తెలంగాణ సాధన కోసం జరిగిన పోరాటం మానవ చరిత్రలో ఓ ప్రత్యేక అధ్యాయం. ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ, తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా రూపుదిద్దుకున్న తెలంగాణ తల్లి విగ్రహం.. మలి దశ ఉద్యమంలో అందరిలోనూ గొప్ప స్ఫూర్తిని నింపింది. తెలంగాణ ప్రజల కలలు, భవిష్యత్తును ఆ తల్లి రూపం ఆవిష్కరించింది. అందుకే ప్రాంతీయ సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతిబింబమైన ఆ తల్లి సాక్షిగా కేసీఆర్ నాయకత్వంలో కదన రంగంలోకి దూకిన ప్రజలు తమ కలను సాకారం చేసుకున్నారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడకముందే తెలంగాణ తల్లి విగ్రహ రూపానికి ప్రజలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. ఉద్యమ సమయంలోనే ఊరూరా తెలంగాణ తల్లి విగ్రహాలు వెలిశాయి. అందుకే, స్వరాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తల్లికి కొత్తగా రూపం ఇవ్వాల్సిన అవసరం రాలేదు. కానీ, నేడు తెలంగాణ ఆవిర్భవించి 11 ఏండ్లు పూర్తికావస్తున్న తరుణంలో ప్రజల భావోద్వేగాలతో కాంగ్రెస్ సర్కార్ ఆటలాడుతున్నది. ప్రజల మనోభావాలను వాడుకోవడానికి కొత్త విగ్రహాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఇది ఏ మాత్రం సబబు కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహ రూపంలో మార్పు చేయాలని ప్రతిపాదనను తీసుకొచ్చిన నాటినుంచీ ప్రజలు నిరసన తెలుపుతున్నారు. వాటిని పట్టించుకోకుండా కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించడం ఖండనీయం.
రాష్ట్ర ప్రజలను ఆకర్షించడానికి ఆరు గ్యారెంటీల వంటి అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. 100 రోజుల్లోనే హామీలన్నీ అమలుచేసి తీరుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ.. హామీల అమలుతో పాటు అన్ని రంగాల్లోనూ విఫలమైంది. సాగు ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు, ఉద్యోగాల కల్పన, అభివృద్ధి తదితర అంశాల్లో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్.. హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట పేదల గూళ్లను కూల్చి వ్యతిరేకతను మూటగట్టుకున్నది. ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోయి తిరగబడే పరిస్థితి వచ్చింది. అందుకే, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కుట్రలకు తెరలేపుతున్నది. తెలంగాణ తల్లి విగ్రహ రూపం మార్పు కూడా కాంగ్రెస్ పాలకుల అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేపట్టిన రాజకీయ వ్యూహంలో భాగమేనని చెప్పక తప్పదు.
తెలంగాణ తల్లి అంటే ఒక సాంస్కృతిక చిహ్నం మాత్రమే కాదు, ఉద్యమ సమయంలో నాలుగు కోట్ల మందిలో స్ఫూర్తినింపిన ఆత్మగౌరవ ప్రతీక.. ఉద్యమంలో చరిత్ర సృష్టించిన ప్రతి క్షణానికి గుర్తు.. ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి త్యాగానికి నివాళి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆత్మగౌరవం కోసం పోరాడిన ప్రజలు తమ కలలను తెలంగాణ తల్లి రూపంలో చూశారు. కానీ, కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన కొత్త రూపం రాష్ట్ర ప్రజల కలలను కల్లలుగా చేయడమే కాదు, ఉద్యమ స్ఫూర్తిని పూర్తిగా తుడిచివేసింది. ఎంతో చరిత్ర ఉన్న రూపాన్ని కాదని, ప్రజల అభిప్రాయాలను లెక్క చేయకుండా మొండిగా ముందుకెళ్లడం కాంగ్రెస్ పార్టీ మూర్ఖత్వానికి పరాకాష్ఠ.
తెలంగాణ ప్రజల విశ్వాసాన్ని ఎప్పుడో కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక తెలంగాణ అస్తిత్వం, సాంస్కృతిక చిహ్నాలను కనుమరుగు చేయాలని చూస్తున్నది. కాంగ్రెస్ సర్కార్ రోజురోజుకు నిగ్రహం కోల్పోతున్నది. హస్తం సర్కార్ చేస్తున్నది విగ్రహం రూపంలో మార్పు మాత్రమే కాదు, ఉద్యమ స్ఫూర్తిని కూడా అవమానపరుస్తున్నది. హస్తం పార్టీ పతనానికి ఇదే నాంది పలుకుతుంది.
తెలంగాణ ప్రజలు ఎల్లప్పుడూ తమ ఆత్మగౌరవానికి ప్రాధాన్యమిస్తారు. సాంస్కృతిక మూలాలను దెబ్బతీసే ఏ చర్యనైనా వారు తిరస్కరిస్తారు. సంస్కృతి, ఆత్మగౌరవం, సంప్రదాయాలను కాపాడటంలో బీఆర్ఎస్ ఎప్పుడూ ముందుంటుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ తప్పిదంతో తమ మనోభావాలు దెబ్బతిన్న ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్లుతున్నారు. తెలంగాణ ప్రజలు తమ తల్లి రూపాన్ని ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టనివ్వరు. ఈ నేపథ్యంలో తమ అస్తిత్వం కోసం మరో ఉద్యమం చేసి అయినా సరే తెలంగాణ తల్లిని కాపాడుకుంటరు. ఇది తథ్యం.