దశాబ్దం కిందనే తెలంగాణ కొత్త చరిత్రను రాసుకున్నది. మునుపటి గాయాలను మాన్పుకొనే ప్రయత్నం చేస్తున్నది. గత చరిత్రలో… గాయాలను మాన్పే చికిత్సలో జర్నలిస్టులు భాగస్వాములే. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో తెలంగాణ పేరు ఎత్తొద్దన్న మాట విన్న కలం కార్మికులు కలత చెందారు. తెలంగాణ ప్రాంతంలో మూడున్నర కోట్ల తెలంగాణ ప్రజలు ద్వితీయ శ్రేణి పౌరులుగా జీవనం సాగించడాన్ని జీర్ణించుకోలేని బుద్ధిజీవులు ప్రత్యక్ష ఉద్యమంలో భాగస్వాములు కావాలని నిర్ణయించుకున్నారు. అలాంటి పరిస్థితుల మధ్య తెలంగాణ జర్నలిస్టులు స్వయం పాలన కోసం ఉద్యమించడానికి కంకణబద్ధులయ్యారు.
‘తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు’ అనే ట్యాగ్‌లైన్‌తో 2001 మే 31న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష కోసం ‘తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం’ను స్థాపించారు. 14 ఏండ్ల మలిదశ ఉద్యమంలో అనేక సందర్భాల్లో ఉద్యమానికే టార్చ్ బేరర్ అయ్యారు. ఈ సంస్థ ఆవిర్భవించి 25 ఏండ్లు అయిన సందర్భంగా గతాన్ని ఓ సారి మననం చేసుకునే ప్రయత్నమే ఈ వ్యాసం.
తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పడిన సందర్భం రాజకీయంగా చాలా క్లిష్టమైనది. అప్పటికే కొంతమంది ప్రత్యేక తెలంగాణ కోసం వివిధ రూపాల్లో ఉద్యమాలు చేస్తున్నారు. నిర్బంధాలు ఎదుర్కొంటున్నారు. పట్టువదలకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు.
ఆ తర్వాత చరిత్రను మలుపు తిప్పిన ఘటన టీఆర్ఎస్ ఆవిర్భావం. దాంతో ఉద్యమానికి ఓ దిక్సూచి దొరికినట్టు అయ్యింది.
మేధో, సాహిత్య, సాంస్కృతిక రంగాల నుంచి కొంత మద్దతు దొరుకుతున్న సందర్భం. పలు ఆలోచనా స్రవంతులు కలిసి ఓ ప్రవాహం అవుతున్న నేపథ్యం. అదే సందర్భంలో కొద్దిమంది జర్నలిస్టుల సమాలోచనలతో ఈ సంస్థ ఏర్పడింది. తెలంగాణ లక్ష్య సాధనలో తనదైన ముద్ర వేసుకున్నది. చరిత్రలో తానూ ఓ భాగం అయ్యింది. తెలంగాణ రాష్ట్రం ఎందుకు? ఎవరి కోసం? స్వయం పాలన, ఆత్మగౌరవం తదితరాంశాలను వ్యక్తీకరిస్తూ తొలుత ఓ కరపత్రం వెలువరించింది ఈ ఫోరం. ఆ తర్వాత ఈ సంస్థే రాజకీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చింది. 2010-11 సంవత్సరాల్లో ఉస్మానియా యూనివర్సిటీలో నాటి ప్రభుత్వం చేసిన దమనకాండను ఖండించింది. అనుక్షణం విద్యార్థులకు అండగా నిలబడింది. సంస్థ అధ్యక్షులు అల్లం నారాయణ, చంటి క్రాంతి కిరణ్, పిట్టల శ్రీశైలం, కందుకూరి రమేష్ బాబు, రమణకుమార్, శశికాంత్, రాజేష్ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సంస్థతోపాటు మొదట్లో వందలాదిగా, తదనంతరం వేలాదిగా జర్నలిస్టులు కలిసి రాగా, నాటి ఉస్మానియా విద్యార్థులతో పాటు అనేక ఉద్యమ సంస్థలు కలిసి నడిచాయి. నిషేధాజ్ఞలు అమలవుతున్న సందర్భంలో, 144 తదితర సెక్షన్లు విధించిన నేపథ్యంలో ఉద్యమంలో ముందుభాగాన నిలబడ్డ జర్నలిస్టులు పోలీసుల లాఠీ దెబ్బలు రుచిచూడక తప్పలేదు. తెలంగాణ కోసం బలవన్మరణాలు జరుగుతున్న సందర్భంలో, ఉద్యమ వేడి కాస్త చల్లారిందనుకున్న సమయంలో జర్నలిస్టులు రాష్ట్ర రాజధానిలో కలం కవాతు చేశారు. ఉద్యమం బలాన్ని తమ గళం ద్వారా వినిపించారు. గన్ పార్క్ నుంచి ఆర్టీసీ కల్యాణమండపం వరకు దాదాపు 5 వేల మంది జర్నలిస్టులతో చేసిన ర్యాలీ అయినా, సుందరయ్య విజ్జాన కేంద్రం నుంచి ఇందిరాపార్క్ వరకు చేసిన ప్రదర్శన అయినా ప్రత్యేక రాష్ర్టోద్యమానికి ఊతం ఇవ్వడానికే.
