వాస్తవాలపై కొంత స్పష్టత వస్తుందని భావిస్తున్నాను.
కుమ్రం భీం దాదాపుగా 1901లో పుట్టి ఉంటాడు. భీం సాధారణ శరీర సౌష్ఠవం, మామూలు ఎత్తు కలిగిన వ్యక్తి. ఆయన చదువుకున్నాడు. తెలుగు, ఉర్దూ రెండు భాషలు చదవడం, రాయడం ఆయనకు వచ్చు.
గోండులు అతనిని ఎంతో గౌరవించేవారు. భీం వృత్తిరీత్యా రైతు. ఇతర రైతుల మాదిరిగా భూమినే నమ్ముకుని పగలు, రాత్రి శ్రమించేవాడు. భీం దైవభక్తి గలవాడు. గోండు దేవతలను నిత్యం పూజించేవాడు. ముస్లింల పట్ల ద్వేషం, వైరం ఎన్నడూ ప్రదర్శించేవాడు కాదు. తన తోటి గోండులలా భీం ఎన్నడూ అణగిమణిగి ఉండలేదు. అందుకే తగిన కారణం లేకుండా సిద్దిఖీ దాడి చేసినప్పుడు దెబ్బకు దెబ్బ తీశాడు. భీం చేతిలో చావుదెబ్బలు తిన్న సిద్ధిఖీ, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాళ్లకు పనిచెప్పాడు. అణచివేతకు లొంగే తత్వం భీంలో ఏ కోశానా లేదు. అందుకే అటవీశాఖ అధికారులు బాబాజరీలో గోండుల గుడిసెలకు నిప్పు పెట్టి, వారి పొలాలు ధ్వంసం చేసినప్పుడు భీం ఎదురు తిరిగాడు. భీం దూకుడుకు అటవీ శాఖ అధికారులు తోకముడవక తప్పలేదు. భీం మోచేతి నీళ్లు తాగే రకం కాదు. అవినీతి అధికారులను చూసి అతడు ఎన్నడూ బెదరలేదు.
భీం మూఢ నమ్మకాలను విశ్వసిస్తాడని అతడి గురించి ప్రచారం జరిగింది. భీం నాస్తికుడు కాదు. అతడు తన దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజించేవాడు. తన తెగకు చెందిన అన్నిరకాల కర్మ- కాండలలోనూ పాల్గొనేవాడు. అయితే, అతనికి మూఢ నమ్మకాలు లేవు. యుద్ధానికి ముందురోజు, వందలమంది గోండులు గుమిగూడిన సభలో అతను ప్రసంగించాడు. పోరుకు ముందుకు దూకలేని పిరికివాళ్లు, ప్రాణభయం ఉన్నవాళ్లు వెనక్కి తిరిగి వెళ్లిపోవచ్చని అందరిముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పాడు. భీం దగ్గర కొన్ని అతీంద్రియశక్తులు, మంత్రశక్తులున్నాయని అతని గురించి కొమరం సూరు చెప్పిన కథలలో ఉన్నది. కానీ, అతని దగ్గర ఆ శక్తులున్నాయని అతని అనుచరులూ నమ్మలేదు.
యుద్ధానికి ముందుకు కదులుతున్నప్పుడు, గోండులు తమని ఏదో మానవాతీత శక్తి ఆవహించి కదుపుతున్నట్టు కదులుతారు. అది ఒక రకమైన మంత్రంతో ముగ్ధులై ముందుకు కదిలినట్టు. దానివల్లే భీంకి అతీంద్రియ శక్తులున్నాయని వదంతులు వ్యాపించాయి. వీటిని పోలీసు కానిస్టేబుళ్లు కూడా నమ్మేవారు. ‘నేను చావుకు సిద్ధపడే వచ్చానని’ భీం ఎలుగెత్తి అరిచేవాడు. చేతిలో ఏ ఆయుధం లేకుండా కుమ్రం భీం నిజాం సైనికుల మీదికి యుద్ధానికి ముందుకు దూకాడని ఒక కథనం ఉంది. చేతిలో ఏ ఆయుధం లేకుండా భీం తమ వైపు సుడిగాలిలా దూసుకువచ్చాడన్నది పచ్చి అబద్ధం. భీం పుట్టుకతోనే యోధుడు. అతడు రాజగోండు.
బాబాజరిలో భీం తన శత్రువుపై మెరుపుదాడి చేశాడు. ఇటువంటి గెరిల్లా తరహా దాడులు కేవలం కాకలు తీరిన యుద్ధవీరులే చేస్తారు. ఒక వీరుడు శత్రు సైన్యాన్ని ఎప్పుడూ తక్కువగా అంచనా వేయడు. భీం కూడా అంతే. అందుకే ఇతర బలవంతులైన గోండుల సహాయ సహకారాల కోసం భీం తన దూతలను వారి దగ్గరికి పంపించినట్టు తెలుస్తున్నది. పంగడి రాజు దగ్గరికి వెళ్లి భీం దూతలైన జాకో, కుమారలింగ, భీం సందేశం వినిపిస్తారు. ప్రాణాలకు తెగించిన దాదాపు 500 మంది గోండులు చేతికి అందిన ఆయుధాలను తీసుకుని జోడెఘాట్కి రావడానికి కారణం భీం వాస్తవిక యుద్ధనీతి, అతనిలోని యోధుడి లక్షణాలు, గోండు రాజ్యం స్థాపించాలనే అతని ఆశయం తప్ప మరొకటి కాదు.
జోడెఘాట్లో యుద్ధం జరిగినరోజు గాని, లేక ఆ మరుసటి రోజు గాని కుమ్రం భీం వీర మరణం పొందాడు. ఆయన 1940 అక్టోబర్ 8న చనిపోయాడని ఒక అభిప్రాయం ఉంది. జోడెఘాట్లో జరిగిన యుద్ధం గురించి వివరాలు 1940 అక్టోబర్ 7న ముషీర్-ఏ-డక్కన్లో వచ్చాయని, హోమ్ సెక్రటరీ మహ్మద్ అజర్ హసన్ (Esq)కు అబ్దుల్ సత్తార్ రాసిన ఉత్తరంలో ఉన్నది. అంతకుముందు అక్టోబర్ 6న కాశీనాథరావు వైద్య, సిరాజుల్ తిర్మియాజీ, ఎం.నరసింగరావు, రామాచారి వాస్తవ పరిస్థితులను పరిశీలించడానికి ఆసిఫాబాద్ వెళ్లారు. అదే రోజు రాజకీయ నాయకులు, హిందూ ప్రజామండలికి చెందినవారు కూడా వెళ్లారు. కాబట్టి, కుమ్రం భీం 1940 అక్టోబర్లో అమరుడయ్యాడనేది వాస్తవమే. కానీ, సరైన తేదీ 5వ తేదీ కంటే ముందే ఉంటుందనేది నా నమ్మకం.
(నేడు కుమ్రం భీం వర్ధంతి)
-ఎస్.ఎం.ప్రాణ్రావు
80089 50101