సీమాంధ్ర నాయకత్వాల కింద ఉన్న తెలంగాణ ప్రజాప్రతినిధులచేత రాజీనామాలు చేయించి నాటి ఉద్యమ పార్టీలోకి వెళ్లేలా చేసింది టీజేఎఫ్. గద్దర్, కేసీఆర్‌లతో గొప్పగా టీజేఎఫ్ సమావేశం నిర్వహించింది. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి వచ్చిన సందర్భంలో దాదాపు 60 మంది మన ప్రజాప్రతినిధులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. తెలంగాణకు సంబంధించిన అన్ని పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎలా వ్యవహరించాలనే విషయమై సంధానకర్తగా వ్యవహరించింది కూడా తెలంగాణ జర్నలిస్ట్ ఫోరమే. తెలంగాణ వాయిస్ జాతీయ స్థాయిలో వినిపించేందుకు వేలాది మంది జర్నలిస్టులతో 2011 మే 17న ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించి దేశ రాజధానిలో జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేసి జాతీయస్థాయిలో తెలంగాణ ఉద్యమం తీవ్రతను చాటిచెప్పే ప్రయత్నం చేసిందీ టీజేఎఫ్. ఢిల్లీ స్థాయిలో జర్నలిస్టులు తమ ప్రాంత అస్తిత్వం కోసం, ఇంత పెద్దఎత్తున ఉద్యమించిన దాఖలా సమీప చరిత్రలో లేదనడం అతిశయోక్తి కాదేమో. రాజకీయ ఏకాభిప్రాయం సాధించేం దుకు సభలు, సమావేశాలు, మీడియా మీట్లు ఏర్పాటు చేసింది టీజేఎఫ్.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ప్రేరణగా పని చేసిన మిలియన్ మార్చ్, సాగరహారం వంటి కార్యక్రమాలకు వెన్నుదన్నుగా నిలబడింది టీజేఎఫ్. ఉద్యమం లో తమ వాహనాలకు నిప్పుపెట్టినా, కెమెరాలను బద్దలు కొట్టినా లెక్క చేయకుండా ముందు వరుసలో నిలబడ్డవారు జర్నలిస్టులు. దారులన్నీ దిగ్బంధనం చేసిన సం దర్భంలో ఉద్యమానికే దారి చూపించిందీ ఈ సంస్థే. టీజేఎఫ్ చేసిన కార్యక్రమాలన్నీ అంబేద్కర్ బాటలో నడిచాయి. బోధిం చు, సమీకరించు, పోరాడు. ఈ సూత్రా న్ని ఆధారంగా చేసుకొని ముందుకుసాగిం ది టీజేఎఫ్. క్షేత్రస్థాయిలో పనిచేసినవారు మాత్రమే కాదు, నాయకత్వ స్థానాల్లో ఉన్న దాదాపు అందరికి అందరూ బహుజనులే. జిల్లాల్లో కూడా ఉద్యమ నాయకత్వంలో ఉన్నవారు కూడా బహుజనులే. తెలంగాణలో అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి ఏర్పడ్డ జేఏసీ నియోజకవర్గ, జిల్లాల చైర్మన్లుగా ఎందరో జర్నలిస్టులు న్నారు. వాస్తవానికి అంతకుముందున్న జర్నలిస్టు సంఘాలకు, టీజేఎఫ్‌కు మౌలికంగానే చాలా వ్యత్యాసం ఉంది. పలు సామాజిక ఉద్యమాల నేపథ్యం నుంచి వచ్చినవారి ఆలోచన ఇందులో ప్రధానంగా ఉన్నది. ఈ సంస్థ ఏర్పాటు నుంచి స్వయంపాలన మొదలయ్యేంత వరకు కూడా చాలా చురుగ్గా పని చేసింది.
14 ఏండ్ల పోరాటం అనంతరం రాష్ట్రం ఏర్పడిన తర్వాత జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ సంఘంగా ఏర్పడింది. జర్నలిస్టుల కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో నాటి ప్రభుత్వం ద్వారా భారీ సంక్షేమ నిధిని కూడా ఏర్పాటు చేసింది.
జర్నలిస్టుల హక్కుల కోసమే కాకుండా తమ సామాజిక బాధ్యతను కూడా గుర్తించింది. చరిత్రలో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నది టీజేఎఫ్. సంస్థ ఏర్పాటై 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా హైదరాబాద్‌లోని జలవిహార్‌లో మే 31న జర్నలిస్టుల సభ జరుగనున్నది. మరోసారి ‘తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టులు’ అనే నినాదాన్ని గుర్తుచేసుకుంటూ ఎప్పటికీ తెలంగాణ ఆత్మగా ఈ సంస్థ ఉండాలని, ఉంటుందని భావిస్తూ…
– (వ్యాసకర్త: ప్రధాన కార్యదర్శి, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్)
అస్కాని మారుతీ సాగర్ 90107 56